IPL 2021: బెంగళూరు ముందుకు.. పంజాబ్‌ ఇంటికి!

81/0.. 165 పరుగుల ఛేదనలో 10 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ స్కోరిది. క్రీజులో రాహుల్‌, మయాంక్‌ జోరు మీదున్నారు. ఆ దశలో ఆ జట్టు గెలుపు ఖాయమని.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఓటమి తప్పదనే అంతా అనుకున్నారు.

Updated : 04 Oct 2021 08:55 IST

 ప్లేఆఫ్స్‌ చేరిన కోహ్లీసేన

 8వ ఓటమితో కింగ్స్‌ ఔట్‌!

81/0.. 165 పరుగుల ఛేదనలో 10 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ స్కోరిది. క్రీజులో రాహుల్‌, మయాంక్‌ జోరు మీదున్నారు. ఆ దశలో ఆ జట్టు గెలుపు ఖాయమని.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఓటమి తప్పదనే అంతా అనుకున్నారు. కానీ బెంగళూరు అద్భుతమే చేసింది. గొప్పగా పుంజుకున్న కోహ్లీసేన.. ప్రత్యర్థిని కట్టడి చేసి విజయతీరాలకు చేరింది. తమకు అలవాటైన రీతిలో పంజాబ్‌ మిడిలార్డర్‌ మరోసారి నిరాశపర్చగా.. గొప్ప పోరాటంతో విజయాన్ని అందుకున్న బెంగళూరు వరుసగా రెండో సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఇంకో మ్యాచ్‌ మాత్రమే మిగిలుండగా.. ఎనిమిదో ఓటమిని ఖాతాలో వేసుకున్న పంజాబ్‌ ప్లేఆఫ్స్‌కు దూరమైనట్లే!

షార్జా

సారి ఎలాగైనా తొలి ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం  చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న బెంగళూరు ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఆదివారం ఆరు  పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించిన ఆ జట్టు.. 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ చేరింది. మొదట ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ మ్యాక్స్‌వెల్‌ (57; 33 బంతుల్లో 3×4, 4×6) చెలరేగాడు. దేవ్‌దత్‌   పడిక్కల్‌ (40; 38 బంతుల్లో 4×4, 2×6) రాణించాడు. పంజాబ్‌ బౌలర్లలో హెన్రిక్స్‌ (3/12), షమి (3/39) సత్తాచాటారు. చాహల్‌ (3/29) ధాటికి పంజాబ్‌ 6 వికెట్లకు 158 పరుగులే చేసింది. ఓపెనర్లు మయాంక్‌ (57; 42 బంతుల్లో 6×4, 2×6), రాహుల్‌ (39; 35 బంతుల్లో 1×4, 2×6) పోరాడినా ఫలితం లేకపోయింది.

పంజాబ్‌ మళ్లీ అలాగే..: గత మ్యాచ్‌లో విజయంతో గాడిన పడ్డట్లు కనిపించిన పంజాబ్‌ మళ్లీ చేతులెత్తేసింది.మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక ఓటమి పాలైంది. రాహుల్‌, మయాంక్‌ తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించి జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. కాస్త నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఈ జోడీ ఆ తర్వాత బౌండరీల వేటలో దూసుకెళ్లడంతో పది ఓవర్లు ముగిసే సరికి 81/0తో జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది. కానీ తర్వాతి ఓవర్లోనే రాహుల్‌ను ఔట్‌ చేసిన షాబాజ్‌ (1/29) ఆర్సీబీని తిరిగి పోటీలోకి తెచ్చాడు. అక్కడి నుంచి చాహల్‌ మాయాజలం మొదలైంది. పూరన్‌ (3)ను అతను వెనక్కిపంపడం.. హర్షల్‌ (0/27), గార్టన్‌ (1/27) కట్టుదిట్టంగా బంతులేయడంతో 14 ఓవర్లకు ఆ జట్టు 102/2తో నిలిచింది. మార్‌క్రమ్‌ (20) దూకుడు ప్రదర్శించడం, మాయంక్‌ క్రీజులో ఉండడంతో అప్పటికీ పంజాబ్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. కానీ మళ్లీ బంతి అందుకున్న చాహల్‌ ఒకే ఓవర్లో మయాంక్‌, సర్ఫరాజ్‌ (0)లను ఔట్‌ చేసి మ్యాచ్‌ మలుపు తిప్పాడు. ఆ తర్వాత మార్‌క్రమ్‌ను గార్టన్‌ పెవిలియన్‌ చేర్చడంతో పంజాబ్‌లో ఆందోళన మొదలైంది. ఆ జట్టు విజయానికి 3 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సిన దశలో హర్షల్‌ ఓవర్లో షారుఖ్‌ సిక్స్‌తో సహా 10 పరుగులు రావడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ 19వ ఓవర్‌ గొప్పగా వేసిన సిరాజ్‌ 8 పరుగులే ఇవ్వడంతో పంజాబ్‌కు చివరి ఓవర్లో 19 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ హర్షల్‌ ప్రత్యర్థి బ్యాటర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి బంతికే షారుఖ్‌ను రనౌట్‌ చేయడంతో పాటు ఉత్తమంగా బౌలింగ్‌ చేసి జట్టును గెలిపించాడు.

మ్యాక్సీ మెరుపులు..: అంతకుముందు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ మెరుగ్గా మొదలై.. మధ్యలో నెమ్మదించి.. మ్యాక్స్‌వెల్‌ బాదుడుతో వాయువేగాన్ని అందుకుంది. కానీ చివర్లో వికెట్లు కోల్పోయి అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్లు కోహ్లి (25), పడిక్కల్‌ ఆర్సీబీకి మంచి ఆరంభాన్నిచ్చారు. 6 ఓవర్లలో ఆర్సీబీ 55/0తో నిలిచింది. కానీ హెన్రిక్స్‌.. కోహ్లి, క్రిస్టియన్‌ (0), పడిక్కల్‌లను వెనక్కిపంపి ఆర్సీబీని గట్టి దెబ్బకొట్టాడు. దీంతో 12 ఓవర్లకు  ఆ జట్టు 73/3తో నిలిచింది. తర్వాత మ్యాక్స్‌వెల్‌ చెలరేగడంతో ఆర్సీబీ స్కోరు 160 దాటింది.

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) హెన్రిక్స్‌ 25; దేవ్‌దత్‌ (సి) రాహుల్‌ (బి) హెన్రిక్స్‌ 40; క్రిస్టియన్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) హెన్రిక్స్‌ 0; మ్యాక్స్‌వెల్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) షమి 57; డివిలియర్స్‌ రనౌట్‌ 23; షాబాజ్‌ (బి) షమి 8; భరత్‌ నాటౌట్‌ 0; గార్టన్‌ (బి) షమి 0; హర్షల్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164; వికెట్ల పతనం:  1-68, 2-68, 3-73, 4-146, 5-157, 6-163, 7-163;  బౌలింగ్‌: మార్‌క్రమ్‌ 1-0-5-0; షమి 4-0-39-3; అర్ష్‌దీప్‌ 3-0-42-0; బిష్ణోయ్‌ 4-0-35-0; హర్‌ప్రీత్‌ 4-0-26-0; హెన్రిక్స్‌ 4-0-12-3

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) హర్షల్‌ (బి) షాబాజ్‌ 39; మయాంక్‌ (సి) సిరాజ్‌ (బి) చాహల్‌ 57; పూరన్‌ (సి) పడిక్కల్‌ (బి) చాహల్‌ 3; మార్‌క్రమ్‌ (సి) క్రిస్టియన్‌ (బి) గార్టన్‌ 20; సర్ఫరాజ్‌ (బి) చాహల్‌ 0; షారుఖ్‌ రనౌట్‌ 16; హెన్రిక్స్‌ నాటౌట్‌ 12; హర్‌ప్రీత్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 158; వికెట్ల పతనం:  1-91, 2-99, 3-114, 4-121, 5-127, 6-146; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-33-0; గార్టన్‌ 4-0-27-1; షాబాజ్‌ అహ్మద్‌ 3-0-29-1; హర్షల్‌ 4-0-27-0; చాహల్‌ 4-0-29-3; క్రిస్టియన్‌ 1-0-11-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని