Updated : 25/05/2021 06:44 IST

Sushil Kumar: దాడి చేసి.. వీడియో తీయించి!

సుశీల్‌ కోరిక మేరకే చిత్రీకరణ
తనంటే భయం కలిగేలా చేయడానికే
కోర్టుకు వెల్లడించిన పోలీసులు
దిల్లీ

సాగర్‌ రాణా హత్య కేసులో సుశీల్‌ పీకల్లోతు ఇరుక్కుపోవడానికి కారణం.. అతడిపై జరిగిన దాడిలో సుశీల్‌ స్వయంగా పాల్గొన్నట్లుగా పోలీసుల దగ్గర వీడియో ఆధారాలు ఉండటమే. సాగర్‌, అతడి ఇద్దరు మిత్రులపై సుశీల్‌ బృందం హాకీ, బేస్‌బాల్‌ బ్యాట్లతో దాడి చేసినట్లుగా వెల్లడైన సంగతి తెలిసిందే. నిందితుల్లో ఒకడైన ప్రిన్స్‌ దాడి ఘటనను వీడియో తీయగా.. సాగర్‌ చనిపోయిన రెండు రోజుల తర్వాత అతణ్ని అదుపులోకి తీసుకున్నపుడు తన మొబైల్‌ పరిశీలించగా అది బయటపడింది. అందులో సుశీల్‌ సైతం సాగర్‌పై దాడి చేస్తున్నట్లు కనిపించడంతో ఈ కేసులో అతడికి వ్యతిరేకంగా పోలీసులకు బలమైన సాక్ష్యం దొరికినట్లయింది. అయితే రెజ్లర్‌గా ఎంతో గొప్ప పేరున్న సుశీల్‌ ఇలా దాడి చేయడమే కాక.. దాన్ని వీడియో తీయించుకోవడమేంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. సాగర్‌ తనను బహిరంగంగా దూషించిన నేపథ్యంలో ఇంకెవరూ ఇలా చేయకుండా, రెజ్లింగ్‌ వర్గాల్లో భయం పుట్టించడానికే సుశీల్‌ చెప్పి మరీ దాడి ఘటనను వీడియో తీయించాడని పోలీసులు చెబుతున్నారు. ‘‘దాడి సందర్భంగా తన మిత్రుడైన ప్రిన్స్‌ను వీడియో తీయమని సుశీలే చెప్పాడు. బాధితులను వాళ్లు గొడ్డును బాదినట్లు బాదారు. తనంటే రెజ్లింగ్‌ వర్గాల్లో భయం కలగాలనే సుశీల్‌ ఇలా చేశాడు’’ అని సుశీల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా పోలీసులు పేర్కొన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. సాగర్‌ మృతి అనంతరం సుశీల్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కాలా జతేది అనే గూండా కూడా కారణమని అంటున్నారు. సుశీల్‌ బృందం దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిలో ఒకడైన సోను.. జతేదికి మేనల్లుడట. ఓవైపు హత్య కేసులో చిక్కుకోవడానికి తోడు జతేది తననేమైనా చేస్తాడన్న భయం కూడా సుశీల్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కారణమని పోలీసు వర్గాలంటున్నాయి. మరోవైపు హత్య కేసు విచారణ జరుగుతున్నందున సుశీల్‌ విషయంలో తాము చేసేదేమీ లేదని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ అన్నాడు. సుశీల్‌ పట్ల తమకు సానుభూతి ఉందని, కానీ అతడి లాంటి దిగ్గజ రెజ్లర్‌ మీద ఇలాంటి అభియోగాలు రావడం వల్ల దేశంలో రెజ్లింగ్‌ ప్రతిష్ఠ దెబ్బ తింటుందన్నది మాత్రం వాస్తవమని అతను చెప్పాడు.

సుశీల్‌పై సస్పెన్షన్‌!

త్య కేసులో అరెస్టయి పోలీసుల రిమాండులో ఉన్న దిగ్గజ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌పై ఉత్తర రైల్వే వేటు వేయబోతోంది. ఆ సంస్థలో సుశీల్‌ చాలా ఏళ్ల నుంచి ఉద్యోగిగా ఉన్నాడు. 2015లో సుశీల్‌ డిప్యుటేషన్‌ మీద ఛత్రశాల స్టేడియంలో ప్రత్యేక అధికారిగా వెళ్లాడు. 2020 వరకు అది కొనసాగింది. డిప్యుటేషన్‌ పొడిగింపు కోరుతూ అతను చేసిన విన్నపాన్ని కొన్ని నెలల ముందు దిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో తిరిగి ఉత్తర రైల్వేలో విధులకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతలో సుశీల్‌.. రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో చిక్కుకున్నాడు. ‘‘దిల్లీ ప్రభుత్వం నుంచి కేసుకు సంబంధించి నివేదిక రైల్వే బోర్డుకు ఆదివారమే అందింది. సుశీల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన నేపథ్యంలో అతడిపై సస్పెన్షన్‌ పడబోతోంది. రెండు రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడతాయి’’ అని ఉత్తర రైల్వే సీపీఆర్‌వో దీపక్‌ కుమార్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని