IPL 2021: చెన్నై అడుగేసింది

చెన్నై సూపర్‌ కింగ్స్‌ దర్జాగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సివుండగానే తర్వాతి దశకు చేరుకుంది. జోరుమీదున్న ఆ జట్టు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటలు సాగలేదు. మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమైనా.. ఆఖరి వరకు పోరాడినా సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. 11 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలతో సూపర్‌కింగ్స్‌

Updated : 01 Oct 2021 09:46 IST

ప్లేఆఫ్స్‌లో ప్రవేశం

సన్‌రైజర్స్‌ మళ్లీ ఓటమి బాట

చెన్నై సూపర్‌ కింగ్స్‌ దర్జాగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సివుండగానే తర్వాతి దశకు చేరుకుంది. జోరుమీదున్న ఆ జట్టు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటలు సాగలేదు. మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమైనా.. ఆఖరి వరకు పోరాడినా సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. 11 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలతో సూపర్‌కింగ్స్‌ ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా ఘనత సాధించింది. మరోవైపు హైదరాబాద్‌ 11 మ్యాచ్‌ల్లో తొమ్మిదో ఓటమితో అధికారికంగా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

షార్జా

చెన్నై సూపర్‌కింగ్స్‌ అదరగొట్టింది.. ఆ జట్టు మరో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం   6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. మొదట సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా (44; 46 బంతుల్లో 1×4, 2×6) ఆ జట్టులో టాప్‌ స్కోరర్‌. రుతురాజ్‌ గైక్వాడ్‌ (45; 38 బంతుల్లో 4×4, 2×6), డుప్లెసిస్‌ (41; 36 బంతుల్లో 3×4, 2×6) సత్తా చాటడంతో చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

ఆరంభంలో చకచకా..: ఛేదనలో చెన్నై చకచకా సాగిపోయింది. తొలి రెండు ఓవర్లలో ఆచితూచి ఆడిన ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌ ఆ తర్వాత టాప్‌గేర్‌లోకి వచ్చేశారు. నాలుగో ఓవర్లో వీరిద్దరూ భువనేశ్వర్‌కు చెరో సిక్స్‌ వడ్డించారు. పవర్‌ప్లే చివరికి చెన్నై 47/0తో లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ఈ జోడీ బలపడుతున్న సమయంలో రుతురాజ్‌ను హోల్డర్‌ ఔట్‌ చేశాడు. అప్పటికి చెన్నై స్కోరు 75/1. ఆ తర్వాత మొయీన్‌ అలీ (17) తో కలిసి డుప్లెసిస్‌ చెన్నైను విజయం దిశగా తీసుకెళ్లాడు.

6 పరుగులు..3 వికెట్లు: రెండు ఓవర్ల తేడాతో మొయీన్‌, రైనా (2), డుప్లెసిస్‌ వికెట్లు కోల్పోయిన చెన్నై 108/4తో ఇబ్బందుల్లో పడింది. ఈ మూడు వికెట్లను ఆ జట్టు కేవలం 6 పరుగుల తేడాతో నష్టపోయింది. కానీ ఒత్తిడికి గురి కాకుండా ఆడిన ధోని (14 నాటౌట్; 11 బంతుల్లో 1×4, 1×6), అంబటి రాయుడు (17 నాటౌట్‌; 13 బంతుల్లో 1×4, 1×6) జోడీ చెన్నైను గెలిపించారు. చివరి ఓవర్లో సిక్స్‌తో ధోని జట్టును విజయతీరాలకు చేర్చాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హోల్డర్‌ (3/27) రాణించాడు.

సన్‌రైజర్స్‌ కట్టడి: టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. ఆరంభంలో రెండు ఓవర్లకు ఆ జట్టు చేసింది 5 పరుగులే. మూడో ఓవర్లో రెండు మెరుపు సిక్స్‌లతో సాహా స్కోరు బోర్డుకు జోష్‌ తెచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే హైదరాబాద్‌కు గట్టి దెబ్బ తగిలింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో చెలరేగి ఆడి జట్టును గెలిపించిన జేసన్‌ రాయ్‌ (2; 7 బంతుల్లో) భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో హేజిల్‌వుడ్‌ (3/24) బౌలింగ్‌లో ధోనికి చిక్కాడు. మరోవైపు సాహా స్ట్రెయిట్‌ హిట్టింగ్‌తో స్కోరుబోర్డును కదిలించే ప్రయత్నం చేసినా సన్‌రైజర్స్‌ గాడిన పడలేదు. బ్రావో తాను వేసిన తొలి ఓవర్లోనే ఓ ఫుల్‌ బంతితో విలియమ్సన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని సన్‌రైజర్స్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. సాహా కూడా కొద్దిసేపటికే పెవలియన్‌ చేరాడు. ప్రియమ్‌ గార్గ్‌ (7) కూడా వెనుదిరగడంతో సన్‌రైజర్స్‌ 13 ఓవర్లకు 74/4తో నిలిచింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆ జట్టు 7-13 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. సమద్‌ (18), అభిషేక్‌ శర్మ (18) ఎదురుదాడి చేసినా అది కొద్దిసేపే. వారిద్దరిని హేజిల్‌వుడ్‌ ఒకే ఓవర్లో ఔట్‌ చేసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. ఆఖర్లో రషీద్‌ఖాన్‌ (17 నాటౌట్‌) కాస్త వేగంగా ఆడి జట్టుకు ఓ మోస్తరు స్కోరు అందించాడు. పొదుపుగా బౌలింగ్‌ చేసిన బ్రావో 10 డాట్‌ బాల్స్‌ వేయడంతో పాటు 17 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) ధోని (బి) హేజిల్‌వుడ్‌ 2; సాహా (సి) ధోని (బి) జడేజా 44; విలియమ్సన్‌ ఎల్బీ (బి) బ్రావో 11; ప్రియమ్‌ గార్గ్‌ (సి) ధోని (బి) బ్రావో 7; అభిషేక్‌ శర్మ (సి) డుప్లెసిస్‌ (బి) హేజిల్‌వుడ్‌ 18; సమద్‌ (సి) మొయీన్‌ (బి) హేజిల్‌వుడ్‌ 18; హోల్డర్‌ (సి) దీపక్‌ చాహర్‌ (బి) శార్దూల్‌ 5; రషీద్‌ నాటౌట్‌ 17; భువనేశ్వర్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 134; వికెట్ల పతనం: 1-23, 2-43, 3-66, 4-74, 5-109, 6-110, 7-117; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-32-0; హేజిల్‌వుడ్‌ 4-0-24-3; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-37-1; బ్రావో 4-0-17-2; జడేజా 3-0-14-1; మొయీన్‌ అలీ 1-0-5-0

చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) విలియమ్సన్‌ (బి) హోల్డర్‌ 45; డుప్లెసిస్‌ (సి) కౌల్‌ (బి) హోల్డర్‌ 41; మొయీన్‌ అలీ (బి) రషీద్‌ 17; రైనా ఎల్బీ (బి) హోల్డర్‌ 2; రాయుడు నాటౌట్‌ 17; ధోని నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 139; వికెట్ల పతనం: 1-75, 2-103, 3-107, 4-108; బౌలింగ్‌: సందీప్‌శర్మ 3-0-18-0; భువనేశ్వర్‌ 4-0-34-0; హోల్డర్‌ 4-0-27-3; రషీద్‌ఖాన్‌ 4-0-27-1; సిద్దార్థ్‌ కౌల్‌ 2.4-0-24-0; అభిషేక్‌శర్మ 2-0-9-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని