Dhoni: అది ధోనీ పద్ధతి.. ఇతరులది వేరే!

టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ నుంచి నేర్చుకోవాలని మాజీ బ్యాట్స్‌మన్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన ఆయన సంజూ బ్యాటింగ్‌పై స్పందించాడు...

Published : 14 Jun 2021 01:41 IST

(Aakash Chopra Facebook Photo)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ నుంచి నేర్చుకోవాలని మాజీ బ్యాట్స్‌మన్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా సూచించాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడిన ఆయన సంజూ బ్యాటింగ్‌పై స్పందించాడు. శ్రీలంక పర్యటనలో వన్డే క్రికెట్‌లో ఈ యువ బ్యాట్స్‌మన్‌ తన ఆటలో ఏమైనా మార్పులు చేసుకుంటాడా?లేక సహజసిద్ధమైన ఆటే ఆడతాడా అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు.

సంజూ ధోనీ నుంచి నేర్చుకోవాల్సింది ఉందని, లంక పర్యటనలో అతడికి టీ20ల్లో లేదా వన్డేల్లో తుది జట్టులో ఆడే అవకాశం వస్తుందో లేదో తనకు తెలియదని చోప్రా పేర్కొన్నాడు. కానీ.. అతడు మాత్రం ఇదివరకే తన సహజసిద్ధమైన ఆట ఆడతానని చెప్పాడని గుర్తుచేశాడు. అయితే, ఇక్కడ జాగ్రత్తగా ఆడటం, అజాగ్రత్తగా ఆడటం అనేవి ఉంటాయని చెప్పాడు. అందులో జాగ్రత్తగా ఆడటమంటే ధోనీలా ఆడాలని, అజాగ్రత్తగా అంటే ఇంతకుముందు కొంత మంది ఆటగాళ్లు ఆడటం చూశామని చెప్పాడు. ఒకవేళ సంజూకు వన్డేల్లో అవకాశం వస్తే పరిస్థితులకు తగ్గట్టు ఆడాలని సూచించాడు. పిచ్‌ ఎలా ఉంది, స్కోరుబోర్డు ఎలా సాగుతుందనే విషయాలని గమనించి అందుకు తగ్గట్టు బ్యాటింగ్‌ చేయాలన్నాడు. అన్ని వేళలా ఒకే పద్ధతిలో ఆడకూడదని, పరిస్థితులకు తగ్గట్టు తనని తాను మలుచుకోవాలని సలహా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ధోనీని చూసి నేర్చుకోవాలన్నాడు. ఒక అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎదిగి జట్టులో స్థానం కాపాడుకోవాలంటే పరిస్థితులకు తగ్గట్టే ఆడాలని మాజీ క్రికెటర్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని