Updated : 19/10/2021 07:08 IST

T20 World Cup: ఆస్ట్రేలియా నిరీక్షణ ముగిసేనా?

దుబాయ్‌

వన్డే ప్రపంచకప్‌ వచ్చిన ప్రతిసారి టైటిల్‌ ఫేవరేట్‌గా ఆ జట్టు పేరే వినిపిస్తుంది! ఇప్పటికే అయిదు సార్లు ఆ కప్పు దక్కించుకుని అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అలాంటి మేటి జట్టు.. టీ20 ప్రపంచకప్‌లో మాత్రం ఇప్పటివరకూ బోణీ కొట్టలేకపోయింది. ఆ జట్టే.. ఆస్ట్రేలియా. ఈ సారి ఎలాగైనా కప్పు పట్టేయాలనే లక్ష్యంతో బరిలో దిగుతున్న కంగారూ జట్టు నిరీక్షణ ముగుస్తుందా?

త ఆరు టీ20 ప్రపంచకప్‌ల్లో మూడు సార్లు సెమీస్‌ చేరిన ఆస్ట్రేలియా.. 2010లో చివరి మెట్టుపై బోల్తా పడింది. ఈ సారి ట్రోఫీ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలో దిగుతున్న ఆ జట్టుకు అదంత సులువు కాదు. ఇటీవల ఆ జట్టు ప్రదర్శన పేలవంగా ఉండడమే అందుకు కారణం. నిజానికి 2020లో ఈ ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వాల్సింది. వరుసగా నాలుగు టీ20 సిరీస్‌లు గెలిచిన ఆసీస్‌.. 2020 మేలో ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని సొంతం చేసుకుంది. అప్పుడే ప్రపంచకప్‌ జరిగి ఉంటే ఆ జట్టుకు విజేతగా నిలిచేందుకు ఎక్కువ అవకాశాలుండేవి. కానీ కరోనా కారణంగా వాయిదా పడ్డ ప్రపంచకప్‌ ఇప్పుడు బీసీసీఐ ఆధ్వర్యంలో ఒమన్‌, యూఏఈలో జరుగుతోంది. మరోవైపు ఆ జట్టు ప్రదర్శన కూడా దారుణంగా పడిపోయింది. జట్టు కూర్పు కుదరక వరుసగా అయిదు టీ20 సిరీస్‌ల్లోనూ పరాజయం పాలైంది. బంగ్లాదేశ్‌ చేతిలోనూ ఓడింది. వివిధ కారణాల వల్ల కీలక ఆటగాళ్లు కొన్ని సిరీస్‌లకు దూరమవడం జట్టును దెబ్బతీసింది. ఈ ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా బలమైన జట్టునే బరిలో దింపింది. విధ్వంసకర ఓపెనర్లు ఫించ్‌, వార్నర్‌.. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే మ్యాక్స్‌వెల్‌, నమ్మదగ్గ స్మిత్‌, ఫామ్‌లో ఉన్న మార్ష్‌, పేసర్లు స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, హేజిల్‌వుడ్‌, ఆల్‌రౌండర్లు కమిన్స్‌, స్టాయినిస్‌, స్పిన్నర్లు జంపా, అగర్‌.. ఇలా జట్టు చూడ్డానికి పటిష్ఠంగా కనిపిస్తోంది. కానీ ఇందులో చాలా మంది ఆటగాళ్ల ఫామ్‌, ఫిట్‌నెస్‌ ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్‌ ఫించ్‌తో పాటు వార్నర్‌ ఫామ్‌ అంతంత మాత్రంగానే ఉంది. బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్‌, మార్ష్‌ మాత్రమే జోరు మీదున్నారు. ఇక బౌలింగ్‌లో స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, హేజిల్‌వుడ్‌ కీలకం కానున్నారు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై స్పిన్నర్లు జంపా, అగర్‌ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. అయితే వ్యక్తిగతంగా ఆటగాళ్ల ప్రదర్శన ఫర్వాలేదనిపిస్తున్నా.. జట్టుగా మెరుగ్గా రాణిస్తేనే కప్పు అందుకోవాలనే ఆసీస్‌ కల నిజమవుతుంది. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌తో కలిసి గ్రూప్‌- 1లో ఉన్న ఆసీస్‌.. సెమీస్‌ చేరాలంటే కష్టపడాల్సిందే.


కీలక ఆటగాళ్లు: మ్యాక్స్‌వెల్‌, వార్నర్‌, ఫించ్‌, స్టార్క్‌, స్మిత్‌, మార్ష్‌
ఉత్తమ ప్రదర్శన: రన్నరప్‌ (2010), సెమీస్‌ (2007, 2012)
ఆస్ట్రేలియా జట్టు: ఫించ్‌ (కెప్టెన్‌), కమిన్స్‌, అగర్‌, క్రిస్టియన్‌, ఎలిస్‌, హేజిల్‌వుడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మిచెల్‌ మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌, రిచర్డ్‌సన్‌, డేనియల్‌ సామ్స్‌, స్మిత్‌, స్టార్క్‌, స్టాయినిస్‌, స్వెప్సన్‌, వేడ్‌, వార్నర్‌, జంపా.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని