రికార్డు ‘8’పై పేస్‌ గురి

భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ రికార్డు స్థాయిలో ఎనిమిదో ఒలింపిక్స్‌పై గురిపెట్టాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో బరిలో దిగాలనుకుంటున్నట్లు వెల్లడించాడు...

Updated : 12 Dec 2020 12:09 IST

కోల్‌కతా: భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ రికార్డు స్థాయిలో ఎనిమిదో ఒలింపిక్స్‌పై గురిపెట్టాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో బరిలో దిగాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘2020 ఒలింపిక్స్‌లో చివరి గర్జన’ అంటూ 2019 క్రిస్ట్‌మస్‌ రోజున పేస్‌ పేర్కొన్నాడు. అయితే కరోనా కారణంగా ఒలింపిక్స్‌ ఏడాది పాటు వాయిదా పడ్డాయి. ‘‘ఇంతపెద్ద కరోనా మహమ్మారి చుట్టుముడుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ మహమ్మారి ప్రతి ఒక్కరిని ఆత్మపరిశీలన చేసుకునేలా చేసింది. కానీ సుదీర్ఘ విరామం తర్వాత చాలా సంతోషంగా ఉంది. శారీరకంగా, మానసికంగా పూర్తి సన్నద్ధంగా ఉన్నా. చరిత్ర పుస్తకాల్లో భారత్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే నాకు ముఖ్యం. అందుకే 30 ఏళ్లుగా కెరీర్‌ కొనసాగిస్తున్నా. ఇప్పటికే ఏడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న రికార్డు నాకుంది. ఎనిమిదో ఒలింపిక్స్‌లోనూ పాల్గొనగలను. టెన్నిస్‌లో అత్యధిక ఒలింపిక్స్‌లు ఆడిన రికార్డు భారత్‌ పేరిట నిలిచిపోతుంది. టోక్యో ఒలింపిక్స్‌ జరుగుతాయని అనుకుంటున్నా’’ అని పేస్‌ తెలిపాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ నాటికి పేస్‌ 48వ పడిలో అడుగుపెడతాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని