Umran Malik: టీమ్‌ఇండియాలో ఉమ్రాన్‌ అత్యంత గొప్ప బౌలర్‌ అవుతాడు: చమిందా వాస్

హైదరాబాద్‌ యువ పేస్‌ సంచలనం, జమ్మూ కశ్మీర్‌ కుర్రాడు ఉమ్రాన్‌ మాలిక్‌ టీమ్‌ఇండియా తరఫున అత్యంత గొప్ప బౌలర్‌ అవుతాడని శ్రీలంక దిగ్గజ పేసర్‌...

Published : 20 May 2022 01:38 IST

                                                    (Photo: Umran Malik Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌ యువ పేస్‌ సంచలనం, జమ్మూ కశ్మీర్‌ కుర్రాడు ఉమ్రాన్‌ మాలిక్‌ టీమ్‌ఇండియా తరఫున అత్యంత గొప్ప బౌలర్‌ అవుతాడని శ్రీలంక దిగ్గజ పేసర్‌ చమిందా వాస్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత టోర్నీలో చాలా నిలకడగా బౌలింగ్‌ చేస్తూ.. 150కిమీ వేగానికి పైగా బౌలింగ్‌ చేస్తున్న ఉమ్రాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. ఈ సీజన్‌లో అతడు అత్యధికంగా 157 కిమీ వేగంతో బౌలింగ్‌ చేశాడు. దీంతో చాలా మంది క్రికెట్‌ పండితులే కాకుండా ఇతర రంగాల వారు సైతం అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని వెంటనే టీమ్ఇండియాలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో లంక మాజీ పేసర్‌ చేరాడు.

‘తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన శ్రీలంక మాజీ పేసర్‌ ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఉమ్రాన్‌ రోజు రోజుకూ రాటుదేలుతున్నాడు. మేటి పేసర్‌గా తయారవుతున్నాడు. గతేడాది కూడా హైదరాబాద్‌ జట్టులో అతడు బౌలింగ్‌ చేయడం నేను చూశాను. చాలా నిలకడగా 150 కిమీల వేగానికి పైగా బౌలింగ్‌ చేస్తున్నాడు. టీ20 క్రికెట్‌లో కచ్చితత్వం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అతడు ఇలాగే రాణిస్తే టీమ్‌ఇండియా తరఫున అత్యంత గొప్ప బౌలర్‌ అవుతాడు. ఒకవేళ భారత జట్టు యాజమాన్యం అవకాశం ఇస్తే రాబోయే టీ20 ప్రపంచకప్‌లో బుమ్రాతో కలిసి బౌలింగ్‌ చేస్తాడు. తర్వాత చాలా దూరం ప్రయాణిస్తాడు’ అని వాస్‌ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్‌ 8.93 ఎకానమీతో 21 వికెట్లు తీశాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని