IND vs NZ: అక్షర్‌ ఐదు వికెట్ల ప్రదర్శన.. భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం

భారీ స్కోరు సాధిస్తుందేమోనని భావించిన కివీస్‌ను కట్టడి చేయడంలో టీమ్‌ఇండియా బౌలర్లు తీవ్రంగా కష్టపడ్డారు. పిచ్‌ నుంచి సరైన...

Published : 27 Nov 2021 16:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ స్కోరు సాధిస్తుందేమోనని భావించిన కివీస్‌ను కట్టడి చేయడంలో టీమ్‌ఇండియా బౌలర్లు విజయవంతమయ్యారు. పిచ్‌ నుంచి సరైన సహకారం లభించకపోయినా స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీంతో భారత్‌కు స్వల్ప ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించారు. రెండో రోజు కాస్త వెనుకడుగు వేసినట్లు అనిపించిన టెస్టులో మళ్లీ టీమ్‌ఇండియా పట్టు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు రాణించి కివీస్‌కు మంచి లక్ష్యాన్ని నిర్దేశించగలిగితే విజయం కోసం ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉంటాయి. 

రెండో రోజు భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన కివీస్‌ బ్యాటర్లు మూడో రోజు తలొగ్గారు. యువ స్పిన్పర్‌ అక్షర్‌ పటేల్ (5/62), అశ్విన్‌ (3/82) దెబ్బకు న్యూజిలాండ్‌ కుదేలైంది. అక్షర్‌ పడగొట్టిన ఐదు వికెట్లలో రెండు బౌల్డ్‌లు, రెండు స్టంపౌట్‌లు, ఒక ఎల్బీడబ్ల్యూ ఉండటం విశేషం. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 49 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఓపెనర్లు టామ్‌ లేథమ్‌ (95), విల్ యంగ్‌ (89) శతకం చేసే అవకాశాలను చేజార్చుకున్నారు. ఆఖర్లో జేమీసన్‌ (75 బంతుల్లో 23) భారత బౌలర్లకు కాసేపు విసుగు తెప్పించినా కివీస్‌కు మాత్రం ఆధిక్యం దక్కేలా చేయలేకపోయాడు. వీరు ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కేన్‌ విలియమ్సన్ 18, రాస్ టేలర్ 11, నికోల్స్‌ 2, టామ్‌ బ్లండెల్‌ 13, రచిన్ రవీంద్ర 13, సౌథీ 5, సోమర్‌విల్లే 6, అజాజ్‌ పటేల్‌ 5* పరుగులు చేశారు. భారత బౌలర్లలో అక్షర్ 5, అశ్విన్‌ 3.. జడేజా, ఉమేశ్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని