WTC Final: ఇషాంత్‌ ఇంకా కొత్త కుర్రాడిలాగే..!

సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఇప్పటికీ కొత్త కుర్రాడిలాగే కనిపిస్తున్నాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ బల్విందర్‌ సింగ్‌ అన్నారు. అతడి బౌలింగ్‌ను పరిశీలిస్తే వంద టెస్టులు ఆడిన అనుభవం కనిపించడం లేదని విమర్శించారు....

Published : 01 Jul 2021 01:25 IST

100 టెస్టుల అనుభవం కనిపించడం లేదన్న మాజీ క్రికెటర్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఇప్పటికీ కొత్త కుర్రాడిలాగే కనిపిస్తున్నాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ బల్విందర్‌ సింగ్‌ అన్నారు. అతడి బౌలింగ్‌ను పరిశీలిస్తే వంద టెస్టులు ఆడిన అనుభవం కనిపించడం లేదని విమర్శించారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత పేసర్ల బౌలింగ్‌ స్థాయికి తగినట్టు లేదన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.

‘ఆదివారం టీమ్‌ఇండియా పేసర్లు తక్కువ లెంగ్తుల్లో బంతులు విసిరారు. మంగళవారం మాత్రం సరైన లెంగ్తుల్లో కాకుండా ముందుకు వేశారు. బ్యాట్స్‌మెన్‌ ఫ్రంట్‌ఫుట్‌తో ఆడేలా చేయడం బౌలర్ల బాధ్యత. అయితే వారు అలసిపోయినట్టు అనిపించింది. ఏదేమైనా బ్యాట్స్‌మెన్‌ ముందుకొచ్చి డ్రైవ్‌ చేసేలా బంతులు వేస్తేనే వికెట్లు దక్కుతాయి. వంద టెస్టులు తర్వాతా ఇషాంత్‌ కొత్తవాడిలాగే కనిపించాడు. బౌలింగ్‌ దాడిని అతడు ముందుండి నడిపించాలి. కానీ షమి ఆ పాత్ర పోషిస్తున్నాడు. బుమ్రా సైతం బంతిని సీమ్‌ చేయకుండా నిరాశ పరిచాడు’ అని బల్విందర్‌ అన్నారు.

మాజీ క్రికెటర్‌ రోజర్‌ బిన్నీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. టీమ్‌ఇండియా సరైన బౌలింగ్‌ లైనప్‌ను ఎంచుకోలేదని తెలిపారు. ‘బంతిని సీమ్‌తో పాటు స్వింగ్‌ చేసే బౌలర్‌ అవసరం. న్యూజిలాండ్‌ అదే చేసింది. వారేమీ వేగంగా వేయరు. వారు కచ్చితత్వంతో సరైన లైన్‌ అండ్‌ లెంగ్తుల్లో బంతులు వేశారు. 90 లేదా 100 కి.మీ వేగంతో బంతులు విసిరి బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయలేం. సీమ్‌తో పాటు స్వింగ్‌ ఉంటేనే అది సాధ్యం’ అని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు