Updated : 04/09/2020 17:40 IST

బీసీసీఐకి తలనొప్పి! తెగదెంపులకు సిద్ధమైన వివో?

చైనీస్‌ స్పాన్సర్‌పై వ్యతిరేకతే కారణం

ఏం చేయాలో పాలుపోని స్థితిలో బోర్డు!

బీసీసీఐకి మరో కొత్త తలనొప్పి! ఐపీఎల్‌-2020పై నీలిమబ్బులు కమ్ముకుంటున్నాయి. టైటిల్‌ స్పాన్సర్‌ ‘వివో ఇండియా’ బోర్డుతో తెగదెంపులు చేసుకొనేందుకు సిద్ధమైందని సమాచారం. వీలైతే పూర్తి కాలానికి లేదా కనీసం ఈ సీజన్‌కైనా దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఫలితంగా బోర్డుకు ఏం చేయాలో? సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితి.


అసలేమైంది?

సాధారణంగా మార్చిలో ఐపీఎల్‌ మొదలవ్వాలి. కరోనా వైరస్ మహమ్మారి ముప్పుతో నిరవధికంగా వాయిదా వేశారు. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఆసియాకప్‌, ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా వేయడం కలిసొచ్చింది. సెప్టెంబర్‌,  అక్టోబర్‌, నవంబర్లో లీగ్‌ నిర్వహణకు విండో దొరికింది.‌ భారత్‌లో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో వేదికను యూఏఈకి మారుస్తున్నట్టు ఐపీఎల్‌ పాలక మండలి ఆదివారం ప్రకటించింది. సెప్టెంబర్‌ 19న మొదలై నవంబర్‌ 10న టోర్నీ ముగుస్తుందని వెల్లడించింది. టైటిల్‌ స్పాన్సర్‌గా ‘వివో ఇండియా’నే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో వ్యతిరేకత మొదలైంది.

 


యాప్‌ల నిషేధంతో రచ్చ!

గల్వాన్‌ లోయలో చైనీయులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అటువైపు 45 మంది వరకు హతమయ్యారని సమాచారం. ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రికత్తలు పెరిగాయి. దుందుడుకు చైనా ఆట కట్టించేందుకు భారత్‌ వివిధ అస్త్రాలను ప్రయోగించింది. ఇందులో భాగంగానే భారతీయుల సమాచారం తస్కరణ, సార్వభౌమత్వానికి భంగం కలుగుతోందని టిక్‌టాక్‌, హెలో సహా అనేక యాప్‌లను నిషేధించింది. విడతల వారీగా నిషేధిత యాప్‌లను ప్రకటిస్తోంది. అలాంటప్పుడు చైనాకు చెందిన వివో స్పాన్సర్‌షిప్‌ను ఎలా కొనసాగిస్తారని సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్రాండ్‌ పేరు దెబ్బతింటుందని భావించిన వివో స్పాన్సర్‌షిప్‌ నుంచి వైదొలగేందుకు నిర్ణయం తీసుకుందని తెలిసింది.

 


కొత్త స్పాన్సర్‌ దొరికేనా?

వివోతో వివాదం ఎలా సర్దుకుంటుందోనని బీసీసీఐ భయపడుతోంది. మధ్యవర్తి ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిసింది. వివో 2017లో ఐదేళ్ల కాలానికి రూ.2199 కోట్లతో ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ పొందింది. ఏడాదికి రూ.440 కోట్ల చొప్పున చెల్లిస్తుంది. ఇప్పుడు హఠాత్తుగా వైదొలగితే మరో కొత్త స్పాన్సర్‌ దొరుకుతారా? ఇంతే సొమ్ము చెల్లించగలరా అని బోర్డు ఆవేదన. కరోనా విపత్కర కాలంలో రూ.440 కోట్లలో సగం ధరకైనా మరొకరు దొరికితే గొప్పేనని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు యూఏఈలో నిర్వహిస్తే తాము నష్టపోయే గేట్‌మనీ పరిహారం చెల్లించాలని కొన్ని ఫ్రాంచైజీలు గట్టిగానే డిమాండ్‌ చేస్తుండటమూ బోర్డును కలవరపెడుతోంది.


మధ్యలో మరొకరు!

ఇప్పటికే ఇబ్బందుల్లో పడిన బీసీసీఐకి మరొకరు పక్కలో బల్లెంలా మారారు! యూఏఈలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణకు బోర్డుకు అనుమతించొద్దని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి జయశంకర్‌కు అఖిల భారత వ్యాపారుల సంఘం (సీఏఐటీ) లేఖ రాసిందని తెలిసింది. చైనా స్పాన్సర్‌తో తెగదెంపులు చేసుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం చైనా వస్తువుల విక్రయానికి వ్యతిరేకంగా సీఏఐటి పోరాడుతోంది. కరోనా వైరస్‌ కారణంగా ఒలింపిక్స్‌ను వాయిదా వేయగా లేనిది ఐపీఎల్ ఎందుకని ప్రశ్నించారని తెలిసింది. ఇలాంటి వివాదాల నడుమ ఐపీఎల్‌ నిర్వహణ అంత సులభమైతే కాదు.

-ఇంటర్‌నెట్‌ డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని