
T20 world Cup: టీమిండియా నిష్క్రమణపై.. మాజీలు ఏమన్నారంటే.?
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో.. కివీస్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా సెమీస్ అవకాశాలకు తెరపడింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ జట్టు స్వల్ప తేడాతో న్యూజిలాండ్‌ని ఓడించి ఉంటే.. టీమిండియాకు సెమీ ఫైనల్ చేరే అవకాశం ఉండేది. ఎలాగంటే, సోమవారం నమీబియాతో జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి.. భారత అభిమానులు కూడా అఫ్గాన్ జట్టుకే మద్దతు తెలిపారు. అయితే, కివీస్ జట్టు భారతీయుల ఆశల్ని తుడిచిపెట్టేస్తూ.. అఫ్గాన్‌పై విజయం సాధించి సెమీఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. దీంతో టీమిండియా సెమీస్ చేరే అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ నుంచి సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా ప్రదర్శనపై పలువురు మాజీ క్రికెటర్లు స్పందించారు. కోచ్‌గా రవిశాస్త్రికి, కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి నమీబియాతో జరుగనున్న మ్యాచే చివరిది కానుండటం గమనార్హం.
‘ఖతమ్.. బై బై.. టాటా గుడ్ బై’- మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్
‘సెమీస్ చేరిన న్యూజిలాండ్ జట్టుకు శుభాకాంక్షలు. కేన్ విలియమ్సన్ సారథ్యంలో ఎంతో మెరుగ్గా రాణించిన మీరంతా అందుకు అర్హులు. ఇక టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదని తెలుసు. అయినా, బాధపడాల్సిన అవసరం లేదు. మా జట్టు పుంజుకుని గొప్పగా రాణిస్తుందనే నమ్మకం ఉంది’- మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్
‘దాదాపు పది సంవత్సరాల తర్వాత టీమ్‌ఇండియా ఓ ఐసీసీ ఈవెంట్లో సెమీస్ చేరకుండా నిష్క్రమించడం ఇదే తొలిసారి. ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం బాధిస్తోంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న ప్రపంచకప్ టోర్నీలో ఈ పరాజయానికి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది’- మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్