అది కోహ్లీ ఇష్టం.. మా దారి మాదే: స్టోక్స్‌

దూకుడైనా దేహభాష కోహ్లీ, టీమ్‌ఇండియాకు పనిచేస్తుందేమో గానీ ఇంగ్లాండ్‌ ఆటతీరుపై ప్రభావం చూపదని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అంటున్నాడు. మైదానంలో ఒక్కో జట్టు, ఒక్కో ఆటగాడు ఒక్కోలా సంబరాలు చేసుకుంటారని తెలిపాడు. బహుశా అదే వారిని విజయవంతం చేయొచ్చన్నాడు....

Published : 26 Mar 2021 01:22 IST

పుణె: దూకుడైన దేహభాష.. కోహ్లీ, టీమ్‌ఇండియాకు పనిచేస్తుందేమో గానీ ఇంగ్లాండ్‌ ఆటతీరుపై ప్రభావం చూపదని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అంటున్నాడు. మైదానంలో ఒక్కో జట్టు, ఒక్కో ఆటగాడు ఒక్కోలా సంబరాలు చేసుకుంటారని తెలిపాడు. బహుశా అదే వారిని విజయవంతం చేయొచ్చన్నాడు. నాలుగైదేళ్లుగా తమ జట్టుకు పనిచేస్తున్న వ్యూహం మాత్రం అదికాదని వెల్లడించాడు. రెండో వన్డేకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.

‘మమ్మల్ని మెరుగైన జట్టుగా మార్చేందుకు అత్యుత్తమైన దారినే మేం ఎంచుకుంటాం. ప్రతి జట్టు తమకు అనువైన దారిలోనే నడుస్తుంది. భారత్‌, ఇంగ్లాండ్‌కు వేర్వేరు పద్ధతులు ఉన్నాయి’ అని స్టోక్స్‌ అన్నాడు. కోహ్లీ ప్రశాంతంగా ఉంటే బాగుంటుందా, దూకుడుగా ఉంటే బాగుంటుందా అని అడగ్గా ‘వ్యక్తిగతంగా చెప్పాలంటే అతడు పరుగులు చేయకపోతే బాగుంటుంది. ఎందుకంటే అది మా జట్టుకు మంచిది’ అని వెల్లడించాడు.

వన్డే సిరీస్‌ ఓడితే ఇంగ్లాండ్‌ నంబర్‌వన్‌ ర్యాంకు పోయే ప్రమాదముందని ప్రశ్నించగా ‘మా ఫలితాలు, మా ఆటతీరును బట్టి మేం నంబర్‌ వన్‌కు అర్హులం. అగ్రస్థానంలో ఉండటం ఎవరికైనా ఆనందమే. అయితే అదే మమ్మల్ని నడిపించడం లేదు. ఆట పట్ల మా వైఖరి, మేమెలా ఆడుతున్నామన్నదే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. అదే మమ్మల్ని విజయవంతం చేసింది. నంబర్‌ వన్‌గా మార్చింది’ అని స్టోక్స్‌ చెప్పాడు.

జో రూట్‌ లేకపోవడంతో మూడో స్థానంలో ఆడుతున్నానని ఇందుకోసం తన ఆటతీరును మార్చుకోలేదని స్టోక్స్‌ పేర్కొన్నాడు. ఆ స్థానంలో ఎలా ఆడాలని ప్రశ్నించగా ‘నీలా నవ్వు ఆడు’ అని రూట్ తనకు సమాధానం ఇచ్చాడని వెల్లడించాడు. ఫినిషర్‌గా సాధారణంగా 60 బంతులు ఆడితే మూడో స్థానంలో వంద వరకు ఎదుర్కోవాల్సి రావొచ్చన్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఓపెనింగ్‌ చేసినప్పటికీ ఇంగ్లాండ్‌లో ప్రతి స్థానానికి అర్హులైన వారు ఉన్నారని తెలిపాడు. లియామ్‌ లివింగ్‌స్టన్‌కు అవకాశం దొరికితే నిర్భయంగా అతడు క్రికెట్‌ ఆడగలడని ధీమా వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని