Gifts E-auction: నీరజ్‌ ఈటెకు రూ.1.5 కోట్లు.. సింధు రాకెట్‌కు రూ.80 లక్షలు

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఉపయోగించిన ఈటెకు ఈ-వేలంలో భారీ ధర లభించింది. ప్రధానమంత్రికి

Updated : 08 Dec 2021 17:05 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఉపయోగించిన ఈటెకు ఈ-వేలంలో భారీ ధర లభించింది. ప్రధానమంత్రికి వచ్చిన బహుమతుల ఈ-వేలంలో భాగంగా నీరజ్‌కు, దేశానికి పసిడి పతకాన్ని అందించిన ఆ ఈటెను వేలానికి పెట్టగా.. రూ.కోటిన్నర ధర పలికింది. ఇక రెండు ఒలింపిక్స్‌ పతకాలు సాధించిన భారత తొలి మహిళగా నిలిచిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు రాకెట్‌కు రూ.80,00,100 ధర లభించింది.

టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో భారత్‌ తరపున అద్భుత ప్రదర్శన చేసిన అథ్లెట్లు ప్రధాని మోదీకి బహూకరించిన క్రీడా పరికరాలతో పాటు ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన జ్ఞాపికలను ఆన్‌లైన్‌ వేదికగా వేలం వేసిన విషయం తెలిసిందే. కేంద్ర సాంస్కృతిక శాఖ pmmementos.gov.inలో ఈ వేలాన్ని నిర్వహించింది. మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబరు 17న మొదలైన ఈ-వేలం అక్టోబరు 7 గురువారంతో ముగిసింది. ఈ వేలంలో నీరజ్‌ ఈటె.. రూ.1.5కోట్లకు అమ్ముడైంది. ఈ-వేలంలో అత్యధిక ధర పలికిన వస్తువు ఇదే కావడం విశేషం. అయితే దీన్ని ఎవరు కొనుగోలు చేశారన్నది సాంస్కృతిక శాఖ బయట పెట్టలేదు. వేలం ఆరంభమైన రోజే ఈ ఈటెకు రూ.10 కోట్ల ధర పలికినప్పటికీ ఆ బిడ్‌ నకిలీదనే అనుమానంతో తొలగించారు. 

భవానీదేవి కత్తికి రూ.1.25కోట్లు..

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఫెన్సింగ్‌లో పోటీ పడ్డ మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన ఫెన్సర్‌ భవానీదేవి కత్తికి ఈ-వేలంలో రూ.1.25కోట్ల ధర లభించింది. పారాలింపిక్స్‌లో పసిడి సాధించిన సుమిత్‌ బళ్లెం రూ. రూ.కోటి 25వేలు పలికింది. పారాలింపిక్స్‌ విజేతలు సంతకాలు చేసి ప్రధానికి బహూకరించిన కండువాకు రూ.కోటి ధర లభించింది. టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ సంచలనం లవ్లీనా బోర్గొహేన్‌ చేతి గ్లౌజులు రూ.91లక్షల ధర పలికాయి.

ఆటగాళ్ల క్రీడా పరికరాలతో పాటు మోదీకి పలు సందర్భాల్లో వచ్చిన జ్ఞాపికలు, బహుమతులను కూడా వేలం వేశారు. మొత్తం 1348 వస్తువులకు ఈ-వేలానికి ఉంచగా.. వీటికి 8600 బిడ్లు వచ్చాయి. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని