T20 World Cup 2021: ఆఖర్లో రాణించిన ఆసీస్.. ఇంగ్లాండ్ లక్ష్యం 126

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచులో ఇంగ్లాండ్‌ బౌలర్లు విజృంభించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ ముందు 126 పరుగుల లక్ష్యాన్ని

Published : 30 Oct 2021 21:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచులో ఇంగ్లాండ్‌ బౌలర్లు విజృంభించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ ముందు 126 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ (44) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్ మూడు‌, టైమల్‌ మిల్స్, క్రిస్ వోక్స్‌ రెండేసి, అదిల్‌ రషీద్, లివింగ్‌స్టోన్ తలో వికెట్‌ తీశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా జట్టుకి ఆరంభలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ (1), స్టీవ్ స్మిత్‌ (1), గ్లెన్‌ మాక్స్‌ వెల్‌ (6), మార్కస్‌ స్టొయినిస్ (0) వరుసగా పెవిలియన్‌ చేరారు. రెండో ఓవర్లో వార్నర్‌ ఔట్ కాగా.. మూడో ఓవర్‌ తొలి బంతికే స్టీవ్‌ స్మిత్‌ పెవిలియన్ చేరాడు. క్రిస్ వోక్స్‌ వేసిన నాలుగో ఓవర్లో మాక్స్ వెల్ ఎల్బీగా వెనుదిరిగాడు. అదిల్‌ రషీద్‌ వేసిన ఏడో ఓవర్లో మార్కస్‌ స్టొయినిస్ కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి మాథ్యూ వేడ్‌ (18)తో కలిసి.. ఆరోన్‌ ఫించ్‌ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. పది ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా 41/4 స్కోరుతో నిలిచింది. ఈ క్రమంలోనే లివింగ్‌స్టోన్‌ వేసిన 12వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మాథ్యూ వేడ్.. జేసన్‌ రాయ్‌కి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ వచ్చిన ఆష్టన్ అగర్ (20)తో కలిసి ఫించ్ ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించాడు. ఈ జోడీ 17వ ఓవర్లో 20 పరుగులు రాబట్టింది. టైమల్ మిల్స్‌ వేసిన 18వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అగర్‌.. లివింగ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చాడు. క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో ఆరోన్‌ ఫించ్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌ (12)ని పెవిలియన్‌ చేర్చాడు. ఆడమ్‌ జంపా (1), మిచెల్ స్టార్క్ (13) పరుగులు చేశారు. ఆసీస్‌ ఆఖరి నాలుగు ఓవర్లలో 50 పరుగులు రాబట్టింది. దీంతో ఇంగ్లాండ్ ముందు మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని