IPL 2021: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు పట్టం

చెన్నైయా మజాకా. నిరుడు పేలవ ప్రదర్శనతో తొలిసారి సెమీఫైనల్‌కు దూరమై ఆశ్చర్యపరిచిన ధోనీసేన.. ఆ వైఫల్యం తాత్కాలికమేనని బలంగా చాటింది. ఈసారి అలవాటైన రీతిలో అదిరే ప్రదర్శనతో అభిమానులను మురిపించింది.

Updated : 17 Oct 2021 07:27 IST

దుబాయ్‌

చెన్నైయా మజాకా. నిరుడు పేలవ ప్రదర్శనతో తొలిసారి సెమీఫైనల్‌కు దూరమై ఆశ్చర్యపరిచిన ధోనీసేన.. ఆ వైఫల్యం తాత్కాలికమేనని బలంగా చాటింది. ఈసారి అలవాటైన రీతిలో అదిరే ప్రదర్శనతో అభిమానులను మురిపించింది. కోల్‌కతాను మట్టికరిపిస్తూ 2021 ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది. రికార్డు స్థాయిలో తొమ్మిది ఫైనల్స్‌ ఆడిన ఆ జట్టుకు ఇది నాలుగో టైటిల్‌.

నిరుటి వైఫల్యం నుంచి చెన్నై పుంజుకున్న తీరు అద్భుతం. 2020 ఐపీఎలో చెన్నై ప్రదర్శన అందరికీ షాకే. టోర్నీ  మొదలైనప్పటి నుంచి నిరాటంకంగా సెమీఫైనల్‌ చేరిన జట్టేనా ఇది అనిపించింది. పేలవ బ్యాటింగ్‌.. అదే స్థాయిలో బౌలింగ్‌. అసలు ఏ దశలోనూ అది ముందంజ వేసే జట్టులా కనపడలేదు. ధోనీని చూస్తే మళ్లీ ఇంకో ఐపీఎల్‌లో ఆడతాడా అన్న అనుమానం కలిగింది. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఒక్క ఏడాదిలోనే పూర్వ స్థితిలోకి  వచ్చేసిన చెన్నై.. ఆద్యంతం ఛాంపియన్‌లా ఆడింది.

వీళ్లే విజయ సారథులు: వయసు మీద పడ్డా.. బ్యాటుతో మునుపటి వాడి తగ్గినా కెప్టెన్‌గా జట్టును ఎప్పటిలా సమర్థంగా నడిపించాడు ధోని. అయితే చెన్నై మూల స్తంభాలు మాత్రమే ఓపెనర్లే. శుభారంభాలను అందిస్తూ జట్టు విజేతగా నిలవడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు యువ రుతురాజ్‌ గైక్వాడ్‌, అనుభవజ్ఞుడైన డుప్లెసిస్‌. చాలా వరకు మ్యాచ్‌ల్లో ఇద్దరిలో ఒక్కరైనా నిలిచి జట్టును బలమైన స్థితిలో నిలిపారు. టోర్నీ టాప్‌ స్కోరర్లలో వీళ్లు తొలి రెండు స్థానాల్లో ఉండడం విశేషం. రుతురాజ్‌ 45.35 సగటు, 136.26 స్ట్రైక్‌రేట్‌తో 635 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను అందుకుంటే.. డుప్లెసిస్‌ 45.21 సగటు, 138.20 స్ట్రైక్‌రేట్‌తో 633 పరుగులు చేసి రెండో స్థానంలో   నిలిచాడు. ముఖ్యంగా ఫైనల్లో డుప్లెసిస్‌ నిర్ణయాత్మక ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఫైనల్‌ సహా నాలుగు మ్యాచ్‌లే ఆడే అవకాశం లభించినా ఉతప్ప.. విలువైన పరుగులే చేశాడు. బంతితో హేజిల్‌వుడ్‌ (11 వికెట్లు) చెన్నైకి గొప్ప బలాన్నిచ్చాడు. జడేజా (ఎకానమీ  7.06, 13 వికెట్లు), బ్రావో (ఎకానమీ 7.81, 14 వికెట్లు) పొదుపైన బౌలింగ్‌తో జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. కానీ ప్రధాన ఆకర్షణ మాత్రం శార్దూల్‌ ఠాకూరే. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు, వికెట్లు అత్యవసరమైనప్పుడు, దిక్కుతోచని స్థితి ఎదురైనప్పుడు ధోని ఆధారపడ్డది శార్దూల్‌పైనే. అతడు నమ్మింది వికెట్లు తీయగలిగే అతడి సామర్థ్యాన్నే. ఎప్పుడు  బంతినిచ్చినా శార్దూల్‌ నిరాశపరచలేదు. ప్రధాన స్ట్రైక్‌బౌలర్‌గా చాలా గొప్పగా రాణించాడు. కీలక సమయాల్లో, కీలక వికెట్లు పడగొట్టి అతడు మలుపు తిప్పిన మ్యాచ్‌లెన్నో. చెన్నై అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రంగా మారిన శార్దూల్‌.. 21 వికెట్లు పడగొట్టాడు. అతడు మలుపు తిప్పిన మ్యాచ్‌ల్లో ఫైనల్‌ కూడా ఉంది. ఇక్కడ మొయిన్‌ అలీ గురించి కూడా ప్రస్తావించాలి. ఆల్‌రౌండర్‌గా అతడు కూడా ముఖ్య పాత్రనే పోషించాడు. 25.50 సగటుతో 357 పరుగులు పరుగులు చేసిన అతడు.. బంతితో రాణించాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేసిన అలీ.. 6.35 ఎకానమీతో 6 వికెట్లు తీసుకున్నాడు.

చేజారుతున్న ఫైనల్‌ను పట్టేశారిలా..: ఓపెనర్‌గా వచ్చి కడ బంతి వరకూ క్రీజులో ఉన్న డుప్లెసిస్‌ (86; 59 బంతుల్లో 7×4, 3×6) దంచి కొట్టాడు. రుతురాజ్‌ (32), ఉతప్ప (31), మొయిన్‌ అలీ (37 నాటౌట్‌) బ్యాట్‌ ఝుళిపించారు. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన డుప్లెసిస్‌ రుతురాజ్‌తో తొలి వికెట్‌కు 61, ఉతప్పతో రెండో వికెట్‌కు 63, అలీతో మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించి ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఫలితమే 192/3. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. ఫైనల్లో ఫేవరెట్‌గా మారిపోయింది. అయితే అంత భారీ స్కోరు చేసినా సూపర్‌కింగ్స్‌కు టెన్షన్‌ తప్పలేదు. వెంకటేశ్‌ అయ్యర్‌ (51; 32 బంతుల్లో 5×4, 3×6), శుభ్‌మన్‌ గిల్‌ (50; 43 బంతుల్లో 6×4) కోల్‌కతాకు బలమైన పునాది వేసి.. చెన్నైని ఆందోళనకు గురి చేశారు. గిల్‌ ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమైతే.. అయ్యర్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఖాతా అయినా తెరవకముందే ధోని ఓ తేలికైన క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అయ్యర్‌.. అవకాశాన్ని సొమ్ము చేసుకున్నాడు. 10 ఓవర్లకు కోల్‌కతా 88/0. చేయాల్సిన స్కోరు ఎక్కువే ఉన్నా.. ఆ జట్టు గెలుపుపై కన్నేసిన దశ అది. కానీ పరిస్థితి చెన్నై చేయి దాటుతున్న వేళ..శార్దూల్‌ ఠాకూర్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 11వ ఓవర్లో అతడు ప్రమాదకరంగా ఆడతున్న అయ్యర్‌తో పాటు నితీష్‌ రాణా (0)ను ఔట్‌ చేయడం ద్వారా ప్రత్యర్థిని గట్టి దెబ్బతీశాడు. అక్కడి నుంచి చెన్నై మ్యాచ్‌పై పట్టుబిగించింది.  క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ, సాధించాల్సిన రన్‌రేట్‌ను పెంచుతూ కోల్‌కతాపై ఒత్తిడి పెంచింది. మ్యాచ్‌లా చాలా వేగంగా నైట్‌రైడర్స్‌ చేతుల్లో నుంచి పోయింది. 12వ ఓవర్లో నరైన్‌ను హేజిల్‌వుడ్‌ వెనక్కి పంపగా.. ఓపిగ్గా ఆడుతున్న గిల్‌ను 14వ ఓవర్లో చాహర్‌ వెనక్కి పంపాడు. అయితే 15వ ఓవర్‌తో కోల్‌కతా ఆశలు అడుగంటాయి. జడేజా ఒకే ఓవర్లో కార్తీక్‌, షకిబ్‌ను ఔట్‌ చేయడంతో కోల్‌కతా 120/6తో ఓటమి బాట పట్టింది. రాహుల్‌ త్రిపాఠి, మోర్గాన్‌ కూడా ఇలా వచ్చి అలా వెళ్లడంతో ఆ జట్టు 16.3 ఓవర్లలో 125/8కి చేరుకుంది. ఆ తర్వాత పరాజయం లాంఛనమే. డుప్లెసిస్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించగా.. హర్షల్‌ పటేల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును అందుకున్నాడు.


32
ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఉన్న హర్షల్‌ పటేల్‌ చేజిక్కించుకున్న వికెట్లు. అవేష్‌ ఖాన్‌ (24) రెండో స్థానంలో ఉన్నాడు.

100
ఈ సీజన్‌లో ఛేదనలో చెన్నై గెలుపు శాతం 100. ఛేదించిన ఆరుసార్లూ ఆ జట్టు గెలిచింది.

635
ఈ ఐపీఎల్‌లో టాప్‌ స్కోరరైన రుతురాజ్‌ గైక్వాడ్‌ చేసిన పరుగులు.


సీఎస్కే ప్రయోజనాల కోసం..

దుబాయ్‌: చెన్నై తరఫున వచ్చే సీజన్‌లోనూ ఆడే విషయాన్ని ధోని కొట్టిపారేయట్లేదు. కానీ ఫ్రాంఛైజీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటానని అతడు చెప్పాడు. ‘‘సీఎస్కేకు ఏది మంచిదో మేం నిర్ణయించాలి. అది ముగ్గురు కావొచ్చు లేదా నలుగురు కావొచ్చు.. ఫ్రాంఛైజీ అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలో నేనుంటానా లేదా అన్నది ముఖ్యం కాదు. బలమైన జట్టు ఉండేలా, ఫ్రాంఛైజీ ఇబ్బంది పడకుండా చూడడం ముఖ్యం. వచ్చే వేలంతో వచ్చే పదేళ్ల కోసం జట్టును తయారు చేసుకోవాలి. 2008 నుంచి చెన్నై ప్రధాన జట్టు పదేళ్లకు పైగా ఉంది. వచ్చే పదేళ్లు కూడా ప్రధాన జట్టుతో ముందుకెళ్లడానికి మేం బాగా కష్టపడాలి’’ అని ధోని అన్నాడు.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని