
spot fixing : బ్రెండన్ టేలర్‌పై మూడున్నరేళ్లునిషేధం
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్ చేసేందుకు తనను ఓ భారత వ్యాపారి సంప్రదించడం గురించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఆలస్యంగా సమాచారమిచ్చినందుకుగానూ జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్‌పై ఐసీసీ మూడున్నరేళ్లు నిషేధం విధించింది. ‘బ్రెండన్ ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్వయంగా అంగీకరించాడు. అతను మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు, అవినీతికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు మూడున్నరేళ్లు ఏ విధమైన క్రికెట్ ఆడకుండా నిషేధం విధిస్తున్నాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
జింబాబ్వేలో టీ20 లీగ్ ప్రారంభం గురించి చర్చించడం కోసం ఓ వ్యాపారి 2019 అక్టోబరులో తనను భారత్‌కు పిలిచాడని బ్రెండన్ టేలర్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కొకైన్ తీసుకున్నానని, దాన్ని అడ్డం పెట్టుకుని తనను బ్లాక్మెయిల్ చేశాడని అతడు పేర్కొన్నాడు. బుకీల వలలో ఎలా పడ్డాడో స్వయంగా అతడే వివరించాడు. ‘ఆ వ్యాపారితో సమావేశం సందర్భంగా అందరం మద్యం సేవించాం. వాళ్లు నాకు కొకైన్ అందించారు. తర్వాతి రోజు వాళ్లు నా హోటల్ గదికి వచ్చి.. అంతకు ముందు రోజు రాత్రి నేను కొకైన్ తీసుకుంటుండగా తీసిన వీడియోను చూపించారు. తమ కోసం అంతర్జాతీయ క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్ చేయకపోతే వీడియోను జనాలకు చేరేలా చేస్తామని బెదిరించారు. నేను దిక్కుతోచని స్థితిలో పడ్డా. నా హోటల్ గదిలో వాళ్లు ఆరుగురు ఉండడంతో చాలా భయమేసింది. స్పాట్ ఫిక్సింగ్ కోసం వాళ్లు నాకు 15 వేల డాలర్లు ఇచ్చారు. పని పూర్తి చేశాక మరో 20 వేల డాలర్లు ఇస్తామని చెప్పారు. ముందు విమానమెక్కి భారత్ నుంచి బయటపడొచ్చనుకుని ఆ డబ్బు తీసుకున్నా. ఆ సమయంలో నాకు మరో మార్గం లేదు. తిరస్కరించే అవకాశమే లేకపోయింది’ అని బ్రెండన్ వివరించాడు. ఆ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత బ్రెండన్ దాని గురించి ఐసీసీకి చెప్పడం గమనార్హం. అయితే స్వయంగా తానెప్పుడూ ఫిక్సింగ్ చేయలేదని బ్రెండన్ స్పష్టం చేశాడు.