Updated : 30/10/2021 07:11 IST

Leander Paes: రాకెట్‌ వదిలి.. రాజకీయాలకు కదిలి

టీఎంసీలో చేరిన లియాండర్‌ పేస్‌

ఆటకు వీడ్కోలు పలికినట్లు ప్రకటన

ఈనాడు క్రీడావిభాగం

భారత టెన్నిస్‌ చరిత్రలో ఓ వీరుడి సుదీర్ఘ ప్రస్థానానికి తెరపడింది. మూడు దశాబ్దాల పాటు తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వేదికపై మువ్వన్నెల పతాకాన్ని ఎగరేసిన ఆ దిగ్గజం.. ఇప్పుడు కోర్టుకు గుడ్‌బై చెప్పేశాడు. ఎన్నో ప్రతిష్ఠాత్మక విజయాలను అందించిన అతని రాకెట్‌ ఇక సెలవు తీసుకుంది. దేశంలో టెన్నిస్‌కు ఆదరణ పెంచి.. ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన అతని అడుగులు.. ఇప్పుడు రాజకీయాల వైపు సాగాయి. అతనే.. ప్రపంచ డబుల్స్‌ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన లియాండర్‌ పేస్‌. 48 ఏళ్ల వయసులో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)లో చేరిన అతను.. ఆట నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నట్లు శుక్రవారం ప్రకటించాడు.

భారత టెన్నిస్‌ అంటే ముందుగా లియాండర్‌ పేరు గుర్తుకు వస్తుందనడంలో సందేహం లేదు. దేశ టెన్నిస్‌ చరిత్రలో అతని అధ్యాయం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 1991లో ప్రొఫెషనల్‌ ఆటగాడిగా మారిన అతను.. ఈ 30 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ప్రతిష్ఠాత్మక విజయాలు అందుకున్నాడు. దేశానికి ఎన్నో చిరస్మరణీయ జ్ఞాపకాలను అందించాడు. కోల్‌కతాలో పుట్టిన పేస్‌.. అంతర్జాతీయ ప్లేయర్లైన తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టెన్నిస్‌ వైపు నడిచాడు. చిన్నతనంలోనే రాకెట్‌ పట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. జూనియర్‌ స్థాయిలోనే సంచలనాలు నమోదు చేశాడు. యుఎస్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ ఓపెన్‌ గెలిచి జూనియర్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచాడు. అప్పుడే అతనిలోని సత్తా ప్రపంచానికి తెలిసింది. భారత్‌ నుంచి ఓ యువ టెన్నిస్‌ ఆటగాడు దూసుకొస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి అతని రాకెట్‌కు తిరుగు లేకుండా పోయింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మరపురాని విజయాలు సాధించిన అతను.. 2020 టోక్యో ఒలింపిక్స్‌ ఆడిన తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని గతంలో ప్రకటించాడు. కానీ కరోనా కారణంగా ఆ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడడం.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడంతో ఇన్ని రోజులు మౌనంగానే ఉండిపోయాడు. తాజాగా టీఎంసీలో చేరడంతో టెన్నిస్‌ నుంచి వీడ్కోలు తీసుకున్నట్లు ప్రకటించాడు.
తగ్గేదేలే అన్నట్లు..: 17 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ఆటగాడిగా మారిన లియాండర్‌ సంచలన ప్రదర్శనతో దూసుకెళ్లాడు. 22 ఏళ్లకే 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌ టెన్నిస్‌లో భారత్‌కు పతకం అందించిన ఏకైక ఆటగాడిగా పేస్‌ కొనసాగుతున్నాడు. 1992 నుంచి 2016 వరకూ వరుసగా ఏడు ఒలింపిక్స్‌ల్లో పాల్గొన్న తొలి టెన్నిస్‌ ప్లేయర్‌గా, ఏకైక భారత అథ్లెట్‌గా అతను నిలిచాడు. ఇక డబుల్స్‌ ఆటగాడిగా అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. టెన్నిస్‌ డబుల్స్‌ విభాగానికి పర్యాయ పదంగా మారిన అతను.. తన కెరీర్‌లో ఏకంగా 18 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచాడు. అందులో 10 మిక్స్‌డ్‌ డబుల్స్‌లో, 8 పురుషుల డబుల్స్‌లో నెగ్గాడు. ఈ రెండు విభాగాల్లోనూ కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించాడు. ఇక డేవిస్‌ కప్‌ చరిత్రలోనే 45 డబుల్స్‌ విజయాలతో ఆల్‌టైమ్‌ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. దేశ క్రీడా అత్యున్నత పురస్కారమైన ఖేల్‌రత్నను దక్కించుకున్న అతను.. మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషన్‌ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. టెన్నిస్‌లో దిగ్గజంగా ఎదిగిన పేస్‌.. ఇప్పుడు రాజకీయాలపై దృష్టి సారించాడు. టెన్నిస్‌ ఆటగాడిగా రాకెట్‌ పట్టి కోర్టులో సంచలనాలు నమోదు చేసిన అతను.. రాజకీయ నాయకుడిగా తన రెండో ఇన్నింగ్స్‌లో విజయవంతం అవుతాడేమో చూడాలి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని