T20 World Cup: ‘కమాన్.. ఇండియా మొత్తం మన వెంట ఉంది’

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం న్యూజిలాండ్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటి అనుకుంటున్నారా.. కివీస్ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో స్కాట్లాండ్

Published : 04 Nov 2021 01:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం న్యూజిలాండ్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటి అనుకుంటున్నారా.. కివీస్ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో స్కాట్లాండ్ వికెట్‌కీపర్‌ మాథ్యూ క్రాస్ నోటి వెంట భారత్‌ పేరు రావడం. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో క్రిస్ గ్రీవ్స్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో గ్లెన్‌ ఫిలిప్స్ బ్యాటింగ్‌ చేశాడు. తమ జట్టు ఆటగాళ్లలో ఉత్సాహాం నింపడం కోసం ‘కమాన్.. ఇండియా మొత్తం మన వెంట ఉంది’ అని మాథ్యూ క్రాస్ అన్నాడు. ఈ మాటలు వికెట్లలో ఉండే మైక్‌లలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కొంతమంది ట్విటర్‌లో పోస్టు చేస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

అయితే, స్కాట్లాండ్ వికెట్ కీపర్ అలా మాట్లాడటానికి ఓ కారణం ఉంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినా సాంకేతికంగా మాత్రం భారత్‌కు ఇంకా సెమీస్ చేరే అవకాశం ఉంది. అది ఎలాగంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా భారీ తేడాతో గెలవడంతోపాటు స్కాట్లాండ్ చేతిలో న్యూజిలాండ్‌ ఓడిపోవాలి. ఈ కారణంగానే స్కాట్లాండ్ వికెట్ కీపర్‌ ఆ విధంగా మాట్లాడాడు. అయితే, ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 16 పరుగుల తేడాతో ఓడింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్తిల్ (93; 56 బంతుల్లో 4x6, 6X7) దంచికొట్టగా.. గ్లెన్‌ ఫిలిప్స్ (33) రాణించాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో సఫ్యాన్‌ షరీఫ్‌, బ్రాడ్లే వీల్‌ రెండేసి, మార్క్‌ వాట్‌ ఒక వికెట్‌ తీశారు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  స్కాట్లాండ్‌ 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. దీంతో స్కాట్లాండ్‌ ఓటమిపాలైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని