అభిమానులారా కొట్లాడకండి.. సెహ్వాగ్‌ ఆగ్రహం

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌శర్మ అభిమానులు కొట్లాడటంపై మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు...

Published : 23 Aug 2020 18:56 IST

ధోనీ X రోహిత్‌ అభిమానుల తీరుపై వీరూ ట్వీట్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌శర్మ అభిమానులు గొడవ పడటంపై మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో శనివారం ఇరు వర్గాల క్రికెట్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. గతవారం ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించాక అతడి అభిమానులు ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టగా, తాజాగా రోహిత్‌ శర్మకు రాజీవ్‌ ఖేల్‌ రత్న పురస్కారం ప్రకటించడంతో అతడి అభిమానులు కూడా అదే పని చేశారు. అయితే, రోహిత్‌ అభిమానులు పెట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చించేశారని, దాంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిందని ఓ వార్తా సంస్థ నిన్న ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ అభిమాని అయిన ఒక యువకుడిని ధోనీ అభిమానులు పంట పొలాల్లోకి తీసుకెళ్లీ మరీ దాడి చేశారని తెలిపింది.

ఈ విషయం తెలిసిన వీరేంద్ర సెహ్వాగ్‌ ఆదివారం ఓ ట్వీట్‌ చేశాడు. ఇరు వర్గాల అభిమానులు గొడవపడకుండా ఉండాలని విజ్ఞప్తి చేశాడు. క్రికెటర్లు ఒకరితో మరొకరు అభిమానంతో, కలిసిమెలిసి ఉంటారని చెప్పాడు. లేకపోతే వాళ్లకు అవసరమైన వరకే మాట్లాడుకుంటారని వివరించాడు. అంతేకాని ఇలా ప్రవర్తించరని.. కొందరు అభిమానులే పరిధి దాటి ప్రవర్తించి, వాటిని మరో స్థాయికి తీసుకెళతారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాళ్లని పిచ్చోళ్లుగా అభివర్ణించాడు. ఈ సందర్భంగా రోహిత్‌, ధోనీ అభిమానులను ఘర్షణ పడొద్దని టీమ్‌ఇండియాను ఒక్కటిగా చూడాలని సూచించాడు. అయితే, సెహ్వాగ్‌ను టీజ్‌ చేస్తూ మరో నెటిజన్‌ ఒక కామెంట్‌ చేశాడు. ‘వీరూ భాయ్‌ మీ ఫ్యాన్స్‌కు మంచిగా ట్రైనింగ్‌ ఇవ్వండి. ఎందుకంటే గొడవలు మరో స్థాయిలో ఉంటాయి’ అని వ్యాఖ్యానించాడు. దానికి రీట్వీట్‌ చేసిన మాజీ క్రికెటర్‌.. తన అభిమానులు అలాంటి పిచ్చి పనులు చేయరని అంతే ధీటుగా సమాధానమిచ్చాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని