కుంబ్లే ది గ్రేట్‌: పదికి పది అతడివే..! 

తన స్పిన్‌ బౌలింగ్‌తో భారత క్రికెట్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు సాధించిన దిగ్గజం అనిల్‌కుంబ్లే. టెస్టుల్లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు(619) తీసిన మూడో బౌలర్...

Updated : 07 Feb 2021 13:54 IST

పాకిస్థాన్‌పై చెరగని ముద్ర..

ఇంటర్నెట్‌డెస్క్‌: తన స్పిన్‌ బౌలింగ్‌తో భారత క్రికెట్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపు సాధించిన దిగ్గజం అనిల్‌కుంబ్లే. టెస్టుల్లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు(619) తీసిన మూడో బౌలర్‌ కూడా అతడే. ఇవి మాత్రమే కాదు. ఆధునిక క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ మన మాజీ సారథి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆ ఘనత సాధించి నేటికి 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి విశేషాలను గుర్తుచేస్తూ కుంబ్లే తీసిన పది వికెట్ల వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. ఆ మ్యాచ్‌ విశేషాలేంటో మనమూ ఓసారి తెలుసుకుందాం.

12 పరుగుల ఓటమి.. 
1999లో పాకిస్థాన్‌ రెండు టెస్టుల పర్యటన కోసం భారత్‌కు వచ్చింది. అయితే, చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా 12 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సచిన్‌(136) విరోచితంగా పోరాడినా భారత్‌ ఓటమిపాలైంది. తొలుత పాక్‌ 238 పరుగులు చేయగా, భారత్‌ 254 పరుగులు చేసింది. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు 286 పరుగులు చేసి భారత్ ముందు‌ 270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే సచిన్‌ ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో అతడు ఔటవ్వడంతో భారత్‌ స్వల్ప తేడాతో మ్యాచ్‌ ఓడిపోయింది. దీంతో తర్వాతి టెస్టులో టీమ్‌ఇండియా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

కుంబ్లే తిప్పేశాడు..
ఇక దిల్లీలోని అప్పటి కోట్లా మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 252 పరుగులు సాధించింది. ఆపై పాకిస్థాన్‌ను 172 పరుగులకే పరిమితం చేసింది. దీంతో టీమ్‌ఇండియాకు 80 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులు చేయడంతో పాక్‌ ముందు 419 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఆ జట్టు 207 పరుగులకు ఆలౌటైంది. అయితే, ఈ రెండో ఇన్నింగ్స్‌లో అన్ని వికెట్లు తీసింది అనిల్‌ కుంబ్లే ఒక్కడే. తొలి వికెట్‌ నుంచి చివరి వికెట్‌ వరకూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. అలా ఆధునిక క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 1956లో ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ జిమ్‌ లేకర్‌ ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీశాడు. తర్వాత ఆ ఘనత సాధించింది కుంబ్లే మాత్రమే. 

ఇవీ చదవండి..
‘రూట్’‌ను తప్పించడం ఎందుకింత కష్టం!
ద్రవిడ్‌పై సచిన్‌ అలిగిన వేళ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు