Tokyo Olympics: భజరంగ్‌ ఆశలు గల్లంతు.. ఇక మిగిలింది కాంస్యమే

ఒలింపిక్స్‌లో 65 కేజీల పురుషుల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ సెమీస్‌లో ఎన్నో అంచనాలు పెట్టుకున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ భజరంగ్‌ పునియా చేతులెత్తేశాడు. అజర్‌బైజాన్‌ రెజ్లర్‌ హాజీ అలీవ్‌ చేతిలో 5-12 తేడాతో ఓటమిపాలయ్యాడు...

Updated : 06 Aug 2021 16:35 IST

టోక్యో: ఒలింపిక్స్‌లో 65 కేజీల పురుషుల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ సెమీస్‌లో ఎన్నో అంచనాలు పెట్టుకున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ భజరంగ్‌ పునియా చేతులెత్తేశాడు. అజర్‌బైజాన్‌ రెజ్లర్‌ హాజీ అలీవ్‌ చేతిలో 5-12 తేడాతో ఓటమిపాలయ్యాడు. దాంతో భజరంగ్‌ ఇక కాంస్య పతకం కోసమే తలపడాల్సి ఉంది. శుక్రవారం జరిగిన ఈ కీలక పోరులో భజరంగ్‌ అంత దూకుడుగా ఆడలేకపోయాడు. భారత రెజ్లర్‌ బలహీనతపై దృష్టిసారించిన ప్రత్యర్థి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. తన పట్టుతో తొలి రౌండ్‌లోనే 4-1 ఆధిక్యం సంపాదించిన ఆలీవ్‌ తర్వాత కూడా 8-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలోనే భజరంగ్‌ పలుమార్లు ఆలీవ్‌ను తిప్పికొట్టే అవకాశాలు లభించినా అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దాంతో మిగతా ఆటలోనూ ఆధిపత్యం చెలాయించిన ఆలీవ్‌ చివరికి విజయం సాధించాడు. ఆట 30 సెకన్లలో ముగుస్తుందనగా భజరంగ్‌ నిరుత్సాహంతో డీలా పడ్డాడు. చివరికి 5-12 తేడాతో ఓటమిపాలయ్యాడు. ఇక భజరంగ్‌ కాంస్యం కోసం తలపడాల్సి ఉంది. అతడా పతకం సాధిస్తే భారత్‌ ఈ ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన చేసినట్టే. అంతకుముందు క్వార్టర్‌ ఫైనల్లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మోర్తజాను భజరంగ్‌ 2-1 తేడాతో ఓడించి సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే.

నిరాశపర్చిన సీమా బిస్లా..

మరోవైపు మహిళల 50 కేజీల ఓపెనింగ్‌ రౌండ్‌లో తొలిసారి పోటీపడిన యువ రెజ్లర్‌ సీమా బిస్లా తునీషియాకు చెందిన సారా హమ్‌దీ చేతిలో 1-3 తేడాతో ఓటమిపాలైంది. హమ్‌దీ.. తన పట్టుతో సీమాను గట్టి పోటీ ఇచ్చింది. దాంతో భారత రెజ్లర్‌ బౌట్‌లో పెద్దగా కదలలేకపోయింది. ఈ క్రమంలోనే హమ్‌దీ రెండు పుష్‌ఔట్లు చేసి ఆధిక్యం సంపాదించింది. కాగా, సీమా గత మేలో సోఫియాలో నిర్వహించిన ప్రపంచ ఒలింపిక్స్‌ క్వాలిఫయర్‌లో విజేతగా నిలిచి తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని