T20 World Cup​​: ​ఔరా ఆసీస్‌

ఇది టీ20 క్రికెట్‌. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం! చివరి బంతి పడే వరకు ఒక అంచనాకు రాలేం!విజయం తమదే అని కులాసాగా ఉన్న జట్టు కొన్ని నిమిషాల్లో కన్నీటి పర్యంతం కావచ్చు!ఓడిపోతున్నామని దిగాలుగా ఉన్న జట్టు కాసేపట్లో సంబరాల్లో మునిగిపోవచ్చు!టీ20 ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్లో ఇవే దృశ్యాలు చూశాం. ఇంగ్లాండ్‌కు దిమ్మదిరిగే షాకిస్తూ కివీస్‌ ఫైనల్‌ చేరింది.రెండో సెమీఫైనల్లోనూ ఇదే కథ పునరావృతం అయింది. మళ్లీ అంచనాలు తలకిందులయ్యాయి.

Updated : 12 Nov 2021 05:40 IST

వేడ్‌ సంచలన ఇన్నింగ్స్‌

వార్నర్‌, స్టాయినిస్‌ మెరుపులు

సెమీస్‌లో పాకిస్థాన్‌కు షాక్‌

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో కంగారూలు

ఇది టీ20 క్రికెట్‌. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం!

చివరి బంతి పడే వరకు ఒక అంచనాకు రాలేం!

విజయం తమదే అని కులాసాగా ఉన్న జట్టు కొన్ని నిమిషాల్లో కన్నీటి పర్యంతం కావచ్చు!

ఓడిపోతున్నామని దిగాలుగా ఉన్న జట్టు కాసేపట్లో సంబరాల్లో మునిగిపోవచ్చు!

టీ20 ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్లో ఇవే దృశ్యాలు చూశాం. ఇంగ్లాండ్‌కు దిమ్మదిరిగే షాకిస్తూ కివీస్‌ ఫైనల్‌ చేరింది.

రెండో సెమీఫైనల్లోనూ ఇదే కథ పునరావృతం అయింది. మళ్లీ అంచనాలు తలకిందులయ్యాయి.

బ్యాటుతో భారీ స్కోరు చేసి, బంతితో ప్రత్యర్థికి కళ్లెం వేసి.. ఇక ఫైనల్‌ చేరినట్లే అని ధీమాగా ఉన్న పాకిస్థాన్‌కు ఆస్ట్రేలియా మామూలు షాకివ్వలేదు.

ఆశల్లేని స్థితిలో అనూహ్యంగా చెలరేగిపోయిన స్టాయినిస్‌ కంగారూలను రేసులోకి తీసుకొస్తే.. ఆఖర్లో వేడ్‌ కళ్లు చెదిరే రీతిలో హ్యాట్రిక్‌ సిక్సర్లు బాది జట్టు సంచలన విజయాన్నందించాడు.

సూపర్‌-12లో చిరకాల ప్రత్యర్థి భారత్‌ సహా అన్ని జట్లనూ ఓడించి అజేయంగా సెమీస్‌కు చేరి.. ఫైనల్‌ బెర్తు కూడా ఖాయమనుకున్న దశలో ఇలా ఓటమి పాలవడం పాకిస్థాన్‌కు తీరని వేదన కలిగించేదే.

మొత్తానికి ఇప్పటిదాకా పొట్టి కప్పు నెగ్గని న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడంతో ఈసారి కొత్త ఛాంపియన్‌ను చూడబోతున్నాం.

దుబాయ్‌

ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్‌ చేజారుతున్నట్లనిపించిన సమయంలో వేడ్‌ (41 నాటౌట్‌; 17 బంతుల్లో 2×4, 4×6) విరుచుకుపడడంతో గురువారం సెమీఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. రిజ్వాన్‌ (67; 52 బంతుల్లో 3×4, 4×6), ఫకార్‌ జమాన్‌ (55 నాటౌట్‌; 32 బంతుల్లో 3×4, 4×6), బాబర్‌ (39; 34 బంతుల్లో 5×4) చెలరేగడంతో మొదట పాకిస్థాన్‌ 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వేడ్‌తో పాటు వార్నర్‌ (49; 30 బంతుల్లో 3×4, 3×6), స్టాయినిస్‌ (40 నాటౌట్‌; 31 బంతుల్లో 2×4, 2×6) మెరవడంతో ఆసీస్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది.

వార్నర్‌ రాణించినా..: బ్యాటుతో అదరగొట్టిన  పాకిస్థాన్‌ బౌలింగ్‌నూ అద్భుతంగా ఆరంభించింది. షహీన్‌ షా అఫ్రిది తొలి ఓవర్లోనే ఫించ్‌ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడం ద్వారా ఛేదనలో ఆసీస్‌ను గట్టి దెబ్బతీశాడు.  కానీ వార్నర్‌కు తోడు మిచెల్‌ మార్ష్‌ (28; 22 బంతుల్లో 3×4, 1×6) దూకుడుగా ఆడడంతో.. ఆరంభ ఇబ్బందులను అధిగమిస్తూ ఆసీస్‌ కోలుకుంది. 6 ఓవర్లలో 52/1తో బలంగా కనిపించింది. కానీ షాదాబ్‌ ఖాన్‌ సూపర్‌ బౌలింగ్‌తో చకచకా వికెట్లు పడగొట్టడంతో కంగారూ జట్టు ఇబ్బందుల్లో పడింది.. ఏడో ఓవర్లో మార్ష్‌ను ఔట్‌ చేయడం ద్వారా ప్రమాదకరంగా మారుతున్న భాగస్వామ్యాన్ని విడదీసిన షాదాబ్‌.. తన తర్వాతి ఓవర్లో స్మిత్‌ (5)ను వెనక్కి పంపాడు. అయినా చక్కగా ఆడుతున్న వార్నర్‌ క్రీజులో ఉండడంతో ఆసీస్‌ ధీమాగానే ఉంది. 10 ఓవర్లలో స్కోరు 89/3. కానీ 11వ ఓవర్లో షాదాబ్‌ బౌలింగ్‌లోనే వార్నర్‌ క్యాచ్‌ ఔట్‌ కావడం ఆసీస్‌కు పెద్ద షాక్‌. 13వ ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ కూడా నిష్క్రమించడంతో 96/5తో ఆ జట్టు ఆశలు సన్నగిల్లాయి. మ్యాచ్‌పై పాక్‌ పట్టుబిగించింది. స్టాయినిస్‌, వేడ్‌ నిలబడ్డారు. కానీ బ్యాట్‌ ఝుళిపించలేకపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. 16 ఓవర్లకు ఆసీస్‌ 127/5తో నిలవడంతో లక్ష్యాన్ని అందుకోవడం చాలా కష్టమే అనిపించింది.

వారెవ్వా వేడ్‌..: చివరి 4 ఓవర్లలో ఆసీస్‌ 50 పరుగులు చేయాల్సిన స్థితిలో మ్యాచ్‌లో స్పష్టమైన ఫేవరెట్‌ పాకిస్థానే. కానీ ఆసీస్‌ మరో ఓవర్‌ మిగిలి ఉండగానే గెలుస్తుందని ఒక్కరైనా ఊహించి ఉండరు. అంత అనూహ్యంగా మలుపు తిరిగింది మ్యాచ్‌. స్టాయినిస్‌, వేడ్‌   గేర్లు మార్చి ఆసీస్‌ను పోటీలోకి తెచ్చారు. 17వ ఓవర్లో (రవూఫ్‌)  స్టాయినిస్‌ ఓ సిక్స్‌, ఫోర్‌ కొట్టగా.. తర్వాతి ఓవర్లో (హసన్‌ అలీ) వేడ్‌ సిక్స్‌, ఫోర్‌ దంచాడు. అయినా చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన స్థితిలో లక్ష్యం ఆసీస్‌కు తేలిగ్గా ఏమీ లేదు. పైగా 19వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చింది టోర్నీ ఆరంభం నుంచి బ్యాట్స్‌మెన్‌కు కొరకరాని కొయ్యగా మారిన పేసర్‌ షహీన్‌ షా అఫ్రిది. అతణ్ని ఎదుర్కోవడం, బౌండరీలు బాదడం కష్టమైన పనే. ఆ ఓవర్లో బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేస్తే.. పాక్‌ పైచేయి సాధించగలిగేది. అందుకు తగ్గట్లే తన పదునైన పేస్‌తో తొలి మూడు బంతుల్లో నాలుగు పరుగులే ఇచ్చి ఆసీస్‌పై ఒత్తిడి పెంచాడు అఫ్రిది. కానీ ఆ తర్వాత అతడికి, పాకిస్థాన్‌కు దిమ్మదిరిగే షాక్‌ తగిలింది. తర్వాతి మూడు బంతుల్లోనే మ్యాచ్‌ ముగిసింది. ఒత్తిడిలో వేడ్‌ బుర్ర చురుగ్గా పనిచేసింది. తెలివిగా బ్యాటింగ్‌ చేసిన అతడు.. అఫ్రిది బుల్లెట్‌ బంతులకు చుక్కలు చూపించాడు. వరుసగా మూడు సిక్స్‌లు బాది ఆసీస్‌కు సంచలన విజయాన్ని అందించాడు. మొదట వికెట్లను వదిలేస్తూ బంతిని షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లోకి కొట్టిన వేడ్‌.. ఆ తర్వాత మిడ్‌ వికెట్‌ మీదుగా దంచాడు. ఆ తర్వాత కళ్లు చెదిరే స్కూప్‌తో  వికెట్‌కీపర్‌గా మీదుగా స్టాండ్స్‌లో పడేశాడు. అంతే..  ఆసీస్‌ సంబరాల్లో మునిగిపోయింది.

రిజ్వాన్‌, జమాన్‌ ధనాధన్‌: టోర్నమెంట్లో మొదటిసారి టాస్‌ ఓడిపోయిన పాకిస్థాన్‌కు అంతకుముందు ఓపెనర్లు బాబర్‌, రిజ్వాన్‌కు ఎప్పటిలాగే మెరుగైన ఆరంభాన్నిచ్చారు. పవర్‌ప్లే ముగిసేసరికి 47/0తో నిలిచింది పాకిస్థాన్‌. అయితే స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పవర్‌ ప్లే తర్వాత పాక్‌ ఇన్నింగ్స్‌లో ఊపు తగ్గింది. జంపా.. ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో బాబర్‌ను ఔట్‌ చేసేటప్పటికి స్కోరు 71. మ్యాక్స్‌వెల్‌ కూడా బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేయడంతో 7 నుంచి 11 ఓవర్ల మధ్య పాకిస్థాన్‌కు 28 పరుగులే వచ్చాయి. కానీ రిజ్వాన్‌ ధాటైన బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. నెమ్మదిగా ఆరంభించినా.. ఫకార్‌ జమాన్‌ కూడా క్రమంగా బ్యాట్‌ ఝుళిపించాడు. 18వ ఓవర్లో రిజ్వాన్‌ ఔట్‌ కావడంతో 72 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికి స్కోరు 143. కానీ జమాన్‌ ఆఖర్లో దంచి కొట్టడంతో పాక్‌ మెరుగైన స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించింది. చివరి మూడు ఓవర్లలో పాక్‌ మూడు వికెట్లు కోల్పోయి 33 పరుగులు రాబట్టింది.


కోహ్లి రికార్డు బద్దలు

పాకిస్థాన్‌ స్టార్‌ బాబర్‌ అజామ్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో అజామ్‌ (62 ఇన్నింగ్స్‌) టీ20ల్లో వేగంగా 2500 పరుగులు మైలురాయి అందుకున్న బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు విరాట్‌ కోహ్లి (68 ఇన్నింగ్స్‌)ని దాటాడు. అంతేకాదు ఆడిన తొలి టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా (6 మ్యాచ్‌ల్లో 303) అజామ్‌ మరో రికార్డు నెలకొల్పాడు. అతడు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ (265)ను అధిగమించాడు.


ఆ క్యాచ్‌ పట్టుంటే..

చివరి రెండు ఓవర్లలో గెలవాలంటే ఆస్ట్రేలియాకు 22 పరుగులు కావాలి. షహీన్‌ అఫ్రిది చేతిలో బంతి! తొలి రెండు బంతుల్లో వచ్చింది ఒక్క పరుగే. అయితే మూడో బంతికి డీప్‌ మిడ్‌ వికెట్‌ దిశగా బంతిని గాల్లోకి లేపాడు వేడ్‌. అయితే పక్కకు పరుగెత్తుకుంటూ వచ్చిన హసన్‌ అలీ.. బంతిని నేలపాలు చేశాడు. దీంతో జీవనదానం పొందిన వేడ్‌.. ఆ తర్వాత మూడు బంతులకు మూడు మెరుపు సిక్స్‌లు బాదేసి ఆసీస్‌కు సంచలన విజయాన్ని అందించాడు. ఒకవేళ హసన్‌  అలీ.. వేడ్‌ క్యాచ్‌ పట్టి ఉంటే  కథ వేరేలా ఉండేదేమో.


పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ (సి) స్మిత్‌ (బి) స్టార్క్‌ 67; బాబర్‌ అజామ్‌ (సి) వార్నర్‌ (బి) జంపా 39; ఫకార్‌ జమాన్‌ నాటౌట్‌ 55; అసిఫ్‌ అలీ (సి) స్మిత్‌ (బి) కమిన్స్‌ 0; షోయబ్‌ మాలిక్‌ (బి) స్టార్క్‌ 1; హఫీజ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 176; వికెట్ల పతనం: 1-71, 2-143, 3-158, 4-162; బౌలింగ్‌: స్టార్క్‌  4-0-38-2; హేజిల్‌వుడ్‌ 4-0-49-0; మ్యాక్స్‌వెల్‌ 3-0-20-0; కమిన్స్‌ 4-0-30-1; జంపా 4-0-22-1; మిచెల్‌ మార్ష్‌ 1-0-11-0

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రిజ్వాన్‌ (బి) షాదాబ్‌ 49; ఫించ్‌ ఎల్బీ (బి) షహీన్‌ అఫ్రిది 0; మిచెల్‌ మార్ష్‌ (సి) అసిఫ్‌ (బి) షాదాబ్‌ 28; స్టీవ్‌ స్మిత్‌ (సి) ఫకార్‌ జమాన్‌ (బి) షాదాబ్‌ 5; మ్యాక్స్‌వెల్‌ (సి) రవూఫ్‌ (బి) షాదాబ్‌ 7; స్టాయినిస్‌ నాటౌట్‌ 40; వేడ్‌ నాటౌట్‌ 41; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (19 ఓవర్లలో 5 వికెట్లకు) 177; వికెట్ల పతనం: 1-1, 2-52, 3-77, 4-89, 5-96;  బౌలింగ్‌: షహీన్‌ అఫ్రిది 4-0-35-1; ఇమద్‌ 3-0-25-0; రవూఫ్‌ 3-0-32-0; హసన్‌ అలీ 4-0-44-0; షాదాబ్‌ ఖాన్‌ 4-0-26-4; హఫీజ్‌ 1-0-13-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని