33కే వీడ్కోలు.. రైనా భావోద్వేగ లేఖ

ఇంకా వయసుంది. అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడగలిగే సత్తా ఉంది. పరుగుల వరద పారించే కసి ఉంది. అయినా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచాడు సురేశ్‌ రైనా. తన ఎడమచేతి వాటంతో టీమ్‌ఇండియాకు కీలక...

Updated : 17 Aug 2020 09:32 IST

అందరికీ వందనాలు తెలిపిన ధోనీ ఆప్త మిత్రుడు

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఇంకా వయసుంది. అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడగలిగే సత్తా ఉంది. పరుగుల వరద పారించే కసి ఉంది. అయినా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచాడు సురేశ్‌ రైనా. తన ఎడమచేతి వాటంతో టీమ్‌ఇండియాకు కీలక విజయాలు అందించిన అతడు మహీ వీడ్కోలు పలికిన ఐదు నిమిషాలకే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించి విస్మయానికి గురిచేశాడు. 33 ఏళ్లకే కెరీర్‌ను ముగించిన అతడు ఆదివారం భావోద్వేగంతో ఓ లేఖ రాశాడు.

‘మిశ్రమ అనుభూతులతో వీడ్కోలు ప్రకటన చేస్తున్నా. నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచీ గల్లీల్లో ఆడుతూ క్రికెట్‌ను ఇష్టపడ్డాను. చిన్న పట్టణం నుంచి భారత జట్టులో అడుగుపెట్టాను. నాకు తెలిసిందంతా క్రికెట్టే. చేసిందంతా క్రికెట్టే. నా నరనరానా అదే జీర్ణించుకుపోయింది. దేవుడి ఆశీర్వాదం, అండగా నిలిచిన అభిమానుల ప్రేమను ప్రతి రోజూ గుర్తు చేసుకున్నాను. వారి ప్రేమ, అభిమానాలకు విలువ చేకూర్చేందుకే ప్రయత్నించాను. ఆటకు, దేశానికి అంకితమయ్యాను.

ఎన్నో శస్త్రచికిత్సలు జరిగాయి. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు స్తంభించిపోయాను. ఆగిపోతే న్యాయం కాదనే ముందుకు సాగాను. నా ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. అందరి సహకారం లేకుండా ఇది సాధ్యమయ్యేదే కాదు. నా తల్లిదండ్రుల త్యాగాలు, ప్రేమించే భార్య ప్రియాంక, పిల్లలు గ్రేసియా, రియో, సోదరులు, సోదరీమణులు, కుటుంబ సభ్యులు నన్నెంతో ప్రోత్సహించారు. నేను సరైన దారిలో నడిచేందుకు నా కోచ్‌లు మార్గనిర్దేశం వహించారు. గాయాల నుంచి కోలుకొనేందుకు ఫిజీషియన్లు, అత్యుత్తమంగా రాణించేందుకు ట్రైనర్లు సాయం చేశారు.

నీలిరంగు జెర్సీలు ధరించే మా కుర్రాళ్ల సహకారం లేకుండా నా కెరీర్‌ సాగేదే కాదు. అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి ఆడే అదృష్టం నాకు దక్కింది. రాహుల్‌ భాయ్‌, అనిల్‌ భాయ్‌, సచిన్‌ పాజీ, నన్ను స్నేహితుడిగా భావిస్తూ మార్గనిర్దేశం వహించిన మహీ సారథ్యంలో ఆడటం అద్భుతం. బీసీసీఐ, యూపీ క్రికెట్‌ సంఘానికి కృతజ్ఞతలు. ఒక యూపీ కుర్రాడికి టీమ్‌ఇండియా తరఫున ఆడే అవకాశం కల్పించారు.

చివరగా నా అభిమానులకు, ఇన్నేళ్లూ మీరు చూపించిన ప్రేమ, అభిమానాలతోనే పెరిగి పెద్దయ్యాను. అంతర్జాతీయ క్రికెట్లో అత్యున్నతంగా ఎదిగేందుకు అండగా నిలిచిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఎప్పటికీ, మీ సురేశ్‌ రైనా’ అని అతడు భావోద్వేగ లేఖను పోస్ట్‌చేశాడు. దాంతోపాటు ఓ వీడియోనూ జత చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని