Rohit Sharma: అతనే ఎందుకు?

కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలనుకుంటే సాధారణంగా జట్టుకు సుదీర్ఘంగా సేవలు అందించగలిగే ఆటగాడికి అవకాశమిస్తారు! కానీ కోహ్లి కంటే సీనియర్‌, కెరీర్‌ చివర్లో ఉన్న రోహిత్‌ శర్మ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది.

Updated : 10 Nov 2021 07:32 IST

కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలనుకుంటే సాధారణంగా జట్టుకు సుదీర్ఘంగా సేవలు అందించగలిగే ఆటగాడికి అవకాశమిస్తారు! కానీ కోహ్లి కంటే సీనియర్‌, కెరీర్‌ చివర్లో ఉన్న రోహిత్‌ శర్మ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది.. ఎందుకు ?

ఈనాడు క్రీడావిభాగం

టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ధోని 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విశ్వ విజేతగా నిలిపాడు. అతని నుంచి 2017లో పగ్గాలు తీసుకున్న కోహ్లి జట్టును ఉత్తమంగా నడిపించాడు. అతని సారథ్యంలో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌లు గెలిచింది. ఇప్పుడిక రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్లో జట్టును నడిపించనున్నాడు. కోహ్లి తర్వాత రోహితే ఎందుకు అనే ప్రశ్నలు రావడం సహజమే. అతను ఐపీఎల్‌లో సారథిగా ముంబయి ఇండియన్స్‌కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు టైటిళ్లు అందించాడు. వివిధ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం టీమ్‌ఇండియాకు తాత్కాలిక కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇప్పటివరకూ కెప్టెన్‌గా 10 వన్డేల్లో భారత జట్టుకు 8 విజయాలు అందించాడు. రెండు మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. అంతర్జాతీయ టీ20ల్లో అతని సారథ్యంలో జట్టు 19 మ్యాచ్‌ల్లో 15 సార్లు గెలిచి, నాలుగు సార్లు ఓడింది. ఇలా ఇప్పటికే తన నాయకత్వంతో మెప్పించిన అతనికే ఇప్పుడు పూర్తిస్థాయిలో టీ20 పగ్గాలు అప్పగించిన బీసీసీఐ.. కెప్టెన్సీ బదలాయింపు సవ్యంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.


అయితేనేం..

టీ20ల్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి కంటే రోహిత్‌ వయసే ఎక్కువ. అతనికిప్పుడు 34 ఏళ్లు. దీంతో భవిష్యత్‌ అవసరాలు దృష్టిలో పెట్టుకుని యువకులకు అవకాశం ఇవ్వాలనే వాదన వినిపించింది. కానీ 2022లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరుగుతుంది. ఆ టోర్నీకి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ దశలో యువకులకు అవకాశం ఇచ్చి ప్రయోగాలు చేయడం కంటే కూడా ఇప్పటికే సారథిగా అపార అనుభవం ఉన్న రోహిత్‌నే ఎంచుకోవడం మేలని బీసీసీఐ అనుకుంది. ఈ సంధి దశలో జట్టులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ఆటగాళ్లలో కలిసిపోయి ఉత్తమ ప్రదర్శన రాబడతాడని అతనిపై నమ్మకముంచింది. అవసరం అనుకుంటే వచ్చే రెండేళ్ల తర్వాత రోహిత్‌ నుంచి ఆ నాయకత్వ బాధ్యతలు యువ ఆటగాళ్లకు బదలాయించే ఛాన్స్‌ ఉంది. అప్పుడు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌ లాంటి ఆటగాళ్ల వైపు చూసే అవకాశాలు కొట్టిపారేయలేం. ఇక కివీస్‌తో సిరీస్‌తో పూర్తిస్థాయిలో టీ20 కెప్టెన్‌గా మరో అధ్యాయం ప్రారంభించనున్న రోహిత్‌ ముందు ఉన్న ప్రధాన సవాలు.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచేలా జట్టును నడిపించడమే. మరోవైపు కొత్త కోచ్‌ ద్రవిడ్‌తో కలిసి జట్టు కూర్పుపై దృష్టి పెట్టాల్సి ఉంది. మరి ఈ కొత్త ప్రయాణాన్ని రోహిత్‌ ఎలా కొనసాగిస్తాడో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని