దాదా, కుంబ్లే నాయకత్వం నాకు ప్రత్యేకం: పార్థివ్‌

టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ నిజమైన నాయకుడని మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ అన్నాడు. దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే తన జీవితంపై చెరగని ముద్రవేశాడని పేర్కొన్నాడు. అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయంగా భావించానని...

Published : 10 Dec 2020 01:22 IST

ముంబయి: టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ నిజమైన నాయకుడని మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ అన్నాడు. దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే తన జీవితంపై చెరగని ముద్రవేశాడని పేర్కొన్నాడు. అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయంగా భావించానని పేర్కొన్నాడు. 17 ఏళ్ల వయసులో టీమ్‌ఇండియాలో ప్రవేశించిన పార్థివ్ (35 ఏళ్లు)‌ బుధవారం అన్ని ఫార్మాట్లలో వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘సౌరవ్‌ గంగూలీ అత్యుత్తమ నాయకుడని నేనెప్పటికీ భావిస్తుంటా. అతడి నిర్వాహక నైపుణ్యాలు అద్భుతం. సౌరవ్‌, అనిల్‌ కుంబ్లే గొప్ప నాయకులు. నేనిప్పుడున్న వ్యక్తిగా మారేందుకు వారే కారణం. టెస్టు అరంగేట్రం చేసినప్పుడు దాదా ఇచ్చిన టోపీ ఇప్పటికీ నావద్దే ఉంది. దానిపై నాపేరు తప్పుగా ముద్రించారు. హెడింగ్లే (2002), అడిలైడ్‌ (2003-04), రావల్పిండిలో ఓపెనర్‌గా చేసిన అర్ధశతకం నాకెంతో ఇష్టమైన ఘటనలు’ అని పార్థివ్‌ అన్నాడు.

ఏడాది కాలంగా వీడ్కోలు గురించి ఆలోచిస్తున్నా సరైన సమయంగా అనిపించలేదని పార్థివ్‌ పేర్కొన్నాడు. ‘వీడ్కోలు విషయం చెప్పగానే మా కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టారు. అయితే నిర్ణయం తీసుకున్న నేను ప్రశాంతంగా నిద్రపోయాను. 18 ఏళ్లు క్రికెట్లో ఉన్నాను. ఇంకా సాధించేందుకు ఏమీ లేదనిపించింది. దేశవాళీ క్రికెట్లో అన్ని టోర్నీలూ గెలిచాను. మూడు ఐపీఎల్‌ ట్రోఫీలు అందుకున్నాను. గుజరాత్‌ క్రికెట్‌ను సరైన స్థితిలో ఉంచాను’ అని తెలిపాడు.

ఎంఎస్‌ ధోనీ సమయంలో టీమ్‌ఇండియాలో చోటు దక్కకపోవడంతో పార్థివ్‌ రంజీల్లో శ్రమించాడు. ‘భారత్‌ 2009లో న్యూజిలాండ్‌లో ఓసారి పర్యటించింది. రంజీ ట్రోఫీలో నేను 800 పరుగులు చేశాడు. దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో శతకం బాదా. అయినా జాతీయ జట్టుకు పిలుపు రాలేదు. ఇక అంతే అనుకున్నాను. దాంతో గుజరాత్‌ జట్టును నిర్మించడం మొదలుపెట్టాను. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాను. జస్ప్రీత్‌ బుమ్రా, అక్షర్‌ పటేల్‌ వంటి ఆటగాళ్లతో ట్రోఫీలు అందించాను’ అని పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం వృద్ధిమాన్‌ సాహాయే భారత్‌లో అత్యుత్తమ కీపర్‌ అని, టీమ్‌ఇండియాలో చోటు దక్కాలంటే కీపింగ్, బ్యాటింగ్‌ రెండింట్లోనూ అదరగొట్టాల్సి ఉంటుందని వెల్లడించాడు.

ఇవీ చదవండి
ఆసీస్‌పై విజయానికి కారణమదే అంటున్న ఆటగాళ్లు
క్రికెట్‌కు పార్థివ్‌ పటేల్‌ గుడ్‌బై

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని