Updated : 17/11/2021 08:23 IST

Rahul Dravid: కొత్త కొత్తగా.. 

కెప్టెన్‌ రోహిత్‌, కోచ్‌ ద్రవిడ్‌ల భవిష్యత్‌ ప్రణాళికలు సిద్ధం
న్యూజిలాండ్‌ సిరీస్‌తో నయా ప్రస్థానం ఆరంభం

టీ20 ప్రపంచకప్‌ చేదు జ్ఞాపకాల నుంచి భారత అభిమానులు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. ఇంకో కప్పు కోసం ఎక్కువ కాలం ఎదురు చూడాల్సిన పని లేదు. ఇంకో ఏడాది లోపే ఇంకో టోర్నీ వస్తోంది. అందులో విజయవంతం కావడానికి టీమ్‌ఇండియా సరికొత్తగా సిద్ధమవుతోంది. టీమ్‌ఇండియాకు కొత్త కోచ్‌గా నియమితుడైన రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి టీ20 ఫార్మాట్లో కొత్తగా పగ్గాలందుకున్న రోహిత్‌ శర్మ పక్కా ప్రణాళికలతోనే రంగంలోకి దిగుతున్నట్లున్నారు. బుధవారం న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే టీ20 సిరీస్‌తో వీరి ప్రస్థానం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో తమ పరస్పర బంధం గురించి.. అలాగే టీమ్‌ఇండియాకు సంబంధించి భవిష్యత్‌ ప్రణాళికల గురించి వీళ్లిద్దరూ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే..


ద్రవిడ్‌ ఆ మాట అనగానే..: 2007లో నేను భారత జట్టుకు ఎంపికైనపుడు బెంగళూరులో జరిగిన శిబిరంలో ద్రవిడ్‌తో తొలిసారి మాట్లాడే అవకాశం దక్కింది. బెరుగ్గా అనిపించి ఎక్కువసేపు మాట్లాడలేదు. తర్వాత ఐర్లాండ్‌తో సిరీస్‌ తొలి మ్యాచ్‌ ముంగిట ద్రవిడ్‌ నా దగ్గరికొచ్చి ‘నువ్వీ మ్యాచ్‌ ఆడుతున్నావు’ అనగానే చంద్రుడిపై వెళ్లినట్లు అనిపించింది. ద్రవిడ్‌ స్థాయి ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూంను పంచుకోవడం గొప్ప అనుభవం.

విఫలమైనా మద్దతిస్తాం: టీ20 క్రికెట్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ ఫార్మాట్‌ అంటేనే సాహసోపేత రీతిలో ఆడాల్సి ఉంటుంది. అన్నిసార్లూ విజయవంత అవుతామన్న గ్యారెంటీ ఉండదు. అలాంటపుడు ఆటగాళ్లకు తమ స్థానం పట్ల హామీ ఇవ్వాల్సిన అవసరముంది. ఆటగాళ్లు తమ సహజ శైలిలో ఆడేందుకు అవసరమైన మద్దతు నేను, కోచ్‌ ఇవ్వాలి. ఓ ఆటగాడు విఫలమైనా అతడికి ఇంకో అవకాశం ఇవ్వడానికి, తనలో ఆత్మవిశ్వాసం నింపడానికి చూస్తాం.

మాకంటూ ఓ శైలి:  చాలా ఏళ్ల నుంచి ఐసీసీ టోర్నమెంట్‌ గెలవలేదన్న మాటే కానీ.. భారత జట్టు టీ20 ఫార్మాట్లో ఎప్పుడూ బాగానే ఆడుతోంది. అయితే జట్టులో కొన్ని లోపాలున్నాయి. వాటిని పూడ్చాలి. ఫలానా జట్టులా అవ్వాలని మేం ప్రయత్నించం. మాకంటూ ఒక శైలిని ఏర్పరుచుకుంటాం.  ఈ ప్రపంచకప్‌ తర్వాత తాజాగా మొదలుపెడుతున్నాం. వచ్చే ఏడాది టోర్నీ కోసం కొన్ని ఆలోచనలతో ముందుకు సాగాలనుకుంటున్నాం. జట్టులో కోహ్లి పాత్ర ఎప్పట్లాగే ఉంటుంది. ఇప్పటిదాకా ఏం చేస్తున్నాడో ఇక ముందూ అదే చేస్తాడు. జట్టులో అతను చాలా కీలకమైన ఆటగాడు. విరాట్‌ ఎప్పుడూ ఆడినా తనదైన ముద్ర వేస్తాడు. అతను తిరిగి జట్టులోకి వస్తే తన అనుభవం, బ్యాటింగ్‌ సామర్థ్యం వల్ల జట్టు బలం ఇంకా పెరుగుతుంది.’’

ఏం చేయాలో అన్నీ చేస్తాం: జట్టులో కుర్రాళ్లను తీర్చిదిద్దడం చాలా కీలకమైన విషయం. వెంకటేశ్‌ అయ్యర్‌ అనే కాదు.. అందరినీ తీర్చిదిద్దాలి. జట్టుకు ఒక నాణ్యమైన బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అవసరమున్న మాట వాస్తవం. ఆ దిశగా దృష్టి పెడతాం. ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆడుతున్న కుర్రాళ్ల మీదా దృష్టిపెట్టాలి. టీ20ల్లో ఒక విజయవంతమైన జట్టుగా తయారు కావడానికి ఏం చేయాలో అన్నీ చేయడానికి ప్రయత్నిస్తాం’’

- రోహిత్‌ శర్మ


రోహిత్‌తో తొలిసారి అలా..: 2007లో రోహిత్‌ ఐర్లాండ్‌ సిరీస్‌ కోసం తొలిసారి భారత జట్టులోకి వచ్చాడు. అయితే అంతకుముందే ఛాలెంజర్‌ టోర్నీ ఆడుతుండగా రోహిత్‌ను తొలిసారి చూశా. ఈ 14 ఏళ్లలో అతను ఒక వ్యక్తి నుంచి నాయకుడి స్థాయికి ఎదిగాడు. భారత ఆటగాడిగానే కాక ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా అతను ఎంతో సాధించాడు. ముంబయి, భారత క్రికెట్‌ ఘన వారసత్వాన్ని కొనసాగించడం అంత తేలిక కాదు.

అన్ని జట్లతో ఒకేలా కుదరదు: కోచింగ్‌ విషయంలో వేర్వేరు జట్లతో ఒకే రకంగా వ్యవహరించలేం. ఒక్కో జట్టుకు ఒక్కో విధమైన సవాళ్లు ఉంటాయి. అవసరాలు వేరుగా ఉంటాయి. అండర్‌-19 స్థాయిలో నేను చేసినవన్నీ ఇక్కడ చేయలేను. నా శైలే అలా ఉండదు. నిజానికి భారత జట్టు కోచ్‌గా నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయనుకుంటున్నా. ఆటగాళ్ల గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను బయటికి తెచ్చేలా మనల్ని మనం ముందు సిద్ధం చేసుకోవడం సహాయ సిబ్బంది ప్రధాన కర్తవ్యం.

రెండూ చేయాలి: జూనియర్‌ స్థాయిలో విజయం కంటే ఆటగాళ్లను భవిష్యత్‌ దిశగా సిద్ధం చేయడం కీలక అంశం. కానీ భారత జట్టుకు వస్తే ప్రతి మ్యాచ్‌ గెలవడం ప్రధాన కర్తవ్యం. దాంతో పాటే ఆటగాళ్లను సుదీర్ఘ కెరీర్‌ దిశగా నడిపించాలి. వచ్చే రెండేళ్లలో పెద్ద పెద్ద టోర్నీలు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో అందుకు ఆటగాళ్లను సిద్ధం చేయడం ముఖ్యం. ఏదో ఒక ఫార్మాట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఉండదు. రాబోయే రెండేళ్లలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌, టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌ ఉన్నాయి. అన్నింటికీ తయారుగా ఉండాలి.

అలాంటి ఆలోచన లేదు: వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు    జట్లను సిద్ధం చేసే ఆలోచనేమీ లేదు. కొందరు ఒక ఫార్మాట్లోనే ఆడతారు. కొందరు అన్ని ఫార్మాట్లలోనూ ఆడతారు. ఆటగాళ్ల భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని సరైన స్థితిలో ఉంచడం కీలకం. వాళ్లు తాజాగా ఉండేలా చూడాలి. అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు ఎదురయ్యే సవాళ్లను గుర్తించాలి. ప్రస్తుతం క్రికెటర్లు చాలా ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్నారు. కాబట్టి ఎవరికెప్పుడు విశ్రాంతి అవసరమో చూస్తుండాలి. ఫిట్‌నెస్‌ సమస్యలు రాకుండా, ప్రధాన టోర్నీలకు కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడాలి.

- రాహుల్‌ ద్రవిడ్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని