Deepak Chahar: దీపక్‌ కంటతడి.. కాబోయే భార్య స్పందన ఇదీ..!

దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ (54: 34 బంతుల్లో 5×4, 2×6) ఆఖరి వరకు పోరాడినా.. భారత్‌ని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఆ బాధను నియంత్రించుకోలేక కన్నీళ్లు కార్చాడు...

Published : 25 Jan 2022 01:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ (54: 34 బంతుల్లో 5×4, 2×6) ఆఖరి వరకు పోరాడినా.. భారత్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఆ బాధను నియంత్రించుకోలేక కంటతడి పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై స్పందించిన దీపక్‌ చాహర్‌ కాబోయే భార్య జయ భరద్వాజ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకుంది.

‘క్రికెట్లో కొన్నిసార్లు ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. జట్టులో చోటు దక్కనప్పుడు ఇంత కంటే బాధగా ఉంటుంది. కానీ, ఆట పట్ల మీరు చూపే అంకితభావం, అభిరుచి, జట్టు విజయం కోసం ఆఖరి వరకు పోరాడే గుణం.. మిమ్మల్ని మైదానంలో ఛాంపియన్‌గా నిలుపుతాయి. క్రికెట్లో గెలుపోటములు సహజమే. కొన్ని సార్లు ఓడిపోతుంటాం.  కొన్నిసార్లు గెలుస్తుంటాం. అయితే, భారత జట్టు విజయం కోసం ఆఖరి వరకు మీరు పోరాడిన తీరు పట్ల దేశం మొత్తం గర్విస్తోంది. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా దేశాన్ని గెలిపించేందుకు నేనున్నానని నిరూపించారు. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. జై హింద్‌’ అని జయ భరద్వాజ్‌ పోస్ట్‌ చేశారు.

కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో భారత్‌ నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 287 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 288 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన టీమ్‌ఇండియాకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ (9) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ (65), శిఖర్‌ ధావన్ (61) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని నిలబెట్టారు. స్వల్ప వ్యవధిలో వీళ్లిద్దరూ పెవిలియన్‌ చేరడంతో భారత్‌ కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్ రాణించలేకపోయారు. ఆఖర్లో బ్యాటింగ్ వచ్చిన దీపక్‌ చాహర్‌ భారత్‌ విజయంపై ఆశలు రేకెత్తించాడు. బౌండరీలతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. అయితే, లుంగి ఎంగిడి వేసిన 48వ ఓవర్లో షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్‌ పరాజయం ఖరారైపోయింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో బుమ్రా, యుజ్వేంద్ర చాహల్‌ ఔటయ్యారు. స్పూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న దీపక్‌ చాహర్‌కు భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలిస్తామని కోచ్‌ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని