David Warner: ఐపీఎల్‌ మెగా వేలంలోకి వచ్చేస్తా: డేవిడ్ వార్నర్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో స్థానంపై డేవిడ్‌ వార్నర్

Published : 29 Oct 2021 02:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా ఓపెనింగ్‌ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌ ఎంత ప్రమాదకర ఆటగాడంటే.. ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేయగలడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సన్‌రైజర్స్‌ అంటే వార్నరే గుర్తుకొస్తాడు. 2016లో టైటిల్‌ను అందించాడు. అలాంటి బ్యాటర్ ప్రస్తుత సీజన్‌లో ఫామ్‌లేమితో ఇబ్బంది పడ్డాడు. రెండు దశల్లో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌లోనూ విఫలమయ్యాడు. దీంతో యూఏఈ ఎడిషన్‌లో కెప్టెన్సీతోపాటు జట్టులోనూ స్థానం గల్లంతైంది. వార్నర్‌ స్థానంలో కేన్ విలియమ్సన్ సారథ్య బాధ్యతలు చేపట్టినా సన్‌రైజర్స్ తలరాత మాత్రం మారలేదు. సీజన్‌ను ఆ జట్టు ఆఖరి స్థానంతో ముగించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో డేవిడ్ వార్నర్‌ ఉంటాడా? లేదా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉండేది. వార్నర్‌ను హైదరాబాద్‌ జట్టు రిటెయిన్ చేసుకుంటుందా? లేదా అనేదీ సందేహమే. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ తనను అట్టిపెట్టుకుంటుందని మాత్రం తాను అనుకోవడం లేదని వార్నర్ పేర్కొన్నాడు. అయితే దీనిపై సన్‌రైజర్స్ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

సన్‌రైజర్స్ తుది జట్టులో చోటు లభించకపోవడంపై వార్నర్ స్పందిస్తూ.. ‘‘ఆ నిర్ణయం మింగుపడని చేదు గుళికలాంటిది. అయితే నన్ను తప్పించడానికి చెప్పిన లాజిక్‌ నవ్వు తెప్పించింది. ఇద్దరు యువ ఆటగాళ్లు నా కంటే మెరుగ్గా ఆడారని.. నేను గేమ్ ఆడుతున్నప్పుడు సరైన దృక్పథంతో ఆడలేదని వారిని తీసుకున్నట్లు చెప్పారు. ఇక వచ్చే సీజన్‌ ఐపీఎల్‌ విషయానికొస్తే.. నన్ను సన్‌రైజర్స్‌ తమ వద్దే ఉంచుకుంటుందని అనుకోవడం లేదు. వచ్చే వేలంలో నా పేరును ఉంచుతా. ఇటీవల ఐపీఎల్ పరిణామాల నేపథ్యంలో సన్‌రైజర్స్ నన్ను రిటెయిన్ చేయడం కష్టమే. అందుకే కొత్త ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నాడు. మెగా ఆక్షన్‌ వచ్చే డిసెంబర్‌లోగానీ, జనవరిలో గానీ నిర్వహించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని