Olympics: రెండేసి పతకాలతో రికార్డులు.. ఒకరు జైల్లో.. మరొకరు గుండెల్లో!!

ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో రజతం. ఈ సారి కాంస్యం. ఇలా వరుస ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మన సింధు గెలిచింది కాంస్యమే అయినా దేశ ప్రజలందరికీ ఆమె బంగారం.

Updated : 03 Aug 2021 11:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో రజతం. ఈ సారి కాంస్యం. ఇలా వరుస ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మన సింధు గెలిచింది కాంస్యమే అయినా దేశ ప్రజలందరికీ ఆమె బంగారం. రాష్ట్రపతి, దేశ ప్రధాని మొదలుకొని ఆమెను కొనియాడని వారు లేరు.. ఆమె గురించి మాట్లాడుకోని వారు లేరు.

కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తి గురించి కూడా దేశం మొత్తం మాట్లాడుకుంది. అతడే రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌. కాలచక్రం గిర్రున తిరిగింది. ఇప్పుడు అతడి గురించి చర్చించుకునేవారు లేరు. అతడి క్రీడా ప్రతిభ గురించి మాట్లాడుకునే వారు లేరు. ఇప్పుడు జనం దృష్టిలో సుశీల్‌ కుమార్‌ అంటే ఓ హత్య కేసులో నిందితుడు. అంతే!

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒలింపిక్స్‌లో వ్యక్తిగతంగా వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడెవరైనా ఉన్నారంటే అది సుశీల్‌ కుమారే. 2008లో బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం పతకాన్ని ఒడిసిపట్టిన సుశీల్‌.. తర్వాత జరిగిన లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతడిని నుంచి ఎందరో స్ఫూర్తి పొందారు. కొందరు రెజ్లర్లుగా మారారు. అంతలా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న అతడిని గురువుగా భావించి రెజ్లర్‌గా మారిన వ్యక్తినే హత్య చేసిన నేరంలో ఇప్పుడు సుశీల్‌ కుమార్‌ నిందితుడిగా ఉన్నారు. అలాగని సుశీల్‌ను ఏమాత్రం తక్కువ చేయడానికి లేదు. అతడు కూడా సాధారణ కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలకోర్చి రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. ఒలింపిక్స్‌లో భారత కీర్తిపతాకను ఎగరేశాడు. కానీ 2012 ఒలింపిక్స్‌ తర్వాత స్వీయ తప్పిదాలే నేడు సుశీల్‌ను ఈ పరిస్థితుల్లోకి నెట్టాయి. చెడు సావాసాలు, ఈర్ష్య అతడిని అధఃపాతాళానికి తొక్కేశాయి.

ఇక రెండేసి పతకాలు సాధించిన సింధు బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం ఎదురులేని క్రీడాకారిణి. మనదేశంలో క్రికెట్‌ ఆటగాళ్లకు ఉన్నంత క్రేజ్‌ ఆమెది. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌, ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడలు.. ఇలా టోర్నీ ఏదైనా ఆమె సాధించని పతకాలు లేవు. అయినా ఆమె ఇప్పటికీ నిత్య విద్యార్థే. 2004 నుంచి బ్యాడ్మింటన్‌లో కఠోరంగా శ్రమిస్తున్న సింధు.. విశ్రాంతి అన్నదే ఎరుగదు. ఆమెను అలసిపోవడం చూళ్లేదని ఆమెకు శిక్షణ ఇచ్చే వారు చెప్పే మాట. రియోలో రజతం సాధించాక సింధుకు ఎంతటి అపూర్వ ఆదరణ దక్కిందో తెలిసిందే. అది చూసి సింధు సంబరపడిపోయి అక్కడే ఆగిపోయి ఉంటే.. గత అయిదేళ్లలో సాధించిన అద్భుత విజయాలేవీ ఉండేవి కావు. ఒలింపిక్స్‌ పతకంతో సంతృప్తి చెందకుండా ప్రపంచ ఛాంపియన్‌ కావాలన్న లక్ష్యం పెట్టుకుంది. ఆ దిశగా అసామాన్య రీతిలో కష్టపడింది. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారైంది. ఆటను మరింతగా మెరుగు పరుచుకుంది. 2019లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఆరేళ్ల ముందు వరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యానికే అబ్బురపడుతున్న వాళ్లకు పసిడి రుచి చూపించింది. గత ఏడాదిన్నరలో కరోనా కారణంగా టోర్నీలు లేకున్నా, ప్రాక్టీస్‌ కష్టమైనా.. దాన్ని సాకుగా చూపించకుండా తన శక్తిమేర శ్రమించింది. విజయ గర్వం గానీ, నిర్లక్ష్యం గానీ ఆమె డిక్షనరీలో కనిపించవు. అందుకే సింధు గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ‘మా సింధు బంగారం’ అని కీర్తిస్తోంది. 

ద్దరు క్రీడాకారులు.. దేశం కోసం కష్టించారు.. పతకం కోసం శ్రమించారు.. దేశం పేరును నిలబెట్టారు. కానీ ఒకరి తప్పిదం తన క్రీడా జీవితాన్ని నాశనం చేస్తే.. ఒకరి పట్టుదల మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. విచిత్రం ఏంటంటే.. టోక్యో ఒలింపిక్స్‌లో సింధు పతకం ముద్దాడిన మరుసటి రోజే.. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్‌కుమార్‌.. ఆ కేసులో ప్రధాన నిందితుడుగా ఛార్జీషీటులోకెక్కడం!!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు