T20 World Cup: సెమీస్‌కు టీమిండియా వెళ్తుందన్న బ్రెట్‌లీ.. అయితే ఎప్పుడంటే?

టీమిండియా సెమీస్‌ అవకాశాలపై విశ్లేషించిన బ్రెట్‌లీ 

Published : 27 Oct 2021 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ బ్రెట్‌లీ అంచనా వేశాడు. పూర్తి సామర్థ్యాలతో రాణించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. ఇప్పటికైనా హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ చేసేందుకు సిద్ధం కావాలని సూచించాడు. అలానే భువనేశ్వర్‌ కుమార్‌ పేస్ రాబట్టాలని పేర్కొన్నాడు. పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్‌లీ మాట్లాడుతూ.. టీమిండియా బౌలింగ్‌తో టోర్నీలో తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నాడు. హార్దిక్‌ బౌలింగ్‌ చేయగలిగితే భారత జట్టు పటిష్ఠంగా మారినట్టేనని వ్యాఖ్యానించాడు. ఒకవేళ అతను ఫిట్‌గా లేకపోతే మాత్రం టీమిండియా ఇతర అవకాశాలను పరిశీలించాలన్నాడు. అయితే, మంచి ఆల్‌రౌండర్‌గా జట్టులో హార్దిక్‌ కీలక పాత్ర పోషిస్తాడని నమ్ముతున్నట్లు తెలిపాడు. ‘‘పాండ్యకు మంచి నైపుణ్యం ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే సామర్థ్యం ఉంది. డెత్‌ ఓవర్లలో చాలా బాగా బౌలింగ్‌ చేయగలడు. బౌన్సర్లు, యార్కర్లు, పేస్‌లో మార్పులు చూపించగలడు. అందుకే టీమిండియాకు పాండ్య అదనపు బలం’’ అని విశ్లేషించాడు. 

భువనేశ్వర్‌ విఫలమవ్వడంపైనా బ్రెట్‌లీ స్పందించాడు. ‘‘ఇరువైపులా స్వింగ్‌ చేయగల నైపుణ్యం భువి సొంతం. ప్రపంచంలోని చాలా మంది ఫాస్ట్‌ బౌలర్లు ఇన్‌, ఔట్ స్వింగర్లను వేయలేరు. యూఏఈ వేదికలపై చాలా ప్రభావం చూపగలడు. భువనేశ్వర్‌ గంటకు దాదాపు 140కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతాడు. అయితే, బౌలింగ్‌లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని భావిస్తున్నా. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో లెంగ్త్‌ విషయంలో కొన్ని పొరపాట్లు చేశాడు’’ అని వివరించాడు. వైవిధ్యంగా బంతులను సంధించే క్రమంలో లెంగ్త్‌ విషయాన్ని భువి మరిచినట్లుగా ఉందని పేర్కొన్నాడు. మోకాలు కిందికి, లెంగ్త్‌లో వేయడంలో భువి దిట్ట అని.. అలాంటి బంతులకు ఎల్బీడబ్ల్యూగా లేదా కీపర్‌ క్యాచ్‌లను రాబట్టగలడని తెలిపాడు.

మూడో ఫాస్ట్‌ బౌలర్‌ వద్దనుకుంటేనే అశ్విన్‌కు చోటు!

జట్టులో వరుణ్ చక్రవర్తి నాణ్యమైన లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ అని.. మరోవైపు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్పెషలిస్ట్‌ బ్యాటర్, స్పిన్నర్‌ కాబట్టి రవిచంద్రన్‌ అశ్విన్‌ వైపు జట్టు యాజమాన్యం మొగ్గు చూపడం కష్టమేనని బ్రెట్‌లీ విశ్లేషించాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లతో దిగే అవకాశాలు చాలా తక్కువని అంచనా వేశాడు. మూడో ఫాస్ట్‌ బౌలర్‌ రాణించకపోతే అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్నాడు. వచ్చే మ్యాచుల్లో టీమిండియా బుమ్రా, భువి, షమీతోపాటు నాలుగో బౌలర్‌గా వరుణ్‌ చక్రవర్తి, ఐదో బౌలర్‌గా జడేజాను ఎంచుకోవచ్చని బ్రెట్‌ లీ పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని