Updated : 18/10/2021 07:21 IST

T20 World Cup: కూర్పు కుదిరేనా?

 వార్మప్‌ మ్యాచ్‌లకు సిద్ధమైన టీమ్‌ఇండియా

 నేడు ఇంగ్లాండ్‌తో ఢీ

 టీ20 ప్రపంచకప్‌

రాత్రి 7.30 నుంచి

ఐపీఎల్‌లో వివిధ జట్ల తరపున ఆడేందుకు విడిపోయిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు మళ్లీ కలవాల్సిన సమయం వచ్చేసింది. లీగ్‌లో ఆయా ఫ్రాంఛైజీల తరపున గొప్ప ప్రదర్శనతో అదరగొట్టిన మన క్రికెటర్లు.. ఇప్పుడు జాతీయ జట్టు తరపున అదే జోరు కొనసాగించాల్సిన తరుణం ఆసన్నమైంది. టీ20 ప్రపంచకప్‌ను పట్టేయాలనే పట్టుదలతో ఉన్న కోహ్లీసేన.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పోరుకు ముందు రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో సోమవారం ఇంగ్లాండ్‌తో తలపడనుంది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న భారత్‌కు జట్టు కూర్పు ఒక్కటే సమస్యగా మారింది. మరి.. అందుకు పరిష్కారం కనుక్కునే దిశగా ఈ వార్మప్‌ మ్యాచ్‌లను జట్టు ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.

దుబాయ్‌

రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ భాగస్వామిగా కేఎల్‌ రాహుల్‌ను పంపిస్తారా? లేదా ఇషాన్‌ కిషాన్‌కు అవకాశమిస్తారా? హార్దిక్‌ పూర్తి కోటా బౌలింగ్‌ చేసి మళ్లీ ఆల్‌రౌండర్‌గా మారతాడా? లేదా స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే కొనసాగుతాడా? జడేజాతో పాటు స్పిన్‌ భారాన్ని మోసేదెవరూ? శార్దూల్‌ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా?.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో ప్రధాన మ్యాచ్‌లకు ముందు టీమ్‌ఇండియాకు సమాధానం దొరకాల్సిన ప్రశ్నలున్నాయి. దాదాపు భారత జట్టులోని ఆటగాళ్లందరూ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆడారు కాబట్టి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ వాళ్లకు ఇబ్బంది కాదు. కానీ ఈ నెల 24న దాయాది పాకిస్థాన్‌తో పోరుతో పొట్టి ప్రపంచకప్‌ వేటను మొదలెట్టనున్న కోహ్లీసేన.. అంతకుముందే వార్మప్‌ మ్యాచ్‌ల్లో కూర్పుపై కసరత్తు చేసి తుది జట్టుపై ఓ స్పష్టతకు రావాల్సిన అవసరం ఉంది.

ఎవరు.. ఎక్కడ?

వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎలాగో ఓపెనర్‌గా ఆడతాడు. అతనితో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించేందుకు రాహుల్‌, ఇషాన్‌ మధ్య పోటీ ఉంది. ఒత్తిడిని తట్టుకుని రాణించడంలో అనుభవమున్న రాహుల్‌కే మరో ఓపెనర్‌గా ఛాన్స్‌ దక్కే ఆస్కారం ఉంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లోనూ అతను (14 మ్యాచ్‌ల్లో 626 పరుగులు) సత్తాచాటాడు. కానీ నెమ్మదిగా బ్యాటింగ్‌ మొదలెట్టి ఆఖర్లో చెలరేగడం అలవాటుగా మార్చుకున్న రాహుల్‌.. పవర్‌ప్లేలో వేగంగా ఆడలేకపోవడం ప్రతికూలంగా మారే అవకాశముంది. మరోవైపు రోహిత్‌తో కలిసి ముంబయి ఇండియన్స్‌ తరపున చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా ఆడిన ఇషాన్‌ ధనాధన్‌ అర్ధశతకాలతో అదరగొట్టాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే మెరుపు షాట్లలో విరుచుకుపడడం అతనికి కలిసొచ్చే అంశం. ఒకవేళ జట్టు రాహుల్‌ వైపే మొగ్గుచూపితే ఇషాన్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడో చూడాలి. మరోవైపు 2019లో వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోతున్న హార్దిక్‌ పాండ్య ఈ ప్రపంచకప్‌లో ఏ పాత్ర పోషిస్తాడోననే ఆసక్తి కలుగుతోంది.

అతను మళ్లీ ఆల్‌రౌండర్‌గా కనిపిస్తాడా? లేదా ఫినిషర్‌గా మారి మ్యాచ్‌లు ముగిస్తాడా? అనే విషయంపై స్పష్టత అవసరం. అతను బ్యాటింగ్‌ ఆర్డర్లో పంత్‌ కంటే ముందు వస్తాడా లేదా ఆరో స్థానంలో దిగుతాడా అన్నది తేలాల్సి ఉంది. యూఏఈ, ఒమన్‌లోని పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా టీమ్‌ఇండియా ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశాలున్నాయి. జడేజా తుది జట్టులో కచ్చితంగా ఉంటాడు. ఇక ఫిట్‌గా ఉంటే వరుణ్‌ చక్రవర్తికి కూడా అవకాశం దక్కుతుంది. ఇక మూడో స్పిన్నర్‌ స్థానం కోసం రాహుల్‌ చాహర్‌, అశ్విన్‌ పోటీ పడుతున్నారు. నెమ్మదిగా స్పందించే యూఏఈ వికెట్ల మీద మంచి పేస్‌ రాబట్టినందుకే యుజ్వేంద్ర చాహల్‌ను కాదని చాహర్‌ను జట్టులోకి ఎంపిక చేశామని కోహ్లి చెప్పిన నేపథ్యంలో.. తుది జట్టులోనూ రాహుల్‌కు చోటు దక్కే వీలుంది. భువనేశ్వర్‌, బుమ్రా పేస్‌ భారాన్ని మోస్తారు. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లనే ఆడించాలనుకుంటే.. శార్దూల్‌ జట్టులోకి వచ్చే ఆస్కారం ఉంది. మరోవైపు కెప్టెన్‌ మోర్గాన్‌ ఫామ్‌ సహా ఇతర సమస్యలతో ఇంగ్లాండ్‌ ఇబ్బంది పడుతోంది. భారత్‌తో వార్మప్‌ మ్యాచ్‌తో తిరిగి గాడిన పడాలని ఆ జట్టు చూస్తోంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని