IND vs NZ: లేథమ్‌ సెంచరీ మిస్‌.. కివీస్‌ నడ్డివిరిచిన అక్షర్‌ పటేల్‌

 భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్ టామ్‌ లేథమ్‌...

Published : 27 Nov 2021 14:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్ టామ్‌ లేథమ్‌ (282 బంతుల్లో 95‌: 10X4) తృటిలో శతకం  చేజార్చుకున్నాడు. కివీస్‌ నడ్డి విరిచిన అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో స్టంప్‌ ఔటయ్యాడు.  మూడో రోజు రెండో సెషన్‌ ముగిసేసరికి కివీస్‌ ఆరు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో టామ్‌ బ్లండెల్‌ (10*), జేమీసన్‌ (2*) ఉన్నారు. అంతకుముందు 129/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్‌ దూకుడుకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేశారు. మరో ఇరవై రెండు పరుగులు జోడించాక విల్‌ యంగ్ (89) వికెట్‌ను చేజార్చుకుంది. అశ్విన్‌ బౌలింగ్‌లో కీపర్‌ శ్రీకర్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి యంగ్‌ పెవిలియన్‌కు చేరాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ విలియమ్సన్‌ (18)ను ఉమేశ్‌ యాదవ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్వల్ప వ్యవధిలో రాస్ టేలర్‌ (11), హెన్రీ నికోల్స్‌ (2) ను అక్షర్‌ ఔట్‌ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా లేథమ్‌ మాత్రం పట్టువిడవకుండా బ్యాటింగ్‌ చేశాడు. అయితే అక్షర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు వచ్చి స్టంప్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన రచిన్‌ రవీంద్ర (13)ను రవీంద్ర జడేజా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 345 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో టీమ్ఇండియా కంటే కివీస్‌ ఇంకా 96 పరుగులు వెనుకబడి ఉంది. భారత్‌ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 3.. ఉమేశ్‌ యాదవ్‌, అశ్విన్‌, జడేజా తలో వికెట్‌ తీశారు.

మూడు సార్లు డీఆర్‌ఎస్‌.. ఒకసారి మనోళ్లు రక్షించారు 

నిన్న (రెండో రోజు) మూడు సార్లు డీఆర్‌ఎస్‌ను ఉపయోగించుకుని మరీ బతికిపోయిన లేథమ్‌ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో ఔటైపోయాడు. ఇవాళ ఉదయం కూడా అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఎల్బీడబ్ల్యూ కోసం అశ్విన్‌ అప్పీల్‌ చేసినా అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. డీఆర్‌ఎస్‌ తీసుకునేందుకు భారత్‌ సారథి అజింక్య రహానె ఆసక్తి చూపలేదు. అయితే ట్రాక్‌ చెకింగ్‌లో మాత్రం ఔట్‌గా తేలింది. దీంతో అశ్విన్‌ కాస్త అసహనానికి గురయ్యాడు. డీఆర్‌ఎస్‌తో లేథమ్‌కు మూడు సార్లు అదృష్టం కలిసొచ్చిన అంశంపై కివీస్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ ట్విటర్‌ వేదికగా సరదాగా స్పందించాడు. ‘‘ఒక వేళ లేథమ్‌ సెంచరీ సాధిస్తే టీమ్‌ఇండియా డీఆర్‌ఎస్‌ విధానాన్ని రద్దు చేయమంటుందేమో’’ అని ట్వీట్‌ చేశాడు. మరి లేథమ్‌ శతకం చేయలేదు కాబట్టి టీమ్‌ఇండియా డీఆర్‌ఎస్‌ను రద్దు చేయమని అడిగే అవకాశం ఉండదుగా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు