Updated : 21/08/2020 12:22 IST

అది కళ్లారా చూశాను.. అదృష్టవంతుడిని

రైనాకు మోదీ సర్‌ప్రైజ్‌.. స్పందించిన సీఎస్కే ఆటగాడు

ఇంటర్నెట్‌డెస్క్‌: స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి ప్రత్యేకంగా లేఖ రాసిన ప్రధాని నరేంద్రమోదీ తాజాగా సురేశ్‌ రైనాకూ లేఖ రాశారు. రెండు పేజీల లేఖలో రైనా సేవలను కొనియాడారు.

‘డియర్‌ సురేశ్‌.. ఆగస్టు 15న మీరు తీసుకున్న నిర్ణయం కచ్చితంగా మీ జీవితంలో చాలా కష్టమైనదనే అనుకుంటున్నా. మీరు చేసిన పనిని నేను ‘రిటైర్మెంట్‌’ అనే పదంతో పేర్కొనలేను. ఎందుకంటే మీకింకా తగినంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. యువకుడిగానే ఉన్నారు. మైదానంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిన మీరు ఇకపై జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నారనే భావిస్తున్నా’

‘క్రికెట్‌లో మీరు జీవించారు. ఆటపట్ల మీకున్న ఆసక్తి చాలా చిన్న వయసులోనే కలిగింది. మురదానగర్‌ గల్లీ నుంచి లఖ్‌నవూ మైదానంలో ఆడటం వరకూ.. అక్కడి నుంచి దేశం గర్వించే స్థాయిలో టీమ్‌ఇండియాకు ఆడటం.. మీ ప్రయాణం ఎంతో గొప్పగా సాగింది. ఈ దేశం మిమ్మల్ని కేవలం బ్యాట్స్‌మన్‌గానే గుర్తుంచుకోదు. అవసరమైన వేళ బౌలర్‌గా, అద్భుతమైన ఫీల్డర్‌లా ఎప్పటికీ నిలిచిపోతారు. అలాగే పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అద్భుతమైన క్యాచ్‌ల్లోనూ మీదైన ముద్ర వేశారు. మైదానంలో చురుకుగా స్పందించి మీరు ఆదా చేసిన పరుగులను లెక్కించాలంటే రోజులు పడతాయి. బ్యాట్స్‌మన్‌గానూ అన్ని ఫార్మాట్లలో మీదైన ముద్ర వేశారు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో కీలక పాత్ర పోషించారు. అలాగే 2011 వన్డే ప్రపంచకప్‌లో మీ ఆటను ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఆస్ట్రేలియాతో క్వార్టర్‌ ఫైనల్లో మీరు ఆడటం నేను కళ్లారా చూశాను. ఆ మ్యాచ్‌కు ప్రత్యక్షంగా హాజరయ్యాను. ఆరోజు భారత్‌ గెలవడంలో మీరు కీలక పాత్ర పోషించారు. అయితే, మీ ముచ్చటైన కవర్‌డ్రైవ్‌లు ఇకపై ఎంతో మంది అభిమానులు చూడలేరని నేను అనుకుంటున్నా. కానీ నేనెంతో అదృష్టవంతుడిని. ఆ మ్యాచ్‌లో మీ బ్యాటింగ్‌ స్టైల్‌ను ప్రత్యక్షంగా చూశాను’ అని మోదీ పేర్కొన్నారు.

‘క్రీడాకారులను అభిమానించేది కేవలం మైదానంలో ప్రవర్తించే తీరు పరంగానే కాదు, బయట కూడా ఎలా ఉంటారనేదానిపైనే ఆధారపడి ఉంటుంది. మీలోని పోరాడే లక్షణం ఎంతో మంది యువకులకు ప్రేరణగా నిలుస్తుంది. మీరాడే రోజుల్లో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఉంటారు. ముఖ్యంగా గాయాల బారిన పడినప్పుడు. కానీ, ఎప్పుడూ వాటిని అధిగమించి పైచేయి సాధించారు. అందుకు ధన్యవాదాలు. అలాగే రైనా అంటే గుర్తొచ్చేది టీమ్‌ఇండియా స్పిరిట్‌. కేవలం మీ వ్యక్తిగత ప్రయోజనం కోసమే కాకుండా జట్టు విజయాల కోసం ఆడారు. మైదానంలో మీ చురుకుదనం అమోఘం. అలాగే ప్రత్యర్థి వికెట్‌ పడితే సంబరాలు చేసుకునే వారిలో మీరే అందరికన్నా ముందుంటారు. అనేక సందర్భాల్లో మేం దాన్ని గమనించాం. అలాగే సమాజం పట్ల మీకున్న ప్రేమ, బాధ్యతతో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. మహిళా సాధికారత విషయంలోనూ స్పందించారు. మీ కార్యక్రమాలతో యువతకు ఆదర్శంగా నిలిచారు. అందుకు నేనెంతో సంతోషిస్తున్నా. ఇక మీ భవిష్యత్‌లో ఏం చేయాలనుకుంటున్నారో ఆ ప్రయాణం మరింత అందంగా సాగాలని కోరుకుంటున్నా. ఈ సమయాన్ని మీ భార్య ప్రియాంక, కూతురు గ్రేసియా, కుమారుడు రియోతో కలిసి ఆనందించాలని మనసారా ఆశిస్తున్నా. చివరగా క్రీడల్లో భారత దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో, అలాగే ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలవడంలో మీకు చేతనైనంత చేశారు. అందుకు ధన్యవాదాలు’ అని మోదీ ముగించారు.

ఈ విషయాన్ని రైనా ట్విటర్‌లో తెలియజేస్తూ మోదీకి కృతజ్ఞతలు తెలిపాడు. దేశం కోసం ఆడేటప్పుడు తాము నెత్తురు, స్వేదాన్ని చిందిస్తామని చెప్పాడు. తామెంతో అభిమానించే ఈ దేశ ప్రజలు తమని ప్రశంసిస్తే అంతకుమించిన ఆనందం ఉండదని, మరీ ముఖ్యంగా ప్రధాని అభినందిస్తే గర్వంగా ఉంటుందన్నాడు. ఈ సందర్భంగా మోదీకి కృతజ్ఞతలు తెలిపాడు. మోదీ అభినందనలను తాను మనసారా ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్