అక్షర్‌ ‘6’ విన్యాసం.. ఇంగ్లాండ్‌ విలవిల

టీమ్‌ఇండియా అదరగొట్టింది. మొతెరాను మోతెక్కించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌  మైదానంలో జరుగుతున్న తొలి డే/నైట్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ను విలవిల్లాడించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టును 112 పరుగులకే ఆలౌట్‌ చేసింది. యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ ఆరు వికెట్లతో ఆంగ్లేయులను వణికించాడు....

Updated : 24 Feb 2021 19:14 IST

తొలి ఇన్నింగ్స్‌లో రూట్‌సేన 112 ఆలౌట్‌

మొతెరాలో టీమ్‌ఇండియా దుమ్మురేపింది. మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్‌ను ఓ ఆటాడుకుంది. ‘గులాబి చెర్రీ’ని గింగిరాలు తిప్పుతూ అక్షర్‌ పటేల్‌ మరోసారి ‘5+’ వికెట్ల విన్యాసం ప్రదర్శించాడు. అతడికి అశ్విన్‌ (3 వికెట్లు) తోడవ్వడంతో ఇంగ్లిష్‌ జట్టు డే/నైట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 112కు ఆలౌటైంది. ఇంగ్లాండ్‌ జట్టులో జాక్‌ క్రాలీ (53; 84 బంతుల్లో 10×4) టాప్‌ స్కోరర్‌.

లంబూతో ఆరంభం

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. కఠిన ప్రత్యర్థితో గులాబి పోరు. తన కెరీర్లో వందో టెస్టు. ఇంకేముంది ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ను మరింత వేడుకగా మార్చుకున్నాడు సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ. జట్టు స్కోరు రెండు పరుగుల వద్దే ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ డామ్‌ సిబ్లి (0)ని పెవిలియన్‌ పంపించి టీమ్‌ఇండియాకు శుభారంభం అందించాడు. వేగంగా ఆడుతున్న మరో ఓపెనర్‌ జాక్‌ క్రాలీ (53; 84 బంతుల్లో 10×4)కు అండగా నిలిచిన జానీ బెయిర్‌స్టోను అక్షర్‌ పటేల్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకొని రెండో వికెట్‌ పడగొట్టాడు. అయితే కెప్టెన్‌ జో రూట్‌ (17; 37 బంతుల్లో)తో కలిసి క్రాలీ మూడో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

అక్షర్‌ 6, అశ్విన్‌ 3

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు నిలదొక్కుకుంటున్న సమయంలో అశ్విన్‌ తెలివైన ఎత్తుగడతో జోరూట్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఫుల్లర్‌ లెంగ్త్‌ బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్నాడు. రూట్‌ సమీక్ష కోరినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడు స్కోరు 74/3. మరికాసేపటికే అర్ధశతక వీరుడు జాక్‌ క్రాలీని అక్షర్‌ పటేల్‌ బోల్తా కొట్టించడంతో ఇంగ్లాండ్‌ 81/4తో భోజన విరామానికి వెళ్లింది. ఆ తర్వాత అక్షర్‌ అద్భుతం చేశాడు. సొంతమైదానంలో ఆడుతున్న అతడు తన అనుభవాన్ని ఉపయోగించుకున్నాడు. భిన్నమైన కోణాల్లో బంతులు విసురుతూ ఇంగ్లాండ్‌ ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీశాడు. బెన్‌స్టోక్స్‌ (6), బెన్‌ఫోక్స్‌ (12), జోఫ్రా ఆర్చర్‌ (11), స్టువర్ట్‌ బ్రాడ్‌ (3)ను పెవిలియన్‌కు పంపించి వరుసగా రెండో టెస్టులో ‘5+’ వికెట్ల ఘనత అందుకున్నాడు. అతడి ధాటికి ఆంగ్లేయులు వందలోపే చాపచుట్టేస్తారనిపించింది. మరోవైపు ఒలీ పోప్‌ (1), జాక్‌లీచ్‌ (3)ను యాష్‌ ఔట్‌ చేశాడు. తొలిరోజే తమకు అనుకూలించిన పిచ్‌ను ఉపయోగించుకొన్న స్పిన్నర్లు 9 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను 112కు పరిమితం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని