IPL 2021: విజయాన్ని లాగేసింది

111/0.. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 13 ఓవర్లకు చేసిన స్కోరిది. ఓపెనర్లు కోహ్లి, పడిక్కల్‌ అర్ధశతకాలు సాధించి జోరుమీదున్నారు. ఇంకా డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌ ఆడాల్సి ఉంది. ఆర్‌సీబీ 200 దాటడం, మ్యాచ్‌ గెలవడం లాంఛనమే అన్న అభిప్రాయానికి వచ్చేశారు అభిమానులు. కానీ అనూహ్యం.. చివరికి బెంగళూరు చేసింది 156 పరుగులే. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకున్న చెన్నై...

Updated : 25 Sep 2021 06:42 IST

బెంగళూరు జోరుకు చెన్నై బ్రేక్‌ 

ఏడో విజయంతో ప్లేఆఫ్‌కు మరింత చేరువ

111/0.. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 13 ఓవర్లకు చేసిన స్కోరిది. ఓపెనర్లు కోహ్లి, పడిక్కల్‌ అర్ధశతకాలు సాధించి జోరుమీదున్నారు. ఇంకా డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌ ఆడాల్సి ఉంది. ఆర్‌సీబీ 200 దాటడం, మ్యాచ్‌ గెలవడం లాంఛనమే అన్న అభిప్రాయానికి వచ్చేశారు అభిమానులు. కానీ అనూహ్యం.. చివరికి బెంగళూరు చేసింది 156 పరుగులే. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకున్న చెన్నై... బంతితో ఆర్‌సీబీకి కళ్లెమేసి, ఆపై బ్యాట్‌తో సత్తా చాటి ఐపీఎల్‌-14లో ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్‌కు చేరువైంది.

షార్జా: మ్యాచ్‌ను పేలవంగా ఆరంభించినా, మధ్యలో గొప్పగా పుంజుకున్న చెన్నై ఐపీఎల్‌ రెండో అంచెలో మరో స్ఫూర్తిదాయక విజయాన్నందుకుంది. శుక్రవారం ఆ జట్టు 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. మొదట బెంగళూరు 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. పడిక్కల్‌ (70; 50 బంతుల్లో 5×4, 3×6), కోహ్లి (53; 41 బంతుల్లో 6×4, 1×6) రాణించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  బ్రావో (3/24) ఆ జట్టును దెబ్బ తీశాడు. చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నందుకుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (38; 26 బంతుల్లో 4×1, 1×6), అంబటి రాయుడు (32; 22 బంతుల్లో 3×4, 1×6), డుప్లెసిస్‌ (31; 26 బంతుల్లో 2×4, 2×6) సత్తా చాటారు.

చెన్నై దూకుడు: ఛేదనలో చెన్నై దూకుడుగా ఆడింది. ముంబయితో పోరులో మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడిన రుతురాజ్‌ గైక్వాడ్‌ అదే జోరు ప్రదర్శించాడు. స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. మరోవైపు డుప్లెసిస్‌ కూడా ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో చెన్నై ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోయింది. పవర్‌ ప్లే చివరికి ఆ జట్టు 59/0తో నిలిచింది. ఈ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో చాహల్‌ బౌలింగ్‌లో కోహ్లి పట్టిన మెరుపు డైవింగ్‌ క్యాచ్‌కు రుతురాజ్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత ఓవర్లోనే డుప్లెసిస్‌ కూడా ఔట్‌ కావడంతో చెన్నై 71/2తో నిలిచింది. ఈ స్థితిలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆర్‌సీబీ ఒత్తిడి పెంచింది. కానీ ఎదురుదాడి చేసిన అంబటి రాయుడు, మొయిన్‌ అలీ (23; 18 బంతుల్లో 2×6) చెన్నైని గెలుపు బాట పట్టించారు. వీళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైనా.. రైనా (16 నాటౌట్‌), కెప్టెన్‌ ధోని (11 నాటౌట్‌) మిగతా పని పూర్తి చేశారు.

అలా ఆరంభించి..: అంతకుముందు బెంగళూరు ఇన్నింగ్స్‌ ఆరంభమైన తీరుకు.. ముగిసిన విధానానికి పొంతనే లేదు. ఒక దశలో 140/1తో ఉన్న ఆ జట్టు చివరికి 156/6తో ఇన్నింగ్స్‌ను ముగించింది. కోహ్లి, పడిక్కల్‌ దూకుడుగా ఆడటంతో పవర్‌ ప్లే ఆఖరికి బెంగళూరు 55/0తో నిలిచింది.  ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకుని భాగస్వామ్యాన్ని 100 దాటించారు. అయితే బ్రావో బౌలింగ్‌లో విరాట్‌.. ఔటవడంతో 111 పరుగుల వద్ద తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అయినా సరే డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌ లాంటి హిట్టర్లు ఉండడంతో ఆర్‌సీబీ భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపించింది. కానీ బెంగళూరు దూకుడుకు చెన్నై బ్రేక్‌ వేసింది. పడిక్కల్‌తో పాటు విధ్వంసక బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ (12)ను వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చిన శార్దూల్‌ ఠాకూర్‌ (2/29) బెంగళూరును గట్టి దెబ్బ కొట్టాడు. మ్యాక్స్‌వెల్‌ (11; 9 బంతుల్లో) క్రీజులో ఉన్నా వేగంగా ఆడలేకపోయాడు. బ్రావో (3/24) వేసిన చివరి ఓవర్లో మ్యాక్స్‌వెల్‌తో పాటు హర్షల్‌ పటేల్‌ (3) వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ.. 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి 10 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 90 పరుగులు చేసిన ఆ జట్టు.. చివరి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 66 పరుగులే చేయగలిగింది.

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) జడేజా (బి) బ్రావో 53;  పడిక్కల్‌ (సి) రాయుడు (బి) శార్దూల్‌ 70; డివిలియర్స్‌ (సి) రైనా (బి) శార్దూల్‌ 12; మ్యాక్స్‌వెల్‌ (సి) జడేజా (బి) బ్రావో 11; డేవిడ్‌ (సి) రైనా (బి) దీపక్‌ చాహర్‌ 1; హర్షల్‌ (సి) రైనా (బి) బ్రావో 3; హసరంగ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156; వికెట్ల పతనం: 1-111, 2-140, 3-140, 4-150, 5-154, 6-156; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-35-1; హేజిల్‌వుడ్‌ 4-0-34-0; శార్దూల్‌ 4-0-29-2; జడేజా 4-0-31-0; బ్రావో 4-0-24-3;

చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) కోహ్లి (బి) చాహల్‌ 38; డుప్లెసిస్‌ (సి) సైని (బి) మ్యాక్స్‌వెల్‌ 31; మొయిన్‌ అలీ (సి) కోహ్లి (బి) హర్షల్‌ 23; రాయుడు (సి) డివిలియర్స్‌ (బి) హర్షల్‌ 32; రైనా నాటౌట్‌ 17; ధోని నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 157 వికెట్ల పతనం: 1-71, 2-71, 3-118, 4-133; బౌలింగ్‌: సిరాజ్‌ 3-0-23-0; సైని 2-0-25-0; హసరంగ 4-0-40-0; హర్షల్‌ పటేల్‌ 3.1-0-25-2; చాహల్‌ 4-0-26-1; మ్యాక్స్‌వెల్‌ 2-0-17-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని