Updated : 02/04/2021 08:57 IST

ఆ సిక్సర్‌ ఆ కప్పు

ఈనాడు క్రీడావిభాగం

సరిగ్గా పదేళ్ల  క్రితం.. ఇదే రోజు మ్యాచ్‌ను ముగించేందుకు ధోని కొట్టిన ఓ బంతి అమాంతం స్టాండ్స్‌లో పడింది. అంతే స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు దేశంలోని కోట్లాది మంది ప్రజలు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఊరుఊరునా.. వాడవాడలా జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. ప్రతి భారతీయుడి మనసు సంతోషంలో మునిగితేలింది. మరి అప్పుడు జట్టు సాధించిన విజయం ఏమైనా సాధారణమైందా? కానే కాదు.. 28 ఏళ్ల ప్రపంచకప్‌ కలను నిజం చేసిన గెలుపది. రెండోసారి టీమ్‌ఇండియాకు వన్డే ప్రపంచకప్‌ను అందించిన విజయమది. స్వప్నం సాకారమైన ఆ క్షణానికి నేటితో పదేళ్లు! 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ జరిగి ఈ రోజుతో (ఏప్రిల్‌ 2) దశాబ్దం గడిచింది.
భారత జట్టు రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడి అప్పుడే దశాబ్దం గడిచిపోయిందా? శ్రీలంకతో ఆ ఫైనల్‌ మ్యాచ్‌ ఇప్పటికీ కళ్లు ముందు కదులుతోంది. ఛేదనలో ఆరంభంలో గంభీర్‌ (97) అద్భుత పోరాటం.. ఆఖర్లో ధోని (91 నాటౌట్‌) అద్వితీయమైన ప్రదర్శన.. మ్యాచ్‌ను ముగించిన ఆ సిక్సర్‌.. మైదానంలో మోకాళ్లపై కూర్చొని యువీ కన్నీళ్లు కార్చిన దృశ్యం! ‘‘ధోని ఫినిషెస్‌ ఆఫ్‌ ఇన్‌ స్టైల్‌. ఏ మేగ్నిఫిషెంట్‌ స్ట్రైక్‌ ఇన్‌టూ ది క్రౌడ్‌! ఇండియా లిఫ్ట్‌ ది వరల్డ్‌ కప్‌ ఆఫ్టర్‌ 28 ఇయర్స్‌ (ధోని తనదైన శైలిలో ముగించాడు. అద్భుతమైన షాట్‌తో బంతిని జనాల్లోకి పంపాడు. 28 ఏళ్ల తర్వాత భారత్‌ ప్రపంచకప్‌ అందుకుంది)’’ అని గంభీరమైన గొంతుతో వ్యాఖ్యాతగా రవిశాస్త్రి చెప్పిన మాటలు.. ఈ విజయంతో సచిన్‌ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన జట్టు ఆటగాళ్లు మ్యాచ్‌ ముగిశాక అతణ్ని భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిరగడం.. ఇలా ఇప్పటికీ ఆ సన్నివేశాలు తాజాగా కనిపిస్తున్నాయి. 1983లో కపిల్‌దేవ్‌ సారథ్యంలో తొలి ప్రపంచకప్‌ విజయం తర్వాత.. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అందిన ఈ మహత్తర విజయం.. సచిన్‌ కెరీర్‌ను పరిపూర్ణం చేసింది. సొంతగడ్డపై దక్కిన ఈ గెలుపు కెప్టెన్‌గా ధోనీకి ఘనకీర్తిని తెచ్చిపెట్టింది. మొత్తంగా క్రికెట్‌ను పిచ్చిగా అభిమానించే దేశానికి గొప్ప కిక్కును అందించింది.
ఎంతో తేడా..: ఆ ప్రపంచకప్‌ విజయానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి పరిస్థితులు, జట్టు, ఆటను పోల్చి చూస్తే ఎంతో తేడా!. ఆనాటి జట్టులో ఉన్న ఆటగాళ్లలో కోహ్లి.. స్పిన్నర్‌ అశ్విన్‌ మాత్రమే ఇంకా టీమ్‌ఇండియాకు ఆడుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎదిగిన విరాట్‌ మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా కూడా జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. మరోవైపు ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న అశ్విన్‌ ఇప్పుడు కేవలం టెస్టులకే పరిమితమయ్యాడు. సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌, జహీర్‌, నెహ్రా, ధోని, యువరాజ్‌ లాంటి దిగ్గజాలు ఒకరి తర్వాత ఒకరుగా ఆటకు వీడ్కోలు పలికారు. రైనా, పియూష్‌ చావ్లా, మునాఫ్‌ పటేల్‌, యూసుఫ్‌ పఠాన్‌, ప్రవీణ్‌ కుమార్‌లు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఇంకా ఆటకు వీడ్కోలు పలకనప్పటికీ హర్భజన్‌ జాతీయ జట్టుకు దూరమై చాలా కాలమవుతోంది. ఫిక్సింగ్‌ నిషేధం నుంచి బయటపడ్డ శ్రీశాంత్‌ తిరిగి పోటీ క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అప్పటి టీమ్‌ఇండియాతో పోలిస్తే ప్రస్తుత భారత్‌ అన్ని రంగాల్లోనూ బలీయమైన శక్తిగా ఎదిగింది. కానీ ఈ పదేళ్ల కాలంలో మరో ప్రపంచకప్‌ను మాత్రం అందుకోలేకపోయింది. 2015, 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ల్లోనూ, 2012, 2014, 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ల్లోనూ విజేతగా నిలవలేకపోయింది. గత రెండు వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌ దాటలేకపోయింది. ఇక పొట్టి ఫార్మాట్లో 2014లో రన్నరప్‌గా నిలిచిన జట్టు.. మిగతా రెండు ప్రపంచకప్‌ల్లో ఫైనల్‌ కూడా చేరలేకపోయింది. అయితే వరుసగా మూడేళ్లలో మూడు ప్రపంచకప్‌ (2021, 2022లో టీ20 ప్రపంచకప్‌లు, 2023లో వన్డే ప్రపంచకప్‌)లు ఉన్న నేపథ్యంలో ఒక్కదాంట్లోనైనా గెలిచి జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలుస్తుందేమో చూడాలి.

‘‘మేం దేశం గర్వపడేలా చేశాం. ప్రజలు ఆనందపడ్డారు. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ల్లోనూ గెలిస్తే అప్పుడు ప్రపంచ క్రికెట్లో టీమ్‌ఇండియాను సూపర్‌ పవర్‌గా పరిగణించేవాళ్లేమో! కానీ పదేళ్లవుతున్నా మరో ప్రపంచకప్‌ గెలవలేకపోయాం. అందుకే ఈ ప్రత్యేక సందర్భంలో గతం గురించి ఎక్కువగా మాట్లాడకూడదని అనుకుంటున్నా. మేం మా బాధ్యతలు నిర్వర్తించాం అంతే’’

- గంభీర్‌

 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని