T20 World Cup:  దక్షిణాఫ్రికా ఔట్‌

దురదృష్టమంటే దక్షిణాఫ్రికాదే. అయిదు మ్యాచ్‌ల్లో నాలుగు నెగ్గినా ఆ జట్టు ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. సెమీస్‌ చేరాలంటే ఘనవిజయం సాధించాల్సిన తన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10....

Updated : 07 Nov 2021 06:15 IST

సఫారీ ఆశలను దెబ్బతీసిన రన్‌రేట్‌

రబాడ హ్యాట్రిక్‌

చెలరేగిన డసెన్‌, మార్‌క్రమ్‌

ఇంగ్లాండ్‌ పరాజయం 

షార్జా

దురదృష్టమంటే దక్షిణాఫ్రికాదే. అయిదు మ్యాచ్‌ల్లో నాలుగు నెగ్గినా ఆ జట్టు ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. సెమీస్‌ చేరాలంటే ఘనవిజయం సాధించాల్సిన తన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. డసెన్‌ (94 నాటౌట్‌; 60 బంతుల్లో 5×4, 6×6), మార్‌క్రమ్‌ (52 నాటౌట్‌; 25 బంతుల్లో 2×4, 4×6) చెలరేగడంతో మొదట దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఛేదనలో ఇంగ్లాండ్‌ 8 వికెట్లకు 179 పరుగులే చేయగలిగింది. మొయిన్‌ అలీ (37; 27 బంతుల్లో 3×4, 2×6) టాప్‌ స్కోరర్‌. షంసి (2/24) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. రబాడ (3/48) హ్యాట్రిక్‌ సాధించాడు. ప్రిటోరియస్‌ రెండు వికెట్లు చేజిక్కించుకున్నాడు.

పోరాడినా..: సెమీస్‌ చేరాలంటే ఇంగ్లాండ్‌ను 131 లేదా అంత కంటే తక్కువకు కట్టడి చేయాల్సిన స్థితిలో దక్షిణాఫ్రికా బౌలింగ్‌ దాడిని ఆరంభించింది. కానీ జేసన్‌ రాయ్‌ (20  రిటైర్డ్‌హర్ట్‌), బట్లర్‌ (26) ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలెట్టారు. 4 ఓవర్లలోనే స్కోరు 37. కానీ అయిదో ఓవర్లో రాయ్‌ రిటైర్డ్‌ హర్ట్‌ కావడం, జట్టు స్కోరు 59కు చేరుకునే సరికి బట్లర్‌, బెయిర్‌స్టో (1) ఔట్‌ కావడంతో.. దక్షిణాఫ్రికా ఆశలు చిగురించాయి. గెలిచేందుకు అవకాశం దక్కినట్లనిపించింది. అయితే ఆ దశలో మొయిన్‌ అలీ కాస్త బ్యాట్‌ ఝుళిపించడంతో సెమీస్‌ దారులు మూసుకుపోయాయి. మలన్‌ (33)తో మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించాక 13వ ఓవర్లో అలీ ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 125/3. విజయానికి ఇంగ్లాండ్‌ 30 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఛేదన క్లిష్టంగా మారింది. కానీ లివింగ్‌స్టోన్‌ (28; 17 బంతుల్లో 1×4, 3×6) వరుసగా మూడు సిక్స్‌లు బాదడంతో 16వ ఓవర్లో (రబాడ) ఏకంగా 21 పరుగులొచ్చాయి. మలన్‌ ఔటైనా.. తర్వాతి ఓవర్లో 11 పరుగులొచ్చాయి. చివరి మూడు ఓవర్లలో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో ఇంగ్లాండ్‌ అవకాశాలు మెరుగయ్యాయి. 19 ఓవర్లు ముగిసేసరికి లివింగ్‌స్టోన్‌ను కోల్పోయిన ఆ జట్టు 176/5తో నిలిచింది. మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. కానీ ఆఖరి ఓవర్‌ తొలి మొదటి మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్‌ సాధించిన రబాడ... ఇంగ్లాండ్‌ ఆశలపై నీళ్లు చల్లాడు.

దంచేశారు..: ఆస్ట్రేలియాను కాదని సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారీ విజయం సాధించాలి. ఎక్కువ స్కోరు చేయాలి.. ప్రత్యర్థిని తక్కువకు పరిమితం చేయాలి. ఇంగ్లాండ్‌పై టాస్‌ ఓడిపోయిన దక్షిణాఫ్రికా పరిస్థితిది. ఈ నేపథ్యంలో బ్యాటుతో తన పనిని సమర్థంగా పూర్తి చేసింది సఫారీ జట్టు. డసెన్‌ అదిరే బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. అయితే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ సాఫీగా ఏమీ మొదలు కాలేదు. మూడో ఓవర్లోనే ఓపెనర్‌ హెండ్రిక్స్‌ (2) ఔటయ్యాడు. డికాక్‌కు డసెన్‌ తోడయ్యాడు. 5 ఓవర్లకు స్కోరు 26 పరుగులే. ఆ తర్వాత స్కోరు వేగం పెరిగింది. వోక్స్‌ బౌలింగ్‌లో డసెన్‌ వరుసగా 4, 6 దంచేశాడు. బ్యాట్స్‌మెన్‌ చక్కగా స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ, అప్పుడప్పుడు బౌండరీలు కొట్టడంతో దక్షిణాఫ్రికా 11 ఓవర్లలో 85/1తో నిలిచింది. జోడీ జోరందుకునే దశలో డికాక్‌ (34; 27 బంతుల్లో 4×4)ను ఔట్‌ చేయడం ద్వారా 71 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని రషీద్‌ విడదీశాడు. కానీ మార్‌క్రమ్‌ రాకతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అతడు, డసెన్‌ పోటీపడుతూ ఫోర్లు, సిక్స్‌లు బాదేశారు. 13వ ఓవర్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న డసెన్‌.. వుడ్‌ వేసిన ఆ ఓవర్‌ చివరి బంతికి సిక్స్‌ కొట్టడంతో దక్షిణాఫ్రికా స్కోరు 100 దాటింది. రషీద్‌ బౌలింగ్‌లో మార్‌క్రమ్‌ సిక్స్‌ బాదేశాడు. డసెన్‌ వరుసగా రెండు సిక్స్‌లు, మార్‌క్రమ్‌ ఓ సిక్స్‌ కొట్టడంతో వోక్స్‌ ఓవర్లో 21 పరుగులొచ్చాయి. వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన మార్‌క్రమ్‌.. అతడి తర్వాతి ఓవర్లో ఓ సిక్స్‌ దంచాడు. జోర్డాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో డసెన్‌, మార్‌క్రమ్‌ చెరో సిక్స్‌ కొట్టారు. కేవలం 24 బంతుల్లో అర్ధశతకం సాధించిన మార్‌క్రమ్‌.. డసెన్‌తో అభేద్యమైన మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించాడు. చివరి 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 71 పరుగులు రాబట్టింది.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: హెండ్రిక్స్‌ (బి) మొయిన్‌ అలీ 2; డికాక్‌ (సి) రాయ్‌ (బి) రషీద్‌ 34; డసెన్‌ నాటౌట్‌ 94; మార్‌క్రమ్‌ నాటౌట్‌ 52; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 189; వికెట్ల పతనం: 1-15, 2-86; బౌలింగ్‌: మొయిన్‌ అలీ 4-0-27-1; వోక్స్‌ 4-0-43-0; రషీద్‌ 4-0-32-1; జోర్డాన్‌ 4-0-36-0; మార్క్‌ వుడ్‌ 4-0-47-0

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ రిటైర్డ్‌ హర్ట్‌ 20; బట్లర్‌ (సి) బవుమా (బి) నార్జ్‌ 26; మొయిన్‌ అలీ (సి) మిల్లర్‌ (బి) షంసి 37; బెయిర్‌స్టో ఎల్బీ (బి) షంసి 1; మలన్‌ (సి) రబాడ (బి) ప్రిటోరియస్‌ 33; లివింగ్‌స్టోన్‌ (సి) మిల్లర్‌ (బి) ప్రిటోరియస్‌ 28; మోర్గాన్‌ (సి) కేశవ్‌ (బి) రబాడ 17; వోక్స్‌ (సి) నార్జ్‌ (బి) రబాడ 7; జోర్డాన్‌ (సి) మిల్లర్‌ (బి) రబాడ 0; రషీద్‌ నాటౌట్‌ 2; మార్క్‌ వుడ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 179; వికెట్ల పతనం: 1-58, 2-59, 3-110, 4-145, 5-165, 6-176, 7-176, 8-176; బౌలింగ్‌: కేశవ్‌ 3-0-23-0; నార్జ్‌ 4-0-34-1; రబాడ 4-0-48-3; షంసి 4-0-24-2; మార్‌క్రమ్‌ 2-0-18-0; ప్రిటోరియస్‌ 3-0-30-2


సెమీస్‌లో ఆస్ట్రేలియా

గ్రూప్‌-1లో సెమీఫైనల్‌ రేసు ముగిసింది. ఇంగ్లాండ్‌ ఒక బెర్తు ఎగరేసుకుపోగా.. ఆఖరి బెర్తును ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శనివారం వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంది. ఆఖరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కూడా ఇంగ్లాండ్‌ను ఓడించి.. 8 పాయింట్లతో ఇంగ్లాండ్‌ (రన్‌రేట్‌ 2.464), ఆస్ట్రేలియా (1.216)లతో సమానంగా నిలిచింది. అయితే కంగారూల జట్టును రన్‌రేట్‌లో వెనక్కి నెట్టి సెమీఫైనల్‌ చేరాలంటే ఇంగ్లాండ్‌ను 131, ఆలోపు కట్టడి చేయాల్సివుండగా.. 179 పరుగులు చేయనిచ్చింది దక్షిణాఫ్రికా(0.739). మిగతా రెండు జట్లతో రన్‌రేట్‌లో వెనకబడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని