
IPL తిరిగి ప్రారంభమైనా ఆడడం కష్టం: స్టోక్స్
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా కేసుల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ తిరిగిమయినా ఆ షెడ్యూల్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆడటం కష్టమేనని ఆ జట్టు ప్రధాన ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్.. ఈ సీజన్‌లో పంజాబ్‌తో తలపడిన మ్యాచ్‌లోనే గాయం కారణంగా మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే స్వదేశానికి చేరుకొని శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్ వాయిదాపై ఓ అంతర్జాతీయ పత్రికలో తన కాలమ్‌లో పైవిధంగా స్పందించాడు.
‘‘టోర్నమెంట్ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది మాకు తెలియదు. అయితే, ఈసీబీ చెప్పినట్లు మా ఇంగ్లాండ్ ఆటగాళ్లకు విశ్రాంతి సమయం దొరకడం చాలా కష్టం. ఈ ఏడాది గడిచాక ఏదో ఒక సమయంలో పూర్తిస్థాయి ఐపీఎల్ ఆడటానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని స్టోక్స్ రాసుకొచ్చాడు. అలాగే ఈ సీజన్‌లో తాను ఆదిలోనే రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లని వీడిపోవడం బాధగా అనిపించినా.. టోర్నీ నిలిచిపోయాక ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలను త్వరగా కలుసుకున్నారని స్టోక్స్ పేర్కొన్నాడు.