Published : 18/12/2020 01:27 IST

కోహ్లీ ఒక్కడే: తొలి రోజు రక్షణాత్మకం

233/6తో నిలిచిన టీమ్‌ఇండియా

అద్భుతంగా బంతులేసిన ఆసీస్‌ పేసర్లు

అడిలైడ్‌: తొలి సెషన్లో ఆసీస్‌ బౌలర్ల ఆధిపత్యం. రెండో సెషన్లో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ పోరాటం. మూడో సెషన్లో జోరు పెంచిన సారథి, ఉపసారథి నిష్ర్కమణ.. కంగారూల పైచేయి. ఇదీ స్థూలంగా ఆస్ట్రేలియా, భారత్‌ డే/నైట్‌ టెస్టు మొదటి రోజు ఆట. గులాబి పోరులో మెరుపులు మెరిపిస్తుందనుకున్న భారత్‌ తొలిరోజు, గురువారం పూర్తిగా రక్షణాత్మకంగా ఆడింది. ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (15 బ్యాటింగ్‌), వృద్ధిమాన్‌ సాహా (9 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.


షా.. ష్‌!

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో శుభారంభం దక్కలేదు. పరుగుల ఖాతా తెరవకముందే వికెట్‌ చేజార్చుకుంది. సన్నాహక మ్యాచులోనే విఫలమైన ఓపెనర్‌ పృథ్వీషా (0) మిచెల్‌ స్టార్క్‌ విసిరిన ఇన్నింగ్స్‌ రెండో బంతికే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. రెండు బౌండరీలు బాదిన మయాంక్‌ అగర్వాల్‌ (17; 40 బంతుల్లో 2×4) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. జట్టు స్కోరు 32 వద్ద కమిన్స్‌ వేసిన 18.1వ బంతికి వికెట్‌ చేజార్చుకున్నాడు. అయితే పుజారాతో కలిసి రెండో వికెట్‌కు అతడు 32 పరుగుల భాగస్వామ్యం అందించాడు.


లైయన్‌తో పుజారా యుద్ధం

ఈ క్రమంలో విరాట్‌ కోహ్లీతో కలిసిన నయావాల్‌ ఆసీస్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. బంతి ఏదైనా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్‌ లైయన్‌కు అతడికి మధ్య కనిపించని యుద్ధం జరిగింది. పరస్పరం మైండ్‌గేమ్‌ ఆడారు. విరాట్‌తో కలిసి పుజారా మూడో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో 49.3 ఓవర్ల (300 బంతులు)కు టీమ్‌ఇండియా 100/2 పరుగులు చేసింది. అయితే లైయన్‌ వేసిన ఆ తర్వాతి బంతికే అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ ఔటివ్వకపోవడంతో ఆసీస్‌ సమీక్షకు వెళ్లి విజయవంతం అయింది. అజింక్య రహానె రావడంతో 107/3 వద్ద టీమ్‌ఇండియా తేనీటి విరామానికి వెళ్లింది.


జింక్స్‌తో కలిసి కోహ్లీ పోరాటం

తొలి రెండు సెషన్లలో ఆచితూచి ఆడిన టీమ్‌ఇండియా మూడో సెషన్లో గేర్లు మార్చింది. బంతి పాతబడటంతో కోహ్లీ, రహానె సొగసైన బౌండరీలు బాదేశారు. చక్కని బంతుల్ని గౌరవిస్తూనే చెత్త బంతులకు పరుగులు రాబట్టారు. అదే జోరులో 123 బంతుల్లో కోహ్లీ అర్ధశతకం సాధించాడు. అతడికి తోడుగా జింక్స్‌ సైతం ఓ చక్కని సిక్సర్‌తో అలరించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 168 బంతుల్లో 88 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించి జట్టు స్కోరును 150 దాటించారు.


వరుస షాకులు

ఇక స్కోరుబోర్డు పరుగులు పెడుతుందని భావించగా జట్టు స్కోరు 188 వద్ద కోహ్లీ రనౌట్‌ అయ్యాడు. రహానె అనవసర పరుగుకు ప్రయత్నించడంతో శతకం వైపు పయనిస్తున్న కెప్టెన్‌ కోహ్లీ పెవిలియన్‌ చేరాడు. దాంతో 188/3తో పటిష్ఠగా కనిపించిన టీమ్‌ఇండియాకు ఊహించని షాక్‌ తగిలినట్టు అనిపించింది. మరికాసేపటికే అర్ధశతకానికి చేరువైన రహానె సైతం జట్టుస్కోరు 196 వద్ద స్టార్క్‌ విసిరిన బంతికి ఎల్బీ అయ్యాడు. ఆదుకుంటాడని అనుకున్న హనుమ విహారి (16; 25 బంతుల్లో 2×4)ని 82.2వ బంతికి హేజిల్‌వుడ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అప్పుడు స్కోరు 206. ఆ తర్వాత నైట్‌ వాచ్‌మన్‌ రవిచంద్రన్‌ అశ్విన్ ‌(15; 17 బంతుల్లో 1×4), వృద్ధిమాన్‌ సాహా (9; 25 బంతుల్లో 1×4) వికెట్‌ పోకుండా ఆడి టీమ్‌ఇండియాను 89 ఓవర్లకు 233/6తో నిలిపారు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 2, హేజిల్‌వుడ్‌, కమిన్స్‌, లైయన్‌ తలో వికెట్‌ తీశారు. రెండో రోజు భారత్‌ 250+ పరుగులు చేస్తే బౌలర్లకు పోరాడే అవకాశం ఉంటుంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని