Published : 30/09/2020 13:18 IST

వార్నర్‌ సేనకు మరో వరం ‘నట్టూ బౌలింగ్‌’

సూపర్‌ ఓవర్లో 6కు 6 యార్కర్లతో సంచలనం

స్వింగర్లు.. కట్టర్లు.. యార్కర్లు.. నకుల్‌ బంతులు.. పేసర్ల అమ్ముల పొదిలోని అస్త్రాలు. ఎదుర్కొనే బ్యాట్స్‌మెన్‌ను బట్టి వాటినే మార్చి..మార్చి సంధిస్తుంటారు. అవసరమైతే వేగంలో వైవిధ్యం ప్రదర్శించి బోల్తా కొట్టిస్తారు. క్రికెట్లో ఫాస్ట్‌బౌలర్లు అందరూ అనుసరించే సూత్రం ఇదే. కానీ వరుసగా రెండు ఓవర్లలో 10 యార్కర్లు వేస్తే.. ఇంకా చెప్పాలంటే సూపర్‌ఓవర్లోని ఆరుకు ఆరు బంతుల్నీ యార్కర్లుగానే మలిస్తే.. ‘జేపీ నట్టూ’ అంటారు. కూలీగా మిగిలిపోకుండా కోటీశ్వరుడిగా ఎదిగిన నటరాజన్‌ కథే ఇది.


కట్‌చేస్తే.. 2019

(Image/TNPL)

వేదిక దుబాయ్‌. బెంగళూరుతో హైదరాబాద్‌కు తొలిమ్యాచ్‌. చురకత్తుల్లాంటి బంతులు సంధిస్తూ ఒక ఎడమచేతి వాటం పేసర్‌ అందరి దృష్టినీ ఆకర్షించాడు. 4 ఓవర్లకు 34 పరుగులు ఇచ్చాడు. అయినాసరే భవిష్యత్తులో అతడు వార్నర్‌ సేన విజయాల్లో కీలకపాత్ర పోషిస్తాడని అనిపించింది. మిడిల్‌స్టంప్‌ మీదుగా లెంగ్త్‌ బంతిని వేసి కోహ్లీని ఔట్‌ చేయగానే అతడి ఆత్మవిశ్వాసం మరో స్థాయికి చేరుకుంది. ఈ సారి పోరు అబుదాబికి మారింది. కోల్‌కతాతో మ్యాచ్‌. భువి, ఖలీల్‌తో పాటు నట్టూ కూడా 3 ఓవర్లే వేశాడు. 27 పరుగులిచ్చి కీలకమైన నితీశ్‌ రాణాను పెవిలియన్‌ చేర్చాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ హైదరాబాద్‌ ఓటమి పాలయ్యింది. అందుకే దిల్లీ మ్యాచులో గెలిపించాల్సిన బాధ్యత అందరి పైనా పడింది. వరుసగా మూడో మ్యాచులోనూ పరాజయం పాలైతే టోర్నీలో రాణించడం కష్టమే. అలాంటి కీలక సమరంలో నట్టూ బౌలింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే..!


దేవుడా.. ఆ యార్కర్లు

దిల్లీ మ్యాచులో హైదరాబాద్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసింది. 163 పరుగుల లక్ష్యం విధించింది. నిజానికిది భారీ స్కోరూ కాదు. అలాగని కాపాడుకోలేనిదీ కాదు. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్‌ ప్రత్యర్థిపై క్రమంగా ఒత్తిడి పెంచుతూ తన దళాన్ని పటిష్ఠంగా నడిపించాడు. నటరాజన్‌ అతడికి అండగా నిలిచాడు. ఎవరైనా పేసర్‌.. నాలుగు ఓవర్లు విసిరితే ఎంతో వైవిధ్యం చూపించాలి? బ్యాట్స్‌మన్‌ ఎంతగానో తికమకపెట్టాలి? తన మొదటి రెండు ఓవర్లలో ఇదే పనిచేసిన నట్టూ ఆ తర్వాత వ్యూహం మార్చాడు. దాంతో 14, 18వ ఓవర్లలోనే అతడి బలమేంటో? అసలు సత్తా ఏంటో? అందరికీ తెలిసింది. వేసిన 12 బంతుల్లో దాదాపు 10 యార్కర్లే. అవీ లైన్‌ అండ్‌ లెంగ్త్‌ తప్పనివి. అతడు వేసిన కచ్చితత్వానికి వ్యాఖ్యాతలు, విశ్లేషకులే విస్తుపోయారు. పంత్‌, స్టాయినిస్‌‌, హెట్‌మైయిర్‌ వంటి విధ్వంసకర బ్యాటర్లను క్రీజులోంచి కదలనివ్వలేదు. అత్యంత కచ్చితత్వంతో పాదాల వద్దే బంతిని పిచ్‌ చేశాడు. ఆఖరి ఓవర్లో బీభత్సం సృష్టించగల స్టొయినిస్‌ను అడ్డుకొని 7 పరుగులే ఇవ్వడమంటే సాధారణ విషయం కాదు. అందులోనూ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని 4 ఓవర్లలో 25 పరుగులే ఇచ్చి అదరగొట్టాడు.


ఫ్లాష్‌బ్యాక్‌లో బాధలు

(Image/TNPL)

నట్టూ.. అంతర్జాతీయ ఆటగాళ్లను బెంబేలెత్తించే స్థాయికి ఊరికే చేరుకోలేదు. అతడి ఎదుగుదల వెనక అందరికీ కనిపించని ఆకలి బాధలు, కటిక పేదరిక, కుటుంబ బాధ్యతలూ ఉన్నాయి. తమిళనాడు సేలం జిల్లాలోని చిన్నప్పంపట్టి అనే కుగ్రామం నుంచి తంగరసు నటరాజన్‌ వచ్చాడు. అతడి తండ్రి రోజుకూలీ. తల్లి మాంసం, కూరగాయల విక్రేత. చిన్నప్పట్నుంచి క్రికెట్‌ అంటే ఇష్టం. సరదాగా స్నేహితులతో కలిసి ఆడేవాడు. అలా టెన్నిస్‌ బంతి క్రికెట్లో యార్కర్లు వేయడంలో ఆరితేరాడు. చిన్నచిన్న పోటీల్లో ఆడుతూ కప్పులు గెలవడం అతడికెంతో ఇష్టం. అలా చెన్నై నాలుగో డివిజన్‌లో క్రికెట్‌ ఆడే జయప్రకాశ్‌ కంటపడ్డాడు. ఆయన నట్టూ తల్లిదండ్రుల్ని ఒప్పించి అతడిని చెన్నై తీసుకెళ్లాడు. ‘ఇల్లు..సాధన..ఇల్లు’ అనే సూత్రం నేర్పించాడు. ప్రతిరోజూ ప్రేరణ కల్పించేవాడు. భవిష్యత్తుపై నమ్మకం పెంచేవాడు. ఆయా క్లబ్బుల్లో రాణించిన నట్టూ ‘టీఎన్‌పీఎల్‌’ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. నాలుగైదు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దాంతో అతడి తలరాతే మారిపోయింది. ప్రస్తుతం ‘లైకా కోవై కింగ్స్‌’కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


వేలంలో రూ.3 కోట్లు

2016-17 టీఎన్‌పీఎల్‌ సీజన్లో 7మ్యాచుల్లో 6.93 ఎకానమీతో 11 వికెట్లు తీసిన నటరాజన్‌పై తమిళనాడు క్రికెట్ ‌సంఘం దృష్టిపెట్టింది. ఆ తర్వాత బీసీసీఐ నిర్వహించే పొట్టి క్రికెట్‌ లీగు వేలంలో పంజాబ్‌ జట్టు అతడిని రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. క్రికెట్‌ ఆడకపోయుంటే కూలీగా మారాల్సిన తనకు అన్ని డబ్బులు రావడం ఆనందాన్నిచ్చింది. కానీ ఆరు మ్యాచుల్లో 2 వికెట్లే తీసి 115 పరుగులు ఇవ్వడంతో ఆ తర్వాతి సీజన్‌లో ఆ ఫ్రాంచైజీ అతడిని వదిలేసింది. అయితే టీఎన్‌పీఎల్‌లో అతడి ప్రతిభను గమనించిన మురళీధరన్‌ 2018 వేలంలో రూ.40 లక్షలకు హైదరాబాద్‌ కొనుగోలు చేసేలా కృషిచేశాడు. పూర్తిగా బౌలర్లతో నిండివుండే ఆ జట్టుకు మైదానంలో ప్రాతినిధ్యం వహించే అవకాశం గత రెండేళ్లలో నట్టూకు రాలేదు. అయితే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో 11 మ్యాచుల్లో 225 బంతులు విసిరి 219 పరుగులు ఇచ్చాడు. 16.85 సగటుతో 13 వికెట్లు తీసి అదరగొట్టాడు. తమిళనాడుకు డెత్‌ బౌలర్‌గా ఆవిర్భవించాడు. అలా ఈ సీజన్‌లో హైదరాబాద్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.


కృతజ్ఞతగా ‘జేపీ’

(Image/TNPL)

ఎలాంటి పరిస్థితుల్లోనైనా బంతులు వేసేందుకు నట్టూ భయపడడు. టీఎన్‌పీఎల్‌లో ఒక సూపర్‌ ఓవర్లో ఆరుకు ఆరు బంతులు యార్కర్లే వేయడం ఇందుకు నిదర్శనం. 2016-17 సీజన్లో దుండిగల్‌ డ్రాగన్స్‌, తుటి పేట్రియాట్స్‌ మ్యాచ్‌ టై అయింది. అప్పుడు డ్రాగన్స్‌ సూపర్‌ ఓవర్‌ వేసేందుకు నట్టూనే ఎంచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అభినవ్‌ ముకుంద్‌, వాషింగ్టన్‌ సుందర్‌ క్రీజులో ఉన్నప్పటికీ వరుసగా ఆరు యార్కర్లు సంధించి ఔరా అనిపించాడు. క్రికెట్‌ ద్వారా తన ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎంతో మెరుగ్గా ఉంది. అయితే పేదరికం అనుభవించినప్పుడు నేర్చుకున్న ఆర్థిక పాఠాలను అతడే ఇప్పటికీ అమలు చేస్తాడు. తన తోబుట్టువుకు మెరుగైన విద్యను ఇప్పిస్తున్నాడు. తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటున్నాడు. తన జీవితాన్ని మలుపుతిప్పిన జయప్రకాశ్‌కు కృతజ్ఞతా భావంతో తన జెర్సీ వెనక ‘జేపీ’ పేరును చేర్చుకున్నాడు. అందుకే అతడి జెర్సీపై ‘జేపీ నట్టూ’ అని రాసుంటుంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్