T20 World Cup: ఛాంపియన్ల సై

కుందేలుతో సింహం ఢీకొంటే ఏముంటుంది! అదే సింహం మరో సింహంతో తలపడితే! ఆ మజానే వేరు కదా! ఇప్పుడు అలాంటి పోరుకే వేళైంది! 2019 వన్డే ప్రపంచకప్‌ జగజ్జేత ఇంగ్లాండ్‌ ఒకవైపు.. టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్‌ న్యూజిలాండ్‌

Updated : 10 Nov 2021 07:30 IST

న్యూజిలాండ్‌ × ఇంగ్లాండ్‌

టీ20 ప్రపంచకప్‌ తొలి సెమీస్‌ నేడే

రాత్రి 7.30 నుంచి

కుందేలుతో సింహం ఢీకొంటే ఏముంటుంది! అదే సింహం మరో సింహంతో తలపడితే! ఆ మజానే వేరు కదా! ఇప్పుడు అలాంటి పోరుకే వేళైంది! 2019 వన్డే ప్రపంచకప్‌ జగజ్జేత ఇంగ్లాండ్‌ ఒకవైపు.. టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్‌ న్యూజిలాండ్‌ ఇంకోవైపు! టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో సై అంటున్నాయి. బలాబలాలు చూస్తే ఏ జట్టుకా జట్టే బలీయం! అయితే చరిత్ర మాత్రం ఇంగ్లిష్‌ జట్టువైపే ఉంది. 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో, 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌ పైచేయి సాధిస్తుందా... ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా!

అబుదాబి

బ్యాటింగ్‌ మెరుపులు.. అదరగొట్టే బౌలింగ్‌ ప్రదర్శనలు.. అబ్బురపరిచే ఫీల్డింగ్‌ విన్యాసాలతో అలరిస్తున్న టీ20 ప్రపంచకప్‌లో ఇక అసలు సిసలు సమరానికి వేళైంది. నేడే నాకౌట్‌ పోరాటాలకు తెరలేవనుంది. బుధవారం తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్‌ తలపడుతుంది. దూకుడుకు ప్రశాంతతకు మధ్య జరిగే పోరు ఇది. టైటిల్‌ ఫేవరేట్‌గా టోర్నీలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌.. అంచనాలు నిలబెట్టుకుంటూ సాగుతోంది. గ్రూప్‌-1లో ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఓ ఓటమితో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. మరోవైపు నిలకడగా రాణిస్తున్న కివీస్‌ సైతం అటు గ్రూప్‌- 2లో అయిదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచి.. ఒక దాంట్లో ఓడి రెండో స్థానంతో ముందంజ వేసింది. ఇప్పటికే ఓ సారి పొట్టి కప్పు (2010)ను ఖాతాలో వేసుకున్న ఇంగ్లాండ్‌.. రెండో టైటిల్‌ అందుకోవాలంటే కివీస్‌ గండాన్ని దాటాల్సి ఉంది. ఇక తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టాలంటే న్యూజిలాండ్‌ శక్తికి మించి శ్రమించక తప్పదు..

ఇంగ్లాండ్‌కు గాయాల దెబ్బ.. కానీ

సూపర్‌-12 దశలో చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి కాస్త నిరాశ కలిగించినా.. తిరిగి పుంజుకునే సత్తా ఇంగ్లాండ్‌కు ఉంది. కానీ గాయాలు ఆ జట్టును ఒక్కసారిగా ఇబ్బందుల్లోకి నెట్టాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ సందర్భంగా పిక్క గాయానికి గురైన ఓపెనర్‌ రాయ్‌ మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. ఇక ఆఖరి ఓవర్లలో వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసిన పేసర్‌ మిల్స్‌ తొడ కండరాల గాయంతో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. కీలక సెమీస్‌కు వీళ్ల సేవలు కోల్పోవడం జట్టుకు దెబ్బే.

బ్యాటింగ్‌ బలం: బట్లర్‌, బెయిర్‌స్టో, మలన్‌, కెప్టెన్‌ మోర్గాన్‌లతో కూడిన బ్యాటింగ్‌ బలంగా ఉంది. ముఖ్యంగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్న బట్లర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే టోర్నీలో ఓ సెంచరీ బాదేశాడు. అతనితో కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం ఉంది. రాయ్‌ స్థానంలో బిల్లింగ్స్‌ జట్టులోకి వచ్చే ఆస్కారముంది. స్పిన్నర్లు అలీ, రషీద్‌ గొప్పగా రాణిస్తున్నారు. ముఖ్యంగా అలీ బంతితోనే కాకుండా బ్యాట్‌తో ఎక్కువ విధ్వంసం సృష్టిస్తున్నాడు. మోర్గాన్‌ ఫామ్‌తో పాటు చివరి ఓవర్లలో పరుగులు సమర్పించుకుంటున్న బౌలర్ల బలహీనత జట్టుకు ఆందోళన కలిగిస్తున్నాయి.  పేసర్లు మార్క్‌వుడ్‌, వోక్స్‌, జోర్డాన్‌ ఆఖరి ఓవర్లలో పరుగులు కట్టడి చేస్తే ఆ జట్టుకు తిరుగుండదు.

పిచ్‌ ఎలా ఉంది?

అబుదాబి పిచ్‌ ఆరంభంలో పేసర్లకు సహకరించే అవకాశం మెండుగా ఉంది. అలాగే బ్యాటింగ్‌కు కూడా అనుకూలంగానే ఉంటుంది. బ్యాట్‌కు బంతికి మధ్య మంచి పోరుగా మారే అవకాశముంది. రాత్రి పూట మ్యాచ్‌లో మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసే జట్టుకు ప్రయోజనం కలుగుతోంది. సెమీస్‌లో టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశముంది.

పేసే బలం  

కెప్టెన్‌ విలియమ్సన్‌ ప్రశాంత మంత్రమే న్యూజిలాండ్‌కు రక్షగా మారింది. ఆటగాళ్ల దూకుడుకు తన ప్రశాంతతను జోడించిన అతను మంచి ఫలితాలు రాబడుతున్నాడు. ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే పాక్‌ చేతిలో కివీస్‌ ఓడినప్పటికీ.. ఆ తర్వాత భారత్‌పై గెలుపుతో సహా నాలుగు విజయాలు సాధించింది. తీవ్ర ఒత్తిడిలోనూ ఆ జట్టు గొప్పగా ఆడుతోంది. ఏ ఒక్క ఆటగాడిపైనే ఆధారపడకుండా సమష్టిగా సత్తాచాటుతోంది.

బౌలింగే ఆయుధం: దుర్భేద్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని గొప్పగా కట్టడి చేస్తోంది కివీస్‌. సీనియర్‌ పేస్‌ ద్వయం బౌల్ట్‌, సౌథీతో పాటు మిల్నె, స్పిన్నర్లు సోధి, శాంట్నర్‌ పూర్తిస్థాయిలో రాణిస్తున్నారు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడే ఇంగ్లాండ్‌ బ్యాటర్లకు తమ పేసర్లతో చెక్‌ పెట్టేందుకు కివీస్‌ సిద్ధమైంది. దుబాయ్‌, షార్జాలతో పోలిస్తే అబుదాబిలో పవర్‌ప్లేలో సీమర్ల సగటు (17.38) గొప్పగా ఉంది. ఈ పరిస్థితుల్లో బౌల్ట్‌, సౌథీ, మిల్నె మంచి సీమ్‌, స్వింగ్‌, బౌన్స్‌ రాబడితే ప్రత్యర్థిని కష్టాల్లోకి నెట్టొచ్చు. మరోవైపు ఇంగ్లాండ్‌పై సోధికి మంచి రికార్డు లేకపోవడం ఒక్కటే ప్రతికూలాంశం. ఆ జట్టుతో మ్యాచ్‌ల్లో అతని ఎకానమీ ఓవర్‌కు 11కుపైగా ఉంది.

ఆ ఒక్కటి అధిగమిస్తే: గప్తిల్‌, మిచెల్‌, విలియమ్సన్‌, కాన్వే, ఫిలిప్స్‌, నీషమ్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగానే కనిపిస్తున్నా.. కచ్చితంగా రాణిస్తారనే నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి జట్టుది. విలియమ్సన్‌ ఇంకా వేగాన్ని అందుకోవాల్సి ఉంది. ఈ టోర్నీలో ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న గప్తిల్‌ అదే ఫామ్‌ కొనసాగించాలని జట్టు కోరుకుంటోంది. చివరి ఓవర్లలో పరుగులు కట్టడిలో విఫలమవుతున్న ప్రత్యర్థి పేసర్ల బలహీనతను సొమ్ము చేసుకోవాలని భావిస్తున్న కివీస్‌.. అందుకు చేతిలో వికెట్లు ఉంచుకోవడం అవసరం.

జట్లు (అంచనా):

ఇంగ్లాండ్‌: బట్లర్‌, బెయిర్‌స్టో, మొయిన్‌ అలీ, మలన్‌, మోర్గాన్‌, లివింగ్‌స్టోన్‌, బిల్లింగ్స్‌, రషీద్‌, వోక్స్‌, మార్క్‌వుడ్‌, జోర్డాన్‌

న్యూజిలాండ్‌: గప్తిల్‌, మిచెల్‌, విలియమ్సన్‌, కాన్వే, ఫిలిప్స్‌, నీషమ్‌, శాంట్నర్‌, సోధి, మిల్నె, సౌథీ, బౌల్ట్‌.


5

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకూ ఈ రెండు జట్లు అయిదు మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇంగ్లాండ్‌ మూడు, న్యూజిలాండ్‌ రెండు సార్లు గెలిచాయి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని