Ajinkya Rahane: అతడే లేకపోతే? 

కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునే బ్యాట్స్‌మన్‌. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లేనప్పుడు టీమ్‌ఇండియాను నడిపించే టెస్టు సారథి. విజయాలకు పొంగిపోని, అపజయాలకు కుంగిపోని మనస్తత్వం...

Published : 06 Jun 2021 13:20 IST

ఆస్ట్రేలియాలో భారత్‌ చారిత్రక సిరీస్‌ గెలిచేదా..!

కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునే బ్యాట్స్‌మన్‌. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లేనప్పుడు టీమ్‌ఇండియాను నడిపించే టెస్టు సారథి. విజయాలకు పొంగిపోని, అపజయాలకు కుంగిపోని మనస్తత్వం. ప్రత్యర్థి ఎవరైనా, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోవడమే అతడికి తెలిసింది. ఇలాంటి ప్రత్యేకతలతోనే ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం అందించాడు. ముఖ్యంగా బాక్సింగ్‌డే టెస్టులో శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా వరుసగా రెండోసారి కంగారూల గడ్డపై బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సొంతం చేసుకోవడంలో తనదైన ముద్ర వేశాడు. అతడే అజింక్య రహానె. నేడు అతడి 33వ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం..


లార్డ్స్‌లో 28 ఏళ్ల తర్వాత..

అది 2014లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటన. తొలి మ్యాచ్‌ డ్రాగా ముగియగా.. రెండో మ్యాచ్‌ ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో జరిగింది. అప్పటికే టీమ్‌ఇండియా ఆ మైదానంలో విజయం సాధించి 28 ఏళ్లు గడిచాయి. అలాంటి పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 295 పరుగులకు ఆలౌటైంది. రహానె(103; 154 బంతుల్లో 15x4, 1x6) శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. ఆపై ఇంగ్లాండ్‌ 319 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్‌(95; 247 బంతుల్లో 11x4), రవీంద్ర జడేజా(68; 57 బంతుల్లో 9x4), భువనేశ్వర్‌ కుమార్‌(52; 71 బంతుల్లో 8x4) అర్ధశతకాలతో రాణించడంతో 342 పరుగులు చేసింది. చివరికి ఇంగ్లాండ్‌ 223 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌లో చాపచుట్టేయడంతో భారత్‌ 95 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో రహానె శతకంతో ఆదుకోవడంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ లార్డ్స్‌లో విజయం సాధించింది.


మెల్‌బోర్న్‌లో కోహ్లీతో 262..

ఇక 2014లోనే మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన మరో టెస్టులో రహానె(147; 171 బంతుల్లో 21x4) కెరీర్‌లోనే అతిగొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. విరాట్‌ కోహ్లీ(169; 272 బంతుల్లో 18x4)తో కలిసి నాలుగో వికెట్‌కు 262 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించాడు. దాంతో జట్టును ఫాలోఆన్‌ నుంచి తప్పించుకోవడమే కాకుండా మ్యాచ్‌ ఓడిపోకుండా కాపాడాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్‌స్మిత్‌(192; 305 బంతుల్లో 15x4, 2x6) దంచికొట్టడంతో ఆసీస్‌ 530 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అనంతరం కోహ్లీ, రహానె శతకాలతో ఆదుకొని భారత్‌ స్కోరును 465 పరుగులకు చేరవేశారు. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 318/9 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేయగా భారత్‌ ఆట పూర్తయ్యేసరికి 174/6తో నిలిచింది. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా కోహ్లీ(52; 99 బంతుల్లో 7x4), రహానె(48; 117 బంతుల్లో 6x4) మరోసారి సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి త్వరగా వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. దాంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసి టీమ్‌ఇండియా ఓటమి నుంచి తప్పించుకుంది.


కొలంబోలో ఆణిముత్యం..

2015 శ్రీలంక పర్యటనలోనూ రహానె రెండో టెస్టులో మరో ఆణిముత్యం లాంటి ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలుత కేఎల్‌ రాహుల్‌(108; 190 బంతుల్లో 13x4, 1x6) శతకంతో మెరవగా కోహ్లీ(78; 107 బంతుల్లో 8x4, 1x6), రోహిత్‌ శర్మ(79; 132 బంతుల్లో 5x4, 3x6) అర్ధశతకాలతో రాణించారు. దాంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 393 పరుగులు చేసింది. అనంతరం ఏంజిలో మాథ్యూస్‌(102; 167 బంతుల్లో 12x4) శతకం సాధించి లంకను ఆదుకున్నాడు. దాంతో ఆ జట్టు 306 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్‌(82; 133 బంతుల్లో 4x4, 2x6), రహానె(126; 243 బంతుల్లో 10x4) అద్భుతంగా ఆడి జట్టు స్కోరును 325/8కు తీసుకెళ్లారు. ఆపై శ్రీలంక 134 పరుగులకే ఆలౌటై 278 పరుగుల తేడాతో ఘోర పరాభవం ఎదుర్కొంది.


ఇండోర్‌లో ధనాధన్‌..

న్యూజిలాండ్ జట్టు 2016లో భారత్‌లో పర్యటించినప్పుడు ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో రహానె(188; 381 బంతుల్లో 18x4, 4x6) తన కెరీర్‌లోనే అత్యధిక స్కోర్‌ బాదాడు. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 321 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత విరాట్‌ కోహ్లీ(211; 366 బంతుల్లో 20x4)తో కలిసి రహానె నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 365 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో చివరికి టీమ్‌ఇండియా 557/5 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఆపై న్యూజిలాండ్‌ 299 పరుగులకు ఆలౌటవ్వగా.. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 216/3 స్కోర్‌ వద్ద మరోసారి డిక్లేర్‌ చేసింది. చివరికి కివీస్‌ 153 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ పూర్తి చేయడంతో భారత్‌ రికార్డు విజయం సాధించింది.


టీమ్‌ఇండియా 36కే ఆలౌటయ్యాక..

ఇక గతేడాది చివర్లో ఆస్ట్రేలియాతో ఆడిన బాక్సింగ్‌ డే టెస్టులో రహానె(112; 223 బంతుల్లో 12x4) శతకం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మ్యాచ్‌ అతడి జీవితంలో మర్చిపోలేనిది అనడంలో కూడా సందేహం లేదు. ఎందుకంటే అంతకుముందు జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 36 పరుగులకే ఆలౌటై ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. ఆపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పితృత్వపు సెలవుల మీద జట్టుకు దూరమయ్యాడు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో శతకం సాధించి జట్టులో నూతనోత్సాహం నింపాడు. నాయకత్వంలో తనదైన ముద్ర వేస్తూ అందరిచేతా శెభాష్‌ అనిపించుకున్నాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆపై రహానె శతకంతో మెరిశాడు. జడేజా(57; 159 బంతుల్లో 3x4) అర్ధశతకంతో రాణించడంతో భారత్‌ 326 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు కుప్పకూలడంతో భారత్‌ మిగిలిన 70 పరుగులు పూర్తి చేసి విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో రహానె ఆదుకోవడం వల్లే టీమ్‌ఇండియా గెలుపొందింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మివిశ్వాసమే మిగిలిన టెస్టుల్లో యువకులు పోరాడేలా చేసింది. అలా రెండోసారి కంగారూల గడ్డపై భారత్‌ చారిత్రక విజయం సాధించింది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని