ARG-BRZ: బ్రెజిల్‌తో మ్యాచ్ డ్రా.. ప్రపంచకప్‌ అర్హత సాధించిన అర్జెంటీనా

ఖతార్‌ 2022 ఫిఫా ప్రపంచకప్‌ కోసం పోటీపడేందుకు మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు అర్హత సాధించింది. ఇవాళ జరిగిన...

Updated : 17 Nov 2021 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఖతార్‌ వేదికగా జరిగే ఫిఫా ప్రపంచకప్‌ -2022 ట్రోఫీ కోసం పోటీపడేందుకు మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు అర్హత సాధించింది. ఇవాళ జరిగిన క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌తో డ్రాగా (0-0) ముగించిన అర్జెంటీనా.. దక్షిణఅమెరికా-10 గ్రూప్‌ నుంచి ప్రపంచకప్‌కు అర్హత దక్కించుకుంది. ఇప్పటికే ఈ గ్రూప్‌ నుంచి బ్రెజిల్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన అర్జెంటీనా-బ్రెజిల్‌ మ్యాచ్‌లో ఇరు జట్లకూ కొన్ని అవకాశాలు వచ్చినా గోల్‌ మాత్రం నమోదు కాలేదు. మోకాలి నొప్పితో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన అర్జెంటీనా కెప్టెన్‌ మెస్సి పెద్దగా ప్రభావం చూపకపోయినా మైదానంలో చురుగ్గానే కదిలాడు. మరోవైపు కీలక ఆటగాడు నెయ్‌మర్ లేకపోయినా.. అర్జెంటీనాను బ్రెజిల్‌ గోల్‌ కొట్టనీయకుండా అడ్డుకోగలిగింది. దీంతో ఆఖరుకు 0-0తో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. గోల్స్‌ అడ్డుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల గోల్‌ కీపర్‌లు ప్రేక్షకపాత్ర వహించారు. తమ డిఫెన్స్‌ విభాగం చాలా బాగుందని బ్రెజిల్‌ ఆటగాడు ఫ్రెడ్‌ చెప్పాడు.

ఫిఫా షెడ్యూల్‌ ప్రకారం దక్షిణ అమెరికా-10 గ్రూప్‌లోని ఒక్కో జట్టు క్వాలిఫయర్స్‌లో పద్నాలుగేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. గ్రూప్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు డైరెక్ట్‌గా ప్రపంచకప్‌ అర్హత లభిస్తుంది. ఇప్పటివరకు ఈ గ్రూప్‌ నుంచి బ్రెజిల్  13 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, రెండు డ్రాలతో 35 పాయింట్లు సాధించి నంబర్‌వన్‌ స్థానంతో.. అర్జెంటీనా (13 మ్యాచ్‌లకు 8 విజయాలు, 5 డ్రాలు) 29 పాయింట్లతో అర్హత సాధించాయి. ఈక్వెడార్‌ (14 మ్యాచ్‌లకు 7 విజయాలు, 2 డ్రాలు, 5 ఓటములు) 23 పాయింట్లు, కొలంబియా (14 మ్యాచ్‌లకు 3 విజయాలు, 8 డ్రాలు, 3 ఓటములు) 17 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పెరూ (14 మ్యాచ్‌లకు 5 విజయాలు, 2 డ్రాలు, 7 ఓటములు) 17 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. కొలంబియా, పెరూ జట్లకు గోల్స్ అంతరం ఎక్కువగా ఉండటంతో.. పెరూ ఐదో స్థానంతో ఇంటర్‌కాంటినెంటల్‌ ప్లేఆఫ్‌లో ఆడి ప్రపంచకప్‌కు క్వాలిఫై కావ్వాల్సి ఉంటుంది.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని