Team India: కోచ్‌ కావలెను

బాధ్యతలు స్వీకరించేందుకు ఇప్పటికే మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను ఒప్పించిన బీసీసీఐ.. ప్రధాన కోచ్‌ పదవిని భర్తీ చేసేందుకు ఆదివారం లాంఛనంగా ప్రకటన విడుదల చేసింది. ముగ్గురు సహాయ కోచ్‌ల కోసం కూడా దరఖాస్తులు ఆహ్వానించింది.

Updated : 18 Oct 2021 07:23 IST

దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ

ద్రవిడ్‌ ఎంపిక లాంఛనమే

దిల్లీ: బాధ్యతలు స్వీకరించేందుకు ఇప్పటికే మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను ఒప్పించిన బీసీసీఐ.. ప్రధాన కోచ్‌ పదవిని భర్తీ చేసేందుకు ఆదివారం లాంఛనంగా ప్రకటన విడుదల చేసింది. ముగ్గురు సహాయ కోచ్‌ల కోసం కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప ఎన్‌సీఏ అధిపతిగా ఉన్న ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌ కావడం లాంఛనమే. ఐపీఎల్‌ సందర్భంగా బీసీసీఐ పెద్దలతో జరిగిన చర్చల్లో బాధ్యతలు చేపట్టేందుకు అతడు అనధికారికంగా అంగీకరించాడు. అయితే నిబంధనల ప్రకారం.. బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. తాజా ప్రకటన ప్రకారం ఇప్పుడు ఎంపికైన ప్రధాన కోచ్‌, బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌లు 2023 ప్రపంచకప్‌ వరకు విధుల్లో ఉంటారు. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ ఆక్టోబరు 26.

ప్రస్తుత ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ల పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది. బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోర్‌ తిరిగి దరఖాస్తు చేసుకుంటే పొడిగింపు లభించే అవకాశముంది. ఇక బౌలింగ్‌ కోచ్‌గా.. ద్రవిడ్‌కు సన్నిహితుడైన అండర్‌-19 కోచ్‌ పరాస్‌ మాంబ్రే ఎంపికయ్యే అవకాశముంది. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వ్యక్తి కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి లేదా ఏదైనా జాతీయ జట్టుకు రెండేళ్లు లేదా ఏదైనా ఐపీఎల్‌ జట్టుకు మూడేళ్లు కోచ్‌గా పని చేసి ఉండాలి. సహాయ కోచ్‌లు కావాలనుకునే వారికి కనీసం 10 టెస్టులు లేదా 25 వన్డేల అనుభవం ఉండాలి లేదా ఏదైనా ఐపీఎల్‌/ఏ జట్టుతో మూడేళ్ల పాటు పని చేసి ఉండాలి. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో స్పోర్ట్స్‌ సైన్స్‌ మెడిసిన్‌ హెడ్‌ పదవికి కూడా బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని