IND vs NZ: కివీస్‌తో సిరీస్‌కు సీనియర్లకు విశ్రాంతి

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. బయో బబుల్‌లో సుదీర్ఘంగా ఉంటుండటం.. టీ20 ప్రపంచకప్‌ ముగిసిన మూడు రోజులకే కివీస్‌తో

Updated : 15 Oct 2021 10:41 IST

దిల్లీ: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. బయో బబుల్‌లో సుదీర్ఘంగా ఉంటుండటం.. టీ20 ప్రపంచకప్‌ ముగిసిన మూడు రోజులకే కివీస్‌తో సిరీస్‌ ప్రారంభం కానుండటమే ఇందుకు కారణాలు. నవంబరు 14న ప్రపంచకప్‌ ఫైనల్‌ ముగుస్తుండగా.. 17, 19, 21 తేదీల్లో కివీస్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. నవంబరు 25న తొలి టెస్టు, డిసెంబరు 3న రెండో టెస్టు ప్రారంభమవుతాయి. గత జూన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నుంచి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌శర్మ, బుమ్రా, షమి వంటి సీనియర్లు బుడగలో ఉంటున్నారు. ‘‘టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాళ్లలో అత్యధికులు గత 4 నెలల్లో మూడు బయో బబుల్స్‌లో ఉన్నారు. డిసెంబరు చివర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు తాజాగా ఉండాలంటే టీ20 ప్రపంచకప్‌ అనంతరం విశ్రాంతి ఇవ్వాలనే అంటారు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాబట్టి కోహ్లి, రోహిత్‌, బుమ్రా, షమిలకు విశ్రాంతినివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఐపీఎల్‌ హీరోలు రుతురాజ్‌ గైక్వాడ్‌, హర్షల్‌ పటేల్‌, అవేష్‌ఖాన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లకు కివీస్‌తో పొట్టి సిరీస్‌కు అవకాశం లభించొచ్చు.

తాత్కాలిక కోచ్‌గా ద్రవిడ్‌: టీ20 ప్రపంచకప్‌తో కోచ్‌ రవిశాస్త్రి పదవీ కాలం పూర్తవనుండటంతో అతని స్థానంలో ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో టీమ్‌ఇండియాకు ద్రవిడ్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించొచ్చు. అదే సమయంలో వచ్చే ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌ నేపథ్యంలో యువ భారత్‌ జట్టు ఎంపిక కోసం ద్రవిడ్‌ కసరత్తు కొనసాగుతుంది. వీలైనంత త్వరగా కొత్త కోచ్‌గా సరైన అభ్యర్థి దొరుకుతాడని బీసీసీఐ భావిస్తుంది. అయితే అంతకుముందే క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) నుంచి మదన్‌లాల్‌ను బోర్డు తొలగించొచ్చు. లోధా కమిటీ సంస్కరణల ప్రకారం 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు కమిటీలో ఉండటానికి వీల్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని