ARG vs BRZ: బ్రెజిల్‌ను ఢీకొట్టాలి.. అర్జెంటీనా వరల్డ్‌కప్‌ అర్హత సాధించాలి

 అర్జెంటీనా ఫుట్‌బాల్‌ క్రీడాభిమానులకు శుభవార్త. ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా...

Published : 16 Nov 2021 21:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ క్రీడాభిమానులకు శుభవార్త. ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా బుధవారం (ఉదయం 5 గంటలకు) బ్రెజిల్‌తో తలపడే మ్యాచ్‌కు కెప్టెన్‌ మెస్సి అందుబాటులోకి రానున్నాడు.ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ కీలక ఆటగాడు నెయ్‌మర్ దూరమయ్యే అవకాశం ఉందని ఆ జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఇది ఒకరకంగా దెబ్బ అయినప్పటికీ.. ఇప్పటికే దక్షిణ అమెరికా-10 గ్రూప్‌ నుంచి బ్రెజిల్‌ వరల్డ్‌కప్‌-2022కి అర్హత సాధించింది. రెండో స్థానంలో ఉన్న అర్జెంటీనాకు ఇది ఎంతో కీలకమైన మ్యాచ్‌. ఈ గ్రూప్‌ నుంచి టాప్‌-4 జట్లు ఖతార్‌ వేదికగా జరిగే వరల్డ్‌ కప్‌కు క్వాలిఫై కావొచ్చు. మోకాలు నొప్పితో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన మెస్సి కీలకమైన బ్రెజిల్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం అర్జెంటీనాకు సానుకూలాంశమే .. బ్రెజిల్‌కు మాత్రం నెయ్‌మర్‌ లేకపోవడం లోటేనని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత 26 మ్యాచుల్లో అపజయం లేకుండా దూసుకెళ్తున్న అర్జెంటీనా.. గత జులైలో కోపా అమెరికా ఫైనల్‌లోనూ బ్రెజిల్‌ను మట్టికరిపించింది. ఈ క్రమంలో మరోసారి బ్రెజిల్‌ను ఓడించి ఫిఫా వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించాలని అర్జెంటీనా ఆశిస్తోంది. 

అర్హత సాధించిన ఇంగ్లాండ్

మరోవైపు క్వాలిఫయర్‌ మ్యాచులో 10-0తేడాతో శాన్‌ మారినోపై ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది.  దీంతో యూరోపియన్‌ క్వాలిఫయింగ్ గ్రూప్-ఐ నుంచి ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ గ్రూప్‌లో ఇప్పటికే టాప్‌ స్థానం ఆక్రమించిన ఇంగ్లాండ్‌ తన చివరి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా అర్హత సాధించేది. ఈ క్రమంలో శాన్‌ మారినోపై ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లిష్‌ జట్టు 10-0తో చిత్తు చేసింది. హ్యారీ కేన్‌ (27వ నిమిషం, 31వ నిమిషం, 39వ నిమిషం, 42వ నిమిషం) నాలుగు గోల్స్‌తో ఇంగ్లాండ్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు. హ్యారీ మాగైర్‌, ఫాబ్రి, స్మిత్, మింగ్స్‌, టామీ, సాకా తలో గోల్స్‌ చేశారు. 

ఆరు కాన్ఫెడరేషన్స్‌ నుంచి దాదాపు 211 దేశాలు ఫిఫా మెంబర్‌ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నాయి. క్వాలిఫయింగ్‌ ప్రాసెస్‌ ద్వారా అర్హత సాధించిన 32 జట్లు వరల్డ్‌ కప్‌ కోసం బరిలోకి దిగుతాయి. ఖతార్‌ వేదికగా వరల్డ్‌కప్‌ జరుగుతుంది కాబట్టి.. అతిథ్య జట్టుకు డైరెక్ట్‌ ఎంట్రీ ఉంటుంది. ఇక పోతే మరో 31 జట్లు అర్హత పోటీల్లో పాల్గొని మరీ చోటు సంపాదించుకోవాల్సి ఉంటుంది. క్వాలికేషన్స్‌ మ్యాచ్‌లు 2019 జూన్‌ 6 నుంచి ప్రారంభమై 2022 జూన్‌ ఆఖరున ముగుస్తాయి. ఈలోపు అర్హత సాధించిన జట్లు ఖతార్‌ వేదికగా 2022 నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 18 వరకు జరిగే వరల్డ్‌కప్‌ పోటీల్లో పాల్గొంటాయి.

ఇప్పటి వరకు వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించిన జట్టు ఇవే..

* ఖతార్‌: అతిథ్య దేశం
* జర్మనీ,  డెన్మార్క్, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, క్రొయేషియా, స్పెయిన్‌, సెర్బియా, ఇంగ్లాండ్‌, స్విట్జర్లాండ్‌

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని