నీ ప్రయాణం అజరామరం..

టీమ్‌ఇండియా ఆల్‌టైమ్‌ ఆల్‌రౌండర్‌గా, రెండు ప్రపంచకప్ల ఛాంపియన్‌గా యువరాజ్‌సింగ్‌ ప్రతీ ఒక్క క్రికెట్‌ అభిమానికీ సుపరిచితమే. 19 ఏళ్లకే బ్లూ జెర్సీ ధరించిన అతడు సుదీర్ఘకాలం భారత...

Updated : 12 Dec 2020 13:37 IST

యువీ బర్త్‌డే స్పెషల్‌ ఫొటో ఫీచర్‌

టీమ్‌ఇండియా ఆల్‌టైమ్‌ ఆల్‌రౌండర్‌గా, రెండు ప్రపంచకప్ల ఛాంపియన్‌గా యువరాజ్‌సింగ్‌ ప్రతీ ఒక్క క్రికెట్‌ అభిమానికీ సుపరిచితమే. 19 ఏళ్లకే బ్లూ జెర్సీ ధరించిన అతడు సుదీర్ఘకాలం భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. కెరీర్‌ తొలినాళ్లలో నాట్‌వెస్ట్‌ సిరీస్‌ మొదలు కొని 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌తో పాటు పలు ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌ల్లోనూ తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది ఇంగ్లాండ్‌లో చివరిసారి ప్రపంచకప్‌ ఆడి ఆటకు వీడ్కోలు పలుకుదామని భావించిన అతడికి  జట్టులో అవకాశం రాకపోవడంతో అప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. నేడు యువీ 39వ జన్మదినం జరుపుకొంటున్న సందర్భంగా అతడికి సంబంధించిన పలు జ్ఞాపకాలను గుర్తుచేసుకుందాం..

 

గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద..


2011 ఏప్రిల్‌ 2న ముంబయిలోని వాంఖడేలో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో శ్రీలంకపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ విజయానికి గుర్తుగా మరుసటి రోజు గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద ప్రపంచకప్‌తో యువీ.


2003 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో..

జోహెనస్‌బర్గ్‌లో జరిగిన నాటి ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాతో తలపడింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆరోజు బ్రాడ్‌హాగ్‌ బౌలింగ్‌లో యువీ బౌండరీ బాదిన దృశ్యమిది.


ఆరు సిక్సుల్లో ఐదో సిక్స్‌ ఇది..

2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఆరు సిక్సులు బాదిన సంగతి తెలిసిందే. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన ఆ ఓవర్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ చుక్కలు చూపించాడు. ఆ సందర్భంలో తీసిన ఐదో సిక్సర్‌ చిత్రమిది.


పాకిస్థాన్‌పై గెలిచాక కెప్టెన్‌ కూల్‌తో..

2007 టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా పాకిస్థాన్‌పై విజయం సాధించాక కెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీతో కలిసి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న అరుదైన జ్ఞాపకం.


ఇదో విజయానందం..

2011 ప్రపంచకప్‌లో క్వార్టర్‌ఫైనల్‌ సందర్భంగా ఆస్ట్రేలియాపై విజయానంతరం. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 260/6 స్కోర్‌ చేయగా, భారత్‌ 47.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో యువీ(57*), సురేశ్‌ రైనా(34*)తో కలిసి మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడిన సందర్భం.


క్యాన్సర్‌ను జయించాక ఇలా..

2011 ప్రపంచకప్‌ సమయంలో క్యాన్సర్‌ బారిన పడిన యువరాజ్‌ తర్వాత అమెరికాకు వెళ్లి మెరుగైన శస్త్రచికిత్స పొందాడు. అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వచ్చాక పూర్తిగా కోలుకున్నాడు. అదే సమయంలో 2012 ఐపీఎల్లో పుణె వారియర్స్‌ ఆటగాళ్లతో కలిసిన సందర్భంగా తీసిన చిత్రం.


విరాట్‌ కోహ్లీతో కలిసివస్తూ..

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా దక్షిణాఫ్రికాపై విజయం సాధించాక నాటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి వస్తున్న చిత్రమిది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 191 పరుగులకు ఆలౌటవ్వగా.. భారత్‌ 38 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ(76), యువరాజ్‌(23) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చిన వేళ.

-ఇంటర్నెట్‌డెస్క్‌

ఇవీ చదవండి..
ఇప్పుడైనా  ఆస్ట్రేలియాపై చెలరేగుతాడా?  
కోహ్లీ లేకపోతే భారత్‌కు అంత నష్టమా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని