IND vs NZ: ముగిసిన తొలి రోజు ఆట.. మూడు అర్ధశతకాలు నమోదు

భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మొదటి రోజు ఆట.. 

Updated : 25 Nov 2021 22:15 IST

మొదటి రోజు ఆధిపత్యం సాధించిన టీమ్‌ఇండియా

కాన్పూర్‌: సీమ్‌ బౌలింగ్‌కు అదరలేదు.. స్పిన్‌కు బెదరలేదు.. అనుభవం లేదని తలవంచనూలేదు.. ధనాధన్‌ బాదడమే కాదు.. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ సత్తాచాటుతామని నిరూపించారు మన భారత యువ క్రికెటర్లు.. కివీస్‌తో తొలి టెస్టు మొదటి రోజు ఆటలో ముగ్గురు అర్ధశతకాలు బాదేశారు. అదీ సమయోచితంగా నిలకడగా ఆడుతూనే సాధించారు. జట్టు కష్టాల్లో పడకుండా రక్షించారు.

సీనియర్‌ ప్లేయర్లు పుజారా, రహానెలను త్వరగానే ఔట్‌ చేసిన ఆనందం కివీస్‌కు దక్కకుండా చేసింది శుభ్‌మన్‌ (52), శ్రేయస్‌ అయ్యర్‌ (75*), రవీంద్ర జడేజా (50*).. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గురించే. అంతర్జాతీయంగా జడేజాకు ఎలానూ  అనుభవం ఉంది కాబట్టి నిలుదొక్కుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే ఎంతో ఓపిగ్గా, అనుభవశీలిగా ఆడిన శ్రేయస్‌ను ఎంత పొగిడినా తక్కువే. అర్ధశతకం సాధించి నాటౌట్‌గా నిలిచిన శ్రేయస్‌ ఈ మ్యాచ్‌లోనే శతకం చేస్తే అది జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయిద్ది. అలా అని ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్, మిడిలార్డర్‌లో జడేజా ఇన్నింగ్స్‌లను తక్కువ అంచనా వేయలేం.. ముగ్గురి బ్యాటింగ్‌తోనే భారత్‌ ప్రస్తుతానికి మంచి స్థితిలో నిలిచింది. 

భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మొదటి రోజు ఆట మరో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే ముగిసింది. టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా సారథి అజింక్య రహానె బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ముగ్గురు బ్యాటర్లు అర్ధశతకాలు నమోదు చేయడంతో తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్‌ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అరంగేట్ర బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (75నాటౌట్‌: 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్ (52: 5 ఫోర్లు, ఒక సిక్స్‌), రవీంద్ర జడేజా (50 నాటౌట్‌: 6 ఫోర్లు) రాణించారు. మిగతా బ్యాటర్లలో మయాంక్‌ అగర్వాల్‌ 13, ఛెతేశ్వర్‌ పుజారా 26, అజింక్య రహానె 35 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో జేమీసన్ 3, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు. 

ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం

లంచ్‌ సమయానికి 82/1తో పటిష్ఠంగా ఉన్న టీమ్‌ఇండియాను జేమీసన్‌ దెబ్బకొట్టాడు. మంచి ఫామ్‌లో ఉండి అర్ధశతకం సాధించిన గిల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే పుజారా కివీస్‌ బౌలర్‌ సౌథీ బౌలింగ్‌లో టామ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్‌తో కలిసి భారత సారథి అజింక్య రహానె కాస్త నిలదొక్కుకున్నట్లు కనిపించాడు. అయితే జేమీసన్‌ బౌలింగ్‌లో రహానె బోల్తాపడ్డాడు. క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. మరో వికెట్‌ కానీ పడితే టీమ్‌ఇండియా కష్టాల్లో పడేదే. అయితే శ్రేయస్‌-రవీంద్ర జడేజా శతక (113) భాగస్వామ్యం నిర్మించి రక్షించారు. ఆట చివర వరకు మరో వికెట్‌ పడనీయకుండా కాచుకున్నారు. దీంతో రెండో సెషన్‌లో పైచేయి సాధించిన కివీస్‌ బౌలర్లను మూడో సెషన్‌లో చిత్తు చేశారు. ఇదే క్రమంలో వీరిద్దరూ అర్ధశతకాలను నమోదు చేసుకున్నారు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని