గబ్బా కోటకు టీమ్‌ఇండియా బీటలు

సిడ్నీ టెస్టును డ్రా చేసేందుకు వీరోచితంగా పోరాడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఆస్ట్రేలియా సారథి టిమ్‌పైన్‌ కవ్వించిన తీరిది. నిజానికి అతడీ మాటలు ఊరికే అనలేదు. ఎందుకంటే 32 ఏళ్లుగా గబ్బాలో ఆ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. పిచ్‌ వింత స్వభావాన్ని ఆసరాగా చేసుకొని ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది....

Published : 20 Jan 2021 01:59 IST

ఆసీస్‌ అహం అణచిన రహానె సేన

‘యాష్‌.. నేను మిమ్మల్ని త్వరగా గబ్బా తీసుకెళ్లాలని అనుకుంటున్నా..!’

సిడ్నీ టెస్టును డ్రా చేసేందుకు వీరోచితంగా పోరాడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఆస్ట్రేలియా సారథి టిమ్‌పైన్‌ కవ్వించిన తీరిది. నిజానికి అతడీ మాటలు ఊరికే అనలేదు. ఎందుకంటే 32 ఏళ్లుగా గబ్బాలో ఆ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. పిచ్‌ వింత స్వభావాన్ని ఆసరాగా చేసుకొని ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. తమ కంచుకోటలో ఓటమెరుగమన్నది పైన్‌ గర్వం. గెలుపు ఖాయమనుకున్న అతడి అహంకారాన్ని టీమ్‌ఇండియా అణచివేసింది. పట్టుదల, కసి, అంకితభావం, దేశానికి ఆడుతున్నామన్న భావోద్వేగంతో రక్తం ఉరకలు వేస్తున్న యువభారత్‌ దుర్భేద్యమైన గబ్బా కోటగోడల్ని బద్దలుకొట్టింది. సరికొత్త చరిత్రను లిఖించింది. మరి ఈ గెలుపు ఊరికే రాలేదు.

ముందు ఆగమాగం 

ఆఖరి టెస్టుకు ముందు టీమ్‌ఇండియా పరిస్థితి బాధాకరం. చాలామంది సీనియర్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. నిఖార్సైన పేసర్లు లేనేలేరు. అసలు ఈ టెస్టుకు ఫిట్‌నెస్‌ ఉన్న 11 మంది ఆటగాళ్లు దొరుకుతారా? అనిపించింది. అనుభవం ఉన్న స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ లేడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించే పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా లేడు. బ్యాటు, బంతితో రాణించగల రవీంద్ర జడేజా లేడు. అసలు జట్టు కూర్పు కుదురుతుందా అన్న సందేహాలు కలిగాయి. ఒకవేళ కూర్పు కుదిరినా కుర్రాళ్లు రాణిస్తారా? స్మిత్‌, వార్నర్‌తో కూడిన టాప్‌ ఆర్డర్‌ను కూలుస్తారా? ఆసీస్‌ పేస్‌ త్రయాన్ని ఎదుర్కొని భారత బ్యాట్స్‌మెన్‌ గెలుపునకు అవసరమైన పరుగులు చేస్తారా? కనీసం డ్రా చేసుకోగలరా? వంటి అనుమానాలు వెంటాడాయి. కానీ.. రహానె సేన వీటన్నిటినీ పటాపంచలు చేసింది. 324 పరుగుల్ని ఒక్కరోజులో ఛేదించేసి చిరస్మరణీయ విజయం అందుకుంది. పోరాటతత్వంలో తమకు తిరుగులేదని చాటిచెప్పింది.


గిల్‌.. బలమైన పునాది

చివరిరోజు విజయం కోసం టీమ్‌ఇండియా 324 పరుగులు చేయాలి. ముందురోజు వర్షం కురిసింది కాబట్టి తొలి సెషన్‌ అత్యంత కీలకం. వింతగా ప్రవర్తిస్తున్న గబ్బా పిచ్‌పై ఛేదన జట్టుకు శుభారంభం ముఖ్యం. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 100% కన్నా ఎక్కువే న్యాయం చేశాడు. రోహిత్‌ శర్మ పెవిలియన్‌ చేరినా పట్టుదల ప్రదర్శించాడు. హేజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌, కమిన్స్‌, నేథన్‌ లైయన్‌ వంటి అనుభవజ్ఞులు విసిరే బంతుల్ని ఎదుర్కోవడం యువకులకు అంత సులభం కాదు. వారు వేస్తున్న షార్ట్‌పిచ్‌ బంతులు, స్వింగర్లను అతడు కాచుకున్నాడు. భోజన విరామానికి టీమ్‌ఇండియాను 83/1తో నిలిపాడు. చెతేశ్వర్‌ పుజారాతో కలిసి 114 పరుగుల సాధికారిక భాగస్వామ్యం నిర్మించాడు. 146 బంతుల్లోనే 8 బౌండరీలు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు. అటు బంతులు వృథా చేయకుండా.. ఇటు వికెట్‌ పోగొట్టుకోకుండా అతడు శతకానికి మించిన ఇన్నింగ్స్‌ ఆడేశాడు. విజయానికి అవసరమైన బలమైన పునాదిని నిర్మించాడు.


పంత్‌.. కోటగోడల నిర్మాణం

శుభ్‌మన్‌ వేసిన బలమైన పునాదిపై పుజారాతో కలిసి రిషభ్‌ పంత్‌ దుర్భేద్యమైన కోటగోడలు నిర్మించాడు. వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి టీ20 క్రికెట్‌ ఆడేశాడు.‌ తన కెరీర్‌లోనే అత్యంత విలువైన గెలుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 138 బంతుల్లో 9 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాదాపు మూడు గంటలు మైదానంలో ఉన్న పంత్‌ ఎంతో ప్రశాంతంగా, పట్టుదలగా పరుగులు చేశాడు. అస్సలు చెత్త షాట్లు ఆడలేదు. ఊరించే బంతుల్ని వదిలేశాడు. ఒకవైపు పుజారా బౌలర్లను అలసిపోయేలా చేస్తుంటే మరోవైపు పంత్‌ పరుగులు చేశాడు. వీరిద్దరూ నిర్మించిన 61 పరుగుల భాగస్వామ్యం జట్టుకెంతో మేలు చేసింది. అర్ధశతకం తర్వాత పుజారా ఔటైనా పంత్‌ తొణకలేదు. చివరి సెషన్లో డ్రింక్స్‌బ్రేక్‌కు భారత్‌ 259/4తో నిలిచింది. ఇక డ్రా సులువే అనిపించింది. అయితే వాషింగ్టన్ ‌సుందర్‌ (22; 29 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి పంత్‌ టీ20 మొదలు పెట్టాడు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ 55 బంతుల్లో 53 పరుగులు సాధించారు. పుజారా, సుందర్‌తో పంత్‌ భాగస్వామ్యాలు విచిత్రమైనవి. ఒకరితోనేమో సిసలైన టెస్టు, మరొకరితోనేమో టీ20 మజా ఆస్వాదించాడు. ఈ టెస్టులో రాణించకపోతే ఇక చోటు దక్కదన్న భయమూ అతడితో అద్భుతంగా ఆడించింది. గెలుపు ఇన్నింగ్స్‌ సాధింపజేసింది.


కుర్రాళ్లు  కసి..కసిగా

ఈ టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించింది కుర్రాళ్లే. గతంలో టెస్టు అనుభవం లేని యువకులు నేరుగా ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశారు. నిర్భయంగా ఆడారు. శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ గురించి ఎంతచెప్పినా తక్కువే. భారత్‌కు సుదీర్ఘ ఫార్మాట్లో ప్రాతినిధ్యం వహించి గొప్ప పేరు సాధించాలన్న తపనతో ప్రాణం పెట్టి ఆడారు. ఫలితం అందుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 1 వికెట్‌ తీసిన మహ్మద్‌ సిరాజ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. తండ్రికి ఘనంగా నివాళి అర్పించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులు చేసిన గిల్‌ రెండో ఇన్నింగ్స్‌ 91 పరుగులతో గెలుపునకు పునాది వేశాడు. నటరాజన్‌ తనదైన యార్కర్లు, చక్కని బంతులతో విరుచుకుపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు నియంత్రించాడు. వాషింగ్టన్‌ సుందర్‌ అత్యంత కీలకంగా మారాడు. 3 వికెట్లు తీయడమే కాకుండా 62, 22 పరుగులతో దుమ్మురేపాడు. శార్దూల్‌ ఠాకూర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. 67, 2 పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమ్‌ఇండియా రిజర్వుబెంచీపై కూర్చొంది మామూలు ఆటగాళ్లు కాదని వీరంతా నిరూపించారు.


బౌలింగ్‌.. భేష్‌

భారత బౌలింగ్‌ దాడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఈ టెస్టులో సీనియర్‌ బౌలర్లే లేరు. శార్దూల్‌ అరంగేట్రం టెస్టులో 10 బంతులేసి గాయపడ్డాడు. మళ్లీ ఇప్పుడొచ్చి అదరగొట్టాడు. వాషింగ్టన్‌ సుందర్‌ను టీ20 ఫార్మాట్‌ స్పిన్నర్‌గా భావించేవారు. నటరాజన్‌కు రెండు నెలల ముందు అంతర్జాతీయ అనుభవమే లేదు. మహ్మద్‌ సిరాజ్‌ ఆడుతున్నదీ మూడో టెస్టే. ఏకంగా ఈ మ్యాచులో బౌలింగ్‌ దాడికి నాయకత్వం వహించాడు. మిగతా ముగ్గురితో సమన్వయం చేసుకున్న తీరు అద్భుతం. సాధారణంగా కూకాబుర్ర బంతి పాతబడ్డాక బౌలింగ్‌ చేయడం కష్టం. ఆసీస్‌ పిచ్‌లపై బౌన్స్‌ రాబట్టాలంటే బంతిని బలంగా పిచింగ్‌ చేయాలి. అలా చేస్తే భుజాలు నొప్పులు పుడతాయి. విపరీతంగా అలసిపోతారు. నవదీప్‌ సైనికి మాత్రమే ఆ బలం ఉంది. అతడు గాయపడటంతో మిగతా ముగ్గురే తెలివిగా బంతులు వేసి ఆసీస్‌ను రెండుసార్లు ఆలౌట్‌ చేశారు. అదీ కంచుకోట గబ్బాలో 400 లోపే. వ్యూహాలను నిక్కచ్చిగా అమలు చేశారు.

ఈ మ్యాచులో ఆసీస్‌ గర్వం అణచాలనే పట్టుదలే కుర్రాళ్లలో కనిపించింది. వచ్చిన అవకాశాల్ని ఒడిసిపట్టాలన్న కసిని ప్రదర్శించారు.


ఆత్మవిశ్వాసమే ఆలంబనగా

టీమ్‌ఇండియా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం విజయంలో కీలక పాత్ర పోషించింది. కెప్టెన్‌ అజింక్య రహానె ప్రశాంతత, నాయకత్వం వారికి ప్రేరణగా నిలిచింది. అన్నింటికీ మించి ఆసీస్‌ గర్వం అణచాలనే పట్టుదలే కనిపించింది. సిడ్నీ టెస్టును ప్రేరణగా తీసుకొని ఆడారు. జట్టు యాజమాన్యం రిషభ్ పంత్‌ను చక్కగా వినియోగించుకుంది. అతడు చెత్త షాట్లు ఆడకుండా నియంత్రిత దూకుడుతో రాణించేలా కౌన్సిలింగ్‌ ఇచ్చింది. యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవాలన్న తపనతో ఆడారు. మళ్లీ తమకు అవకాశాలు దక్కాలన్న పట్టుదల ప్రదర్శించారు. ఇక రహానె జట్టును ముందుండి నడిపించాడు. మెల్‌బోర్న్‌ టెస్టు నుంచి వ్యూహాలను పక్కాగా అమలు చేశాడు. సమయోచితంగా ఫీల్డింగ్,‌ బౌలింగ్‌ మార్పులు చేశాడు. ఆటగాళ్లు తమను తాము వ్యక్తీకరించుకొనే స్వేచ్ఛను ఇచ్చాడు. దాని ఫలితమే 32 ఏళ్ల దుర్భేద్యమైన గబ్బా కోటగోడలు బద్దలవ్వడం.. స్మిత్‌, వార్నర్‌ ఉన్న ఆసీస్‌ను ఓడించి బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని కాపాడుకోవడం.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి
ఆసీస్‌ పొగరుకు, గర్వానికి ఓటమిది
ధోనీని అధిగమించి పంత్ కొత్త రికార్డు.. 
భారత్‌ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని