Messi: ‘నా జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం’.. కన్నీటి పర్యంతమైన మెస్సీ 

ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనెల్‌ మెస్సీ భావోద్వేగానికి గురయ్యాడు. సుదీర్ఘకాలం పాటు బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌తో అనుబంధాన్ని వీడే క్రమంలో కన్నీటి పర్యంతమయ్యాడు.

Updated : 08 Aug 2021 21:42 IST

మాడ్రిడ్‌: ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనెల్‌ మెస్సీ భావోద్వేగానికి గురయ్యాడు. సుదీర్ఘకాలం పాటు బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌తో అనుబంధాన్ని వీడే క్రమంలో కన్నీటి పర్యంతమయ్యాడు. మెస్సీకి వీడ్కోలు పలికేందుకు ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తాను కంటతడి పెట్టడమే కాకుండా చూస్తున్న వారినీ కన్నీళ్లు పెట్టించాడు. తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజుగా అభివర్ణించాడు.

‘‘నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. అత్యంత బాధాకరమైన క్షణమిది. కష్టంగా ఉంది. నా జీవితం మొత్తం క్లబ్‌ కోసం కష్టపడ్డాను. ఇప్పుడు చివరి అంకానికి చేరుకున్నా. ఇలా వీడ్కోలు పలుకుతానని ఎప్పుడూ ఊహించలేదు’’ అంటూ మెస్సీ భావోద్వేగానికి గురయ్యాడు. తనకు వివిధ క్లబ్బుల నుంచి ఆఫర్లు వచ్చాయని చెబుతూనే.. భవిష్యత్‌ గురించి చెప్పేందుకు నిరాకరించాడు. మెస్సీతో తమ కాంట్రాక్టును పునరుద్ధరించలేమని బార్సిలోనా గురువారం ప్రకటించింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన నేపథ్యంలో మెస్సీ క్లబ్‌ను వీడాడు.

అర్జెంటీనాకు చెందిన మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం. తన 17 ఏళ్ల వయసులో 2004 క్లబ్‌లోకి వచ్చిన అతడు మొత్తం 17 సీజన్లు ఆడాడు. వివిధ లీగుల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్లబ్ తరఫున 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్‌ సాధించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని